Suryaa.co.in

Telangana

మానవ వనరులను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్

– ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్లు మండలం గోవిందాపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

మధిర: ప్రపంచ స్థాయిలో పోటీపడే మానవ వనరులను భవిష్యత్తు తరాలకు అందించాలనే ఆలోచనతోనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం పనులకు భూమి పూజ చేస్తున్నాంసమాజాన్ని కులాలు, మతాలకు అతీతంగా ఉమ్మడి కుటుంబం గా ముందుకు తీసుకువెళ్లాలనే కాంగ్రెస్ మూల సిద్ధాంత అనుభవంతోనే ఈ పాఠశాలల నిర్మాణానికి ఆలోచన చేశాం.

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు విధానాలు రూపొందిస్తున్నాం.ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వస్తే ప్రస్తుతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, జనరల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎత్తివేస్తారన్న భావనలో కొందరు ఉన్నారు.. అవి కొనసాగుతాయి.. వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తాం.

ప్రతిపక్షాల ఉడత ఊపులకు అభివృద్ధి కార్యక్రమాలు ఆపము.ప్రజాస్వామ్య తెలంగాణలో సమ సమాజం లక్ష్యాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. నేను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న.. నేను ఎదుర్కొన్న చిన్న ఇబ్బంది కూడా మరొకరు ఎదుర్కోవద్దన్న ఆలోచనతో ప్రతి చిన్న విషయాన్ని గమనంలో పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నమూనాలను రూపొందించాం. ప్రతి తల్లి కోరికను మనసులో పెట్టుకొని నేను ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిజైన్లు రూపొందించాం. మంత్రిమండలిలో చర్చించి కార్యాచరణ రూపొందించాం.

ప్రభుత్వ పాఠశాలలో కరెంటు, నీళ్లు వంటి ప్రాథమిక సమస్యలు తీర్చేందుకు 1100 కోట్లు కేటాయించి ఆ పనుల బాధ్యతలు డ్వాక్రా సంఘాలకు అప్పగించాం. విద్యాసంస్థలు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేకుండా ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాం.

పదేళ్లుగా పదోన్నతులకు నోచుకోని 21,419 ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి నమ్మకాన్ని సృష్టించాము. 34,706 మంది ఉపాధ్యాయులను పారదర్శకంగా బదిలీ చేసి సమస్యలు పరిష్కరించాం.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆలోచన ప్రకటించగానే అంత ఆశ్చర్యపోయారు. ఒక ఏడాదిలోనే ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తాం అంటే సాధ్యం అయ్యే పనేనా అన్నారు నవ్వుకున్నారు. గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల బడ్జెట్లో ఈ రంగానికి కేటాయించింది కేవలం 73 కోట్లు మాత్రమే అన్నారు.

చిత్తశుద్ధి, సంకల్ప బలంతో చేసే పని మంచిదైతే సాధ్యం కానిది లేదని మేము నిరూపించాం. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 30 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు భూమి పూజ చేశాం. సీఎం రేవంత్ రెడ్డి షాద్నగర్లో, నేను గోవిందాపురంలో, రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో ఏకకాలంలో భూమి పూజలు చేశారు. ఏడాది మొత్తంగా శంకుస్థాపనలు చేయకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో శంకుస్థాపనలు చేయడం మా చిత్తశుద్ధికి నిదర్శనం.

ప్రపంచంలో అనేక సమస్యలకు పరిష్కారం, అసమానతలు లేని సమాజ నిర్మాణానికి విద్య ప్రధానం. అందుకే కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నాం.

స్థల సేకరణ, వాతావరణం, అన్ని అంశాలను సాంకేతిక పద్ధతుల్లో అధ్యయనం చేసి డిజైన్లు రూపొందించిన తర్వాతే భూమి పూజలు చేస్తున్నాం.

LEAVE A RESPONSE