– ఉద్రిక్త పరిస్థితి… రంగంలోకి పోలీసులు
– నేటి నుంచి మార్కెట్లో 17 సిరీస్ విక్రయాలు
– అర్ధరాత్రి నుంచే అనేకచోట్ల క్యూలు
– ప్రో మాక్స్ ధర 1,49,900 రూపాయలు
– మన దేశంలోనే ఎక్కువ ధరకు అమ్మకాలు
న్యూఢిల్లీ: యాపిల్ కంపెనీ కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 17 సిరీస్‌కు భారతదేశంలో భారీ స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లు, ఆన్లైన్ వెబ్సైట్లు, రిటైలర్ల వద్ద శుక్రవారం నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఈ లాంచ్‌ను చూసేందుకు యాపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు.
ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లలో తెల్లవారుజాము నుంచే క్యూలు కనిపించాయి. ముఖ్యంగా ముంబైలోని బీకేసీ జియో సెంటర్ వద్ద రాత్రి నుంచే ప్రజలు క్యూ కట్టారు. ఐఫోన్ల పట్ల భారతీయులకు ఉన్న ఉత్సాహాన్ని ఇది తెలియజేస్తుంది. కొన్నిచోట్ల తోపులాటలు కూడా జరిగాయి. దీనితో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కొత్త ఫోన్లు కేవలం డిజైన్ మార్పులు మాత్రమే కాదు, కొత్త సాంకేతిక ఆవిష్కరణలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాయి.
భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ ధరలు అమెరికా, దుబాయ్‌లతో పోలిస్తే కొంచెం ఎక్కువే. సాధారణ మోడల్ ధర 82,900 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 17 ఎయిర్ ధర 1,19,900 రూపాయలు, ప్రో మోడల్ 1,34,900, ప్రో మాక్స్ 1,49,900 రూపాయలుగా ఉంది. అయితే ఈఎంఐ, ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా వీటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 17 సిరీస్‌కు భారత్‌లో లభించిన ఆదరణతో దేశంలో యాపిల్ మార్కెట్ వృద్ధి మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఫోన్ 17 సిరీస్‌లో నాలుగు మోడళ్లు ఉన్నాయి. సాధారణ ఐఫోన్ 17, అతి సన్నని ఐఫోన్ 17 ఎయిర్, ప్రీమియం ఐఫోన్ 17 ప్రో, ప్రో మాక్స్. ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లలో ఏ 19 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది మునుపటి మోడళ్ల కంటే రెండు రెట్లు వేగవంతం. అలాగే కెమెరాలన్నీ 48 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఫోటోలు, వీడియోలను మరింత స్పష్టంగా తీయగలవు.
వీటిలో ఐఓఎస్ 26 సాఫ్ట్వేర్ ఉంది. ఇది కృత్రిమ మేధస్సును ఉపయోగించి వాయిస్ అసిస్టెంట్‌ను మరింత తెలివిగా మారుస్తుంది. ఉదాహరణకు మీరు మాట్లాడుకునేటప్పుడు అది స్వయంచాలకంగా భాషలను అనువదిస్తుంది. ఈ సాంకేతికత భారతదేశంలోని వివిధ భాషలకు చాలా సహాయకరంగా ఉంటుంది.
ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ మరింత ప్రత్యేకమైనది. కేవలం 6 మిల్లీమీటర్ల మందంతో ఇది చాలా సన్నగా ఉంటుంది. బ్యాటరీ లైఫ్‌పై సందేహాలు ఉన్నప్పటికీ… రోజువారీ ఉపయోగాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త ఫీచర్లు భారతీయ వినియోగదారుల రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తాయని యాపిల్ చెబుతోంది. ముఖ్యంగా కొత్త ఫోన్లన్నీ శాటిలైట్ కనెక్టివిటీతో మారుమూల ప్రాంతాల నుంచి కూడా కాల్ చేయగలిగే అవకాశం ఉంది.