October 9, 2026

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌’

  • పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి
  • పారిశ్రామికవేత్తలకు మంత్రి జూప‌ల్లి ఆహ్వానం
  • 24వ ట్రావెల్ టూరిజం ఫెయిర్‌-2026లో మంత్రి జూపల్లి కృష్ణారావు

హైద‌రాబాద్: తెలంగాణ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రోత్సహించేందుకు ట్రావెల్‌ టూరిజం ఫెయిర్‌ వంటి వేదికలు దోహదపడతాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
పర్యాటక సంస్థలు, ట్రావెల్‌ కంపెనీలు, ఆతిథ్య రంగ సంస్థలు, పర్యాటక పరిశ్రమ ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు, భాగస్వామ్యాలు, ఉపాధి మార్గాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన 24వ ట్రావెల్‌ టూరిజం ఫెయిర్‌-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రదర్శనలో 16 రాష్ట్రాలు, 7 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ…. ఈ ప్రదర్శన ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ కొనుగోలుదారులు, సేవలందించే సంస్థల మధ్య అనుసంధానం పెరిగి, కొత్త భాగస్వామ్యాలు, మార్కెట్ విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ట్రావెల్ ఇండ‌స్ట్రీ కూడా కొత్త ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించి, ప‌ర్యాట‌కులు తెలంగాణ‌కు వ‌చ్చేలా చూడాల‌ని కోరారు.

ట్రావెల్ టూరిజం ఫెయిర్ నిర్వ‌హించ‌డం తెలంగాణ టూరిజం ప్ర‌మోష‌న్ కు గొప్ప అవ‌కాశం ల‌భించింద‌ని తెలిపారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో హైద‌రాబాద్ వేదిక‌గా గ్లోబ‌ల్ ఇన్వెస్ట్మెంట్ స‌మ్మిట్ జర‌గ‌నుంద‌ని, తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి పారిశ్రామికవేత్త‌లు ముందుకు రావాల‌ని ఆహ్వానించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌మ్ము కాశ్మీర్ ముఖ్య‌మంత్రి ప్ర‌ధాన స‌ల‌హాదారు నాసిర్ అస్లాం వానీ, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వ‌ల్లూరి, డైరెక్ట‌ర్ ఆఫ్ టూరిజం ల‌క్ష్మ‌ణ్ రంజిత్ నాయ‌క్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ న‌ర్సింహారెడ్డి,ఫెయిర్ ఫెస్ట్ ఎండీ ఇంబ్ర‌హీం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Total Visitors: 2,909,287