– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ : ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి 25 మంది లోక్ సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. రాష్ట్ర హక్కుల మీద ఎవరైనా మాట్లాడుతారు అని చూస్తున్నాం.
ఈ సమావేశాల్లో కూడా ఎంపీలు బుద్ధిమంతులుగా కూర్చుంటున్నారు. మోడీ మాట్లాడితే పోటీపడి చప్పట్లు కొడుతున్నారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు.
విభజన హక్కులు నెరవేరక 11 ఏళ్లు అయ్యింది. విభజన హామీలు ఆంధ్ర ప్రజల హక్కులు. మరి ఈ విషయం ఎంపీలకు గుర్తుకు ఉందో లేదో తెలియదు. లేకపోతే గుర్తు లేనట్లు నటిస్తున్నారో అర్ధం కావడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎంపీలకు సొంత రాజకీయాలు ముఖ్యం. హామీలు, హక్కుల మీద పోరాటం కంటే మోడీ మెప్పు వీరికి మిన్న. ఎంపీలుగా దిల్లీలో పదవులు అనుభవిస్తున్నారు. పేరుకు మాత్రమే వేరు వేరు పార్టీ ఎంపీలు.
నిజానికి రాష్ట్ర ఎంపీలు బీజేపీకి బినామీ ఎంపీలు. మోడీ చేతుల్లో రబ్బర్ స్టాంప్స్. బీజేపీ చేతిలో ఎంపీలు కీలుబొమ్మలు. 11 ఏళ్లుగా ఏ ఒక్క విభజన హామీ నెరవేరలేదు. అయినా రాష్ట్ర పార్టీలకు,ఎంపీలకు పట్టింపు లేదు.
విభజన హామీల మీద ఒక్కరు నోరువిప్పడం లేదు. 2014 లో విభజన చట్టం రూపొందించారు. ఇందులో ప్రత్యేక హోదా 5 ఏళ్లు ఇవ్వాలని హామీ ఇచ్చారు.
పోలవరం కి జాతీయ హోదా ఇచ్చారు. ఏపీ రాజధాని కేంద్రం కడుతుంది అని చెప్పారు. కడప స్టీల్, దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణం కేంద్రం హామీ. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. విభజన హామీల్లో ఇప్పటి దాకా 5 శాతం కూడా నెరవేరలేదు. 95 శాతం హామీలు తుంగలో బీజేపీ తొక్కింది. విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన హామీలు. విభజన చట్టం పకడ్బందీగా తయారు చేశారు. ఇంతటి చట్టం ఎందుకు అమలు అవ్వడం లేదు?
చట్టబద్ధత ఉన్నప్పుడు ఎందుకు పోరాటం చేయడం లేదు? మన రాష్ట్రానికి విభజన హామీలు అవసరం లేదా? మన బిడ్డలు బాగుపడాలని నాయకులకు లేదా? రాష్ట్ర ప్రజల బాగు కోసం ఎంపీలు ఎందుకు నిలబడటం లేదు? మోడీ మోసం చేస్తుంటే ఎందుకు భజన చేస్తున్నారు? అహో మోడీ, ఓహో మోడీ..డబుల్ ఇంజన్ లు…విజన్ లు..వంకాయలు అని పొగడటం ఏంటి?
ఎంపీలుగా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా? ప్రజలు ఓట్లు వేస్తే విభజన హామీల మీద ఎందుకు మాట్లాడటం లేదు? విభజన హామీల మీద పోరాటాలు ఏవీ? ఎంతసేపు బీజేపీ బిల్లులకు గొర్రెలా తల ఊపుతున్నారు.
తిరుపతి వేదికగా మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తాం అన్నారు. 11 ఏళ్లు దాటినా హోదా అంశం పట్టింపు లేదు. హోదా ఈ 10 ఏళ్లు వచ్చి ఉంటే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేది. మోడీ హోదా విషయంలో మోసం చేస్తే…సంజీవనా అని చంద్రబాబు మోసం చేశారు.
మెడలు వంచి హోదా తెస్తాం అన్న జగన్ మోదీకి మెడలు వంచి నమస్కారం చేస్తున్నాడు. హోదా అంటే చివరికి బూతుపదంగా మార్చారు. ఇంగ్లీష్ డిక్షనరీ నుంచి హోదా అనేది లేనట్లు వ్యవహరిస్తున్నారు. పోలవరం జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్. పోలవరాన్ని ప్రాజెక్ట్ కాస్త రిజర్వాయర్ గా మార్చారు. గ్రావిటీ ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు. 45 మీటర్ల నుంచి 41 తగ్గిస్తే ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు. జీవనాడి లో జీవం తీసేస్తే ఒక్క ఎంపీ నోరు విప్పడం లేదు. నిన్న పార్లమెంట్ సాక్షిగా మరోసారి పోలవరం మీద స్పష్టత వచ్చింది. పోలవరం ఎత్తు ఇక 41 మీటర్లు మాత్రమే.
నిన్న జలశక్తి శాఖ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా స్పష్టం. పోలవరం నాడు అంచనా విలువ 55 వేల కోట్లు. ఇప్పుడు పోలవరాన్ని అంచనా వ్యయం ఇప్పుడు 30436 కోట్లు అని చెప్పారు. 55 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు కుదించారు.