పథకాల ప్రచారం, చేరవేతలో ముఖ్య పాత్ర
సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి
విజయవాడ : సంక్షేమ ఫలాలు ప్రజలు సద్వినియోగం చేసుకోవడంలో సమాచార శాఖ సేవలు అనివార్యమని, విస్తృత ప్రచారం ద్వారా సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో మీడియా సహకారం ఎంతో అవసరమని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు.
నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ ఆవరణలో గల జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయపు అడ్మినిస్ట్రేటివ్, మీడియా హాల్‌ను గురువారం సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్‌లు ప్రారంభించారు. అనంతరం సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద బలహీన వర్గాలకు ఆర్థిక ప్రయోజనం కల్పించేలా సుమారు 35కు పైగా సంక్షేమ పథాకాలు అమలు చేస్తుందన్నారు.
ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి విస్తృతమైన ప్రచారం అవసరమన్నారు. పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరువ చేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ సేవలు అనివార్యమన్నారు. అర్హత ఉన్న ప్రతి లబ్దిదారునికి సంక్షేమ ఫలాలను పారదర్శకంగా చేరువ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోను లేని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో సమాచార శాఖకు మౌలిక సదుపాయాలు, వనరులను సమకూర్చడంలో కలెక్టర్ డిల్లీరావు అందిస్తున్న సహకారం మరువలేమన్నారు.
జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ, సమాచార శాఖ సేవలు ఎంతో కీలకమన్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యమైన భాగమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమాచార శాఖ వారధిగా పనిచేస్తుందన్నారు. అత్యంత ప్రముఖులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధుల పర్యటనలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం అందించడం సంబంధిత వార్తలు, ఫోటోలను పంపిణీ చేయడంతో పాటు మీడియా ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించడంలో సమాచార శాఖ అధికారులు, సిబ్బంది నిత్యం అలుపెరగని సేవలందిస్తున్నారన్నారు.
జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించి వివిధ విభాగాల ఏర్పాటుకు అనువైన కార్యాలయాల కొరతను తీర్చేందుకు భవనం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్, టి.కస్తూరిబాయి, డిఐపిఆర్వో యు.సురేంద్రనాథ్, డిపిఆర్వో ఎస్.వి.మోహన్‌రావు, డ్వామా పిడి జె.సునీత, డిపివో జయచంద్ర గాంధీ, జిల్లా సాంఘిక సంక్షేమ విద్యాలయాల సంస్థ అధికారిణి బి.సుమిత్రా దేవి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ జె.సుమన్, సమాచార శాఖ ఉద్యోగులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.