దేవుని గడపలో తొలిసారి అన్ని వేల గృహప్రవేశాలు గొప్ప విషయం!
అన్నమయ్య జిల్లా, దేవగుడిపల్లెలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తయిన 3 లక్షల ఇళ్లను వర్చువల్గా ప్రారంభించి, కీలకమైన ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో పేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా మొత్తం 3,00,192 గృహాల నిర్మాణం విజయవంతంగా పూర్తి చేయబడింది. ముఖ్యంగా, విశాఖపట్నం జిల్లా అత్యధికంగా 38,691 గృహాలను పూర్తి చేసి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో SPSR నెల్లూరు (19,723), కడప (15,410), మరియు ఏలూరు (15,024) జిల్లాలు ఉన్నాయి. అనకాపల్లి (13,569), శ్రీకాకుళం (12,877), పల్నాడు (11,204) వంటి జిల్లాలు కూడా పది వేలకు పైగా ఇళ్లను పూర్తి చేసి ఈ లక్ష్య సాధనకు దోహదపడ్డాయి.
అన్నమయ్య జిల్లా, దేవగుడిపల్లెలో జరిగిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రకటించారు. ఈ లక్ష్యం దిశగా, త్వరలో రాబోయే ఉగాది రోజున మరో 5.90 లక్షల గృహ ప్రవేశాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని అర్హుల గుర్తింపు ప్రక్రియను డిసెంబర్ 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి ఆర్థిక చేయూత విషయంలో, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు అందిస్తోంది.
ఇకపై ఎస్సీ, బీసీలకు అదనంగా ఇస్తున్న రూ.50 వేలతో పాటు, ముస్లింలకు కూడా ఇళ్ల నిర్మాణం నిమిత్తం అదనంగా రూ.50 వేలు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, ఎస్టీలకు రూ. 75,000, పీవీటీజీలకు రూ. 1,00,000 చొప్పున అదనపు సాయం అందుతోంది. గత పాలనలో రద్దు చేసిన 4.73 లక్షల ఇళ్లకు మరియు లబ్ధిదారులకు చెల్లించాల్సిన రూ.900 కోట్ల పెండింగ్ బకాయిలను తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణంతో పాటు, ఆవాస ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రోడ్లు, ఇంటర్నెట్ వంటి అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు.