– నార్మలైజేషన్ ప్రక్రియతో మెరిట్ అభ్యర్ధులకు అన్యాయం
– సోషల్ స్టడీస్ స్టూల్ అసిస్టెంట్ పోస్టులో నరసింహారావు అనే ఎస్సీ అభ్యర్ధికి 70.03 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు
– ఓసీ కేటగిరీకి చెందిన మరో వ్యక్తికి 67 మార్కులకే ఉద్యోగం
– డియస్సీ నిర్వహణలో అవకతవకలు, అక్రమాలు
– రిజర్వేషన్ ప్రక్రియకు విఘాతం
– నియామక ప్రక్రియలో లోపించిన పారదర్శకత
– ఎన్నికల్లో 50 వేల పోస్టుల భర్తీ చేస్తామని హామీ
– అధికారంలోకి రాగానే 16 వేల పోస్టులకే పరిమితం
– జగన్ హయాంలో ఏకంగా 6.48 లక్షల ఉద్యోగాల భర్తీ
– వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు: మెగా డియస్సీ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగార్ధులను కూటమి ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… 50 వేల పోస్టుల భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకివచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టులే భర్తీ చేసిన ప్రభుత్వం.. అందులోనే అనేక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు.
నార్మలైజేషన్ ప్రక్రియతో మెరిట్ అభ్యర్ధులకు అన్యాయం జరిగడంతో పాటు.. రిజర్వేషన్ ప్రక్రియకూ విఘాతం కలిగిందని ఆక్షేపించారు. అన్యాయానికి గురైన అభ్యర్ధులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.
మెగా డియస్సీ పేరుతో మోసం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు తొలగింపు, రేషన్ వాహనాలు, ప్రభుత్వ లిక్కర్ షాపులు రద్దు చేయడంతోపాటు ఆప్కాస్ లో పనిచేస్తున్న వేలాదిమందిని తమకు నచ్చని కారణంతో వేలాదిమందిని అధికార పార్టీ నాయకులు తొలగించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, అధికార పార్టీ నేతల చర్యలతో వేలాది మంది నిరుద్యోగులు రాష్ట్రంలో కనిపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 50 వేల పోస్టులతో మెగా డియస్సీ నిర్వహిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగులను మభ్యపెట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇదే డియస్సీని కేవలం రెండు నెలల్లో పూర్తి చేస్తానని జగన్మోహన్ రెడ్డి నోటిఫికేషన్ ఇస్తే.. అది అమలు కాకుండా ఎన్నికలు వస్తున్నాయని కోర్టుకు వెళ్లు అడ్డుకున్నారు. తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 వేల పోస్టులకు సంబంధించి, డీయస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి దాదాపు 16 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి సుమారు దరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది అభ్యర్ధులను అనేక రకాలుగా ఇబ్బందికి గురిచేస్తూ 16 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు.
నియామక ప్రక్రియ పూర్తయింది, రేపు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ తీసుకొమ్మని చెబుతున్నారు. వాస్తవానికి ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయి. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయి. సెలక్షన్స్ లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అపాయింట్ మెంట్స్ ఆర్డర్స్ జారీలో కూడా అవమానిస్తున్నారు.
డియస్సీలో ఆది నుంచీ అక్రమాలే
జూన్ న4 న రిక్రూట్ మెంట్ కు సంబంధించిన తొలి సంతకం పెట్టిన తర్వాత వీళ్లే కోర్టులో కేసు వేయించడం, టెట్ మరోసారి నిర్వహించాలనడం వంటి అడ్డంకులతో రిక్రూట్ మెంట్ ప్రక్రియను ఆలస్యం చేస్తూ వచ్చారు. మరోవైపు డియస్సీ పరీక్షను 22 సెషన్స్ లో నిర్వహించారు. ఇటీవల బీహార్ లో డియస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుమారు 1లక్ష మంది ఉద్యోగులు ఎంపిక చేసుకుంటే.. ఒకే రోజులో నిర్వహించారు. మన దగ్గర 22 సెషన్స్ లో నిర్వహించడం వల్ల మెరిట్ స్టూడెంట్స్ మోసపోయారు. వారికి అన్యాయం జరిగింది.
