Suryaa.co.in

Telangana

తెలంగాణకు పెట్టుబడులు నిజమే

-ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులన్నీ బోగస్‌ అంటూ ప్రచారం జరగడాన్ని ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ తీవ్రంగా ఖండించారు.

మొన్న, నిన్న చేసిన కొన్ని పెట్టుబడుల ప్రకటనలు బోగస్ అని వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో జయేశ్ రంజన్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.. తెలంగాణకు పెట్టుబడులన్నీ వాస్తవమే అని స్పష్టం చేశారు.

పెట్టుబడుల కోసం అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి అమెరికాలో చేస్తున్న మీటింగుల విశ్వసనీయత మీద తెలంగాణ ప్రజలకు ఎటువంటి అనుమానాలు అవసరం లేదని తెలిపారు. అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాతే మీటింగ్‌లు చేస్తున్నామని జయేష్ రంజన్ వీడియోలో స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు చార్లెస్ స్క్వాబ్..

ఫైనాన్షియల్ సర్వీస్ లలో ప్రపంచంలో పేరొందిన చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్‌లో తమ సంస్థను నెలకొల్పేందుకు సిద్ధమైంది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్​ బాబుతో ఈ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు డెన్నిస్ హోవార్డ్, రామ బొక్కా సారథ్యంలో ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా టెక్నాలజీ అండ్ డెవెలప్​మెంట్​ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఈ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు అవసరమైన మార్గదర్శనం చేస్తామని చెప్పారు.

తమ కంపెనీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతుకు కంపెనీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు ఛార్లెస్ స్క్వాబ్ తుది అనుమతుల కోసం వేచి చూస్తోంది. త్వరలోనే తమ ప్రతినిధి బృందాన్ని హైదరాబాద్‌కు పంపించనున్నట్లు తెలిపింది. ఈ కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగం లోనూ హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షించనుంది.

మరోవైపు, ఈ రోజు అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్.. ఆపిల్ సంస్థ హెడ్ క్వార్టర్ ఆపిల్ పార్క్ వెళ్లనున్నారు. ఆపిల్ మ్యానిఫాక్చర్ టీమ్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి భేటీ కానున్నారు. ట్రినేట్ కంపెనీ సీఈఓతో చర్చించనున్నారు. ఆరమ్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో భేటీ అయి హైదారాబాద్‌లో ఆ కంపెనీ డేటా సెంటర్స్ విస్తరణ కోసం చర్చలు నిర్వహించనున్నారు. పలువురు టెక్ కంపెనీల ప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లో పాల్గొన నున్నారు. అంగెన్ సంస్థ సీనియర్ లీడర్‌ షిప్‌తో పెట్టుబడులపై చర్చలు నిర్వహించ నున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాల సంస్థ రెనేశాస్ తో, మ్యానిఫాక్చర్ సంస్థ అమాట్‌తో ఇన్వెస్ట్‌మెంట్‌పై చర్చలు నిర్వహించ నున్నారు. పలు బిజినెస్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

అలాగే నిన్న (బుధవారం) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో చర్చలు సఫలం కానున్నాయి. ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణ, స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించింది. నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్‌ లోని జీనోమ్ వ్యాలీలో 400 కోట్లు పెట్టుబడితో ఇన్జెక్టబుల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా వివింట్ సంస్థ కృషి చేస్తామని తెలిపింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్ డెవలప్మెంట్ కోసం కార్నింగ్ కంపెనీ సహకరిస్తామని తెలిపింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగంలో సహకారం కోసం కార్నింగ్ కంపెనీతో తెలంగాణ సర్కార్ ఎంఓయూ కుదుర్చుకుంది..

LEAVE A RESPONSE