Suryaa.co.in

National

పాపం.. అమాయక ఎమ్మెల్యే!

( సుబ్బు)

ఒకప్పుడు ఎమ్మెల్యే అంటే ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వచ్చే బస్సు ఎక్కి అసెంబ్లీకి వెళ్లేవారు. మరిప్పుడు? 2 కోట్ల రూపాయలకు తక్కువగాని ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. వందలకోట్ల కంపెనీలకు అధిపతులవుతున్నారు. రెండు-మూడు తరాలకు సరిపడా సంపద సృష్టిస్తున్నారు. మరి ఇలాంటి ఖరీదైన కాలంలో కూడా ఓ సత్తెకాలపు సత్తయ్యలు ఎమ్మెల్యేలుగా గెలుస్తుండటం హాశ్చర్యమే.

ఓటుకు 2 వేలు ఇస్తేగానీ గెలవలేని ఈ జమానాలో.. నయాపైసా పంచకుండా ఏకంగా 53,597 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచిన ఈ లెఫ్ట్ పార్టీ అభ్యర్ధి పేరు మహబూబ్ ఆలం. బీహార్ లోని బలరామ్‌పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈయన. ఆలమ్‌కు ఖరీదైన కార్లు లేవు. ఫ్లైట్ టికెట్లు పెట్టే స్పాన్సర్లూ లేరు. కార్లు ఇచ్చే పోషించే కాంట్రాక్టర్లూ లేవు. ఆయనకు తెలిసింది నడకే. బస్సు సౌకర్యం ఉంటే బస్సెక్కుతారు. లేకపోతే నడకే మార్గం! ఇప్పుడు తన కొడుకును పైన ఎక్కించుకుని నడుచుకుంటూ వెళుతున్న ఈ అమాయక ఎమ్మెల్యేని చూసి, బహుశా మన ఖరీదైన ప్రతి‘నిధులు’ జాలిగా చూస్తారేమో? తమ లెక్క.. హాయిగా ఏ లిక్కరు షాపుల వాళ్ల దగ్గరో, ఇసుక కాంట్రాక్టర్ల దగ్గరో, రేషన్ మాఫియా దగ్గరో, మైనింగ్ మాఫియా పంపే లారీలకు ఇంత అని వసూలు చేసుకుని రెండు మూడు తరాల వరకూ బిందాస్‌గా ఉండకుండా.. ఇలా ఉంటే ఎలా బతుకుతాడన్నది? వారి జాలి చూపులకు అర్ధం కావచ్చు. కానీ ఆలమ్ మాత్రం నా దారి రహదారి అదే అంటున్నాడు.

ఓసారి ఆలమ్‌బాబును మన తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చి.. మార్టూరు, చీమకుర్తి, అద్దంకి, రేపల్లె, నెల్లూరు, ఆత్మకూరు, శ్రీకాళహస్తి, విశాఖ, కాకినాడ, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు తీసుకువస్తే.. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ కళ అబ్బుతుందేమో? మంచి చేయడం కష్టం గానీ.. చెడగొట్టడం ఎంత సేపేమిటి?

ఏదేమైనా.. కార్పొరేటర్లు కూడా కోట్ల రూపాయల కార్లలో తిరుగుతున్న ఖరీదైన కాలంలో, పెళ్లాం బిడ్డలతో పాదయాత్రలు చేస్తున్న ఈ అమాయక చక్రవర్తికి సెల్యూట్ చేయాల్సిందే!

LEAVE A RESPONSE