Suryaa.co.in

Andhra Pradesh

వేధింపులు ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదు

-వ్యాపారుల సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటం
-ఇందుకోసం త్వరలో నియోజకవర్గ కమిటీలు
-టిడిపి వాణిజ్య విభాగం సమావేశంలో డూండీరాకేష్

అమరావతి: రాష్ట్రంలో వివిధ వర్గాల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై క్షేత్రస్థాయిలో రాజీలేని పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నిర్ణయించింది. టిడిపి వాణిజ్య విభాగం విస్తృతస్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ అధ్యక్షతన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీలు పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బచ్చుల అర్జునుడు హాజరయ్యారు. రాష్ట్రంలో వివిధ వర్గాల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత మూడేళ్లలో వ్యాపారులను వేధించడమే పనిగా పెట్టుకుందని డూండీ రాకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. గృహ అవసరాలకు రెండుకిలోల బెల్లం
Whats-App-Image-2022-06-08-at-7-37-49-PM-1 కొనాలంటే ఆధార్ కార్డు ఉండాలని నిబంధన విధించడం తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. బెల్లం విక్రయాలపై లెక్కలు చెప్పాలంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారులను వేధిస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఆక్వారంగంలో విద్యుత్ సబ్సిడీకి కోత విధించి ఆక్వా వ్యాపారులకు తీరని అన్యాయం చేశారని చెప్పారు.

చెత్తపన్నుతో సహా రకరకాల ట్యాక్స్ లపేరుతో వ్యాపారులను ఇదివరకెన్నడూ లేనివిధంగా వేధిస్తున్నారని, వేధింపులు ఆపకపోతే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రైస్ మిల్లింగ్, గ్రానైట్ వ్యాపారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలిపారు. పార్టీ వాణిజ్య విభాగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి నియోజకవర్గ కమిటీలు వేయాలని నిర్ణయించారు. కమిటీల నియామకం తర్వాత వ్యాపారస్తుల సమస్యలపై పెద్దఎత్తున పోరాడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE