Suryaa.co.in

Andhra Pradesh

బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి

– బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం
– బుడమేరు వరద నివారణ కు డీపీఆర్ సిద్ధం చేయండి
– అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం

అమరావతి : బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు.

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆ జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ముందుగా అధికారులు ప్రభుత్వం సహాయంపై ముఖ్యమంత్రికి వివరించారు. మొత్తం 4,21,698 మందికి రూ.625 కోట్లు ఆర్థిక సాయం అందించామని తెలిపారు. కేవలం 70 మందికి మాత్రమే ఇంకా పరిహారం అందలేదని….అది కూడా వారి బ్యాంక్ ఖాతాలు యాక్టివ్ గా లేకపోవడం వల్లనే సమస్య వచ్చిందని తెలిపారు.

మరో 200 దరఖాస్తులు ఇప్పటికీ పరిశీలనలో ఉన్నాయని వాటిలో అర్హులకు ప్రభుత్వ సాయం అందిస్తామని వివరించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ మాట్లాడుతూ…చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరద బాధితులకు ప్రభుత్వం సాయం చేసిందని….గతంలో ఇంత మొత్తంలో సాయం చేసిన సందర్భం ఎన్నడూ ఎక్కడా లేదని సీఎం అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందించాలనే ప్రయత్నంలో తాము ఉన్నామని…చివరి బాధితుడి వరకు ప్రభుత్వ సాయం చేరుతుందని సీఎం అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వరదలకు నష్టపోయిన వాహనదారులకు బీమా చెల్లింపు దరఖాస్తుల్లో ఇంకా 262 పెండింగులో ఉండటంపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.

గతంలో విశాఖపట్నంలో హుదుద్ తుపాన్ వచ్చిన సమయంలో కేవలం నెల రోజుల్లోపే బాధితులకు బీమా సొమ్మును అందించామని, ఆ తరహాలో ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. పెండింగులో ఉన్న క్లెయిమ్ దరఖాస్తులన్నీ 15 రోజుల్లో పరిష్కరించి బాధితుల ఖాతాలో బీమా సొమ్ము జమ చేయాలని బీమా సంస్థల ప్రతినిధులు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

అదే విధంగా లబ్ధిదారుల జాబితాను వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. భవిష్యత్తులో బెజవాడకు వరద ప్రమాదం లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. దీనికి సంబంధించి తక్షణం డీపీఆర్ రూపొందించాలన్నారు. కాలువ గట్లకు, కరకట్టలకు గండ్లు పండకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టడానికి, దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు సంబంధించి కేంద్ర నుండి నిధులు గ్రాంటు రూపంలో వస్తాయని, ఆ నిధులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఆపరేషన్ బుడమేరులో భాగంగా ఆ ప్రాంత ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించి వారికి శాశ్వత పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. వరదల్లో దెబ్బతిన్న చిరు వ్యాపారులకు చెల్లించాల్సిన పరిహారాన్ని తక్షణం విడుదల చేయాలని ఆదేశించారు. వరదలకు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో స్వయంగా చూశానని, ఏ ఒక్కరికీ సాయం అందకుండా ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE