– 2030 నాటికి ఈవీ బ్యాటరీలకు, పునరుత్పాదక శక్తి సాంకేతికతకు మూడు రెట్లు డిమాండ్
– అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర
– ఒకే మిషన్ లో 103 శాటిలైట్లను ప్రయోగించిన ఘనత
– గచ్చిబౌలిలోని టీ-హబ్‌లో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో.. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ సెమినార్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: నగరం సృజనాత్మకతకు, శాస్త్ర, సాంకేతిక రంగాలకు హబ్ లాంటిది. పరిశోధనలు, ఎంట్రప్రెన్యూర్ షిప్ కు అనువైన వాతావరణం హైదరాబాద్ లో ఉంది. గత 11 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రతి రంగంలోనూ శాస్త్రీయ దృక్పథం పెరిగింది.
నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కూడా అదే శాస్త్రీయ దృక్పథంతో ఏర్పాటైంది. ఇటీవల ఎగుమతులపై ఆంక్షలు, అంతర్జాతీయంగా ఏర్పడిన రాజకీయ సంక్షోభ పరిస్థితుల కారణంగా ఉత్పత్తుల సరఫరాలో ఇబ్బందుల నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానం ప్రాముఖ్యత పెరిగింది.
2030 నాటికి ఈవీ బ్యాటరీలకు, పునరుత్పాదక శక్తి సాంకేతికతకు మూడు రెట్లు డిమాండ్ పెరుగుతుంది. దీంతో క్రిటికల్ మినరల్స్ అవసరం మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది.
ఇందులో భాగంగా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద ఇప్పటికే దేశంలో 4 ఐఐటీలు, 3 రీసెర్చ్ ల్యాబొరేటరీలను సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా తీర్చిదిద్దాం. 2047 నాటికి భారతదేశం ఆత్మ నిర్భరత దేశంగా రూపుదిద్దుకొని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడంలో క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.
గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితంగా గనుల రంగంలో సమూల మార్పులు జరిగాయి. గత కొన్నేళ్లలో బొగ్గు, గనుల రంగంలో అనేక రికార్డులను తిరగరాశాం.
చరిత్రలోనే తొలిసారిగా బొగ్గు ఉత్పత్తి, రవాణాలో 1 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేధించడం సంతోషంగా ఉంది. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ పై ప్రస్తుతం దృష్టి కేంద్రీకరిస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించి తొలి బ్లాక్ వేలం వేయనున్నాం.
ఆఫ్ షోర్ మినరల్ బ్లాక్స్ కు సంబంధించి తొలిసారి వేలం ప్రక్రియ చేపట్టాం. ఖనిజాల వెలికితీతలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెంచడంతో పాటు, ఎక్స్ ప్లొరేషన్ వేగవంతం చేసేందుకు తొలిసారిగా ఎక్స్ ప్లొరేషన్ లైసెన్స్ బ్లాక్స్ వేలం ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశాం.
ఇవాళ, క్రిటికల్ మినరల్స్‌కు సంబంధించి 6వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. మొత్తం 23 బ్లాకులకు సంబంధించి ఈ ప్రక్రియ చేపట్టాం. ఈ వేలం ప్రక్రియలో తెలంగాణ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తొలిసారిగా పాల్గొనడం ఆనందంగా ఉంది.
క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించుకున్న కొద్ది నెలల్లోనే కార్యాచరణ మొదలుపెట్టడం చూసి, అనేకమంది ఆశ్యర్యపోతున్నారు. రీసైక్లింగ్ ను బలోపేతం చేసేందుకు ఇటీవల రూ.1500 కోట్లతో ప్రారంభించిన సరికొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఈ స్కీం ద్వారా క్రిటికల్ మినరల్స్ ను ఉత్పత్తి చేసేందుకు దోహదపడటమే కాకుండా, 8 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల ఉద్యోగావకాశాలు కలుగుతాయి.
మైన్స్, మినరల్స్ అభివృద్ధి, నియంత్రణ చట్టంలో పలు సవరణలు చేసి మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సవరణల ద్వారా లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి డీప్ సీటెడ్ మినరల్స్ ను మైనింగ్ చేసే అవకాశం వచ్చింది. నేషనల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ ద్వారా విదేశాల్లో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టేందుకు నిధులను సమకూర్చుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ కాబిల్ ఇప్పటికే అర్జెంటీనాలో లిథియం బ్లాకులను సొంతం చేసుకుని, వెలికితీత ప్రారంభించింది. జాంబియా, చిలీలో కూడా గనులను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. అలాగే క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు సంబంధించి నాలెడ్జ్ పంచుకునేందుకు జపాన్, పెరూ వంటి దేశాలతో భారత్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటున్నాం.
మన దేశ రైతులు, జవాన్లను గౌరవించుకునేందుకు 1965లో రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదం చేశారు. 1998లో పోఖ్రాన్ పరీక్ష సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజపేయి ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ అనే నినాదం ఇచ్చారు.
ఆ మహానుభావులు ఇచ్చిన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ అన్న నినాదం తీసుకొచ్చారు. వికసిత భారత్ సాధించే దిశగా సృజనాత్మకత పెంపొందించడం, పరిశోధనలు పెంచాలన్న లక్ష్యాన్ని ఈ నినాదం ద్వారా మోదీ చాటిచెబుతున్నారు.
ఐఐటీల్లాంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలు మన దగ్గర ఉండబట్టే.. క్రిటికల్ మినరల్స్ కోసం సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేసుకుని, పరిశోధనా రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నాం.
2025 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ జాబితాలో మన దేశానికి చెందిన 46 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. 2015లో 11 సంస్థలు మాత్రమే ఆ జాబితాలో ఉన్నాయి. 2014 నుంచి 2025 నాటికి ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కు పెరగడమే కాకుండా, వాటిల్లో సీట్లు కూడా 65 వేల నుంచి 1.35 లక్షలకు పెరిగాయి. చంద్రుడి దక్షిణ ధృవంపై మనం అడుగుపెట్టాం.
ఒకే మిషన్ లో 103 శాటిలైట్లను ప్రయోగించిన ఘనత సాధించాం. ఇలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలనే పట్టుదలతో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లు శ్రమించాలి. అప్పుడే మన దేశంలో క్రిటికల్ మినరల్స్ అవసరాలను తీర్చడం కుదురుతుంది.
2047 నాటికి వికసిత భారత్ గా ఎదగాలంటే సృజనాత్మకతే సిసలైన మంత్రం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ గుర్తు చేస్తుంటారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడుస్తూ కీలకమైన క్రిటికల్ మినరల్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ ప్రారంభించి 10 ఏళ్లు గడుస్తున్నాయి. గనుల తవ్వకాల ద్వారా వచ్చే నిధుల నుంచి కార్మికులు, స్థానికులు లబ్ధి పొందాలి. వారందరికీ గౌరవంతో పాటు భద్రత కలిగించేందుకు బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుల అమూల్యమైన సేవలకు గుర్తింపుగా రూ.1 కోటి వరకు బీమా కవరేజీ అందిస్తున్నాం.