ఈ ప్రక్రియలో పదోతరగతి సీబీఎస్ఈలో చదివిన అభ్యర్ధులకు డియస్సీలో తొలిసారి అర్హత లేదని చెప్పారు. అదే సీబీఎస్ఈలో చదివిన వారికి టెట్ రాయడానికి మాత్రం అనుమతి ఇచ్చారు. డియస్సీ కంటే ముందు టెట్ రాయడానికి వాళ్లకు అనుమతి ఇచ్చి.. తీరా డియస్సీ రాయడానికి అంగీకరించలేదు. దేశంలో ఆంధ్రప్రదేశ్ లో తప్ప మరే రాష్ట్రంలో సీబీఎస్ఈ చదివిన వాళ్లను డియస్సీకి అనర్హులుగా ప్రకటించలేదు.
దీనికి కారణం వాళ్ల ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లిషు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో చదువుతున్నారు కాబట్టి అనర్హులు అని చెప్పారు. టెట్ రాయడానికి అంగీకరించి, డియస్సీకి మమ్నల్నిఎందుకు అనర్హులుగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే వారి మొర ఆలకించేవారు లేకుండా పోయారు.
నోటిఫికేషన్ ఇచ్చిన 45 రోజుల్లోగా డియస్సీ నిర్వహిస్తామని చెప్పారు. మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో తెలియకపోవడం వల్ల అందరం వివిధ ఉద్యోగాల్లో ఉన్నాం, సెలవు పెట్టి డియస్సీకి ప్రిపేర్ అవ్వాలన్నా కనీసం మూడు నెలలు టైం కావాలి, ఆ మేరకు వెసులుబాటు ఇవ్వాలని అడిగారు. అయితే వీళ్లంతా రాష్ట్రంలో ఉన్న కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నారు.
వారికి మూడు నెలల గడువు ఇస్తే… ఆయా కార్పొరేట్ సంస్థలకు నష్టం కాబట్టి వారు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 45 రోజుల గడువు మాత్రమే ఇచ్చారు. అభ్యర్ధులు గడువు పెంచాలని ఎంత మొత్తుకున్న వారిది అరణ్యరోదనే అయింది. కేవలం 45 రోజుల్లోనే పూర్చి చేశారు. మరో ప్రధానమైన అంశం పక్కనే ఉన్న తెలంగాణా, బీహార్ లలో ఆఫ్ లైన్ లో ఒకే రోజు పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తే.. మన రాష్ట్రంలో మాత్రం 22 సెషన్స్ లో పరీక్ష నిర్వహించారు.
నార్మలైజేషన్ ప్రక్రియతో అవకతవకలు
మన రాష్ట్రంలో గతంలో ఏ డియస్సీలో ఇలా జరగలేదు.వీరు చేపట్టిన నార్మలైజేషన్ ప్రొసెస్ వల్ల అభ్యర్ధులకు అన్యాయం జరిగింది. నార్మలైజేషన్ ప్రోసెస్ అంటే రకరకాల సెషెన్స్ లో పరీక్షలు జరుగుతాయి. ఒక సెషన్ లో యావరేజ్ మార్కులు తగ్గవచ్చు. మరొక సెషన్ లో యావరేజ్ మార్కులు పెరగడానికి అవకాశం ఉంటుంది. తక్కువ యావరేజ్ మార్కులు వచ్చినప్పుడు ఈ పేపర్ కష్టంగా ఉండి ఉంటుందని, అందుకే వీరికి యావరేజ్ మార్కులు తగ్గాయని, ప్రభుత్వం తన ఇష్ట ప్రకారం వీరికి మార్కులు పెంచింది.
వాస్తవంగా యావరేజ్ మార్కులు తగ్గడానికి కారణం.. తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, కర్ణాటకలో ఉంటున్న వారందరూ మన రాష్ట్రంలోని సరిహద్దు జిల్లాల వద్దకు వచ్చి కేవలం అనుభవం కోసం పరీక్ష రాశారు. వాళ్లు సాధారణంగా ప్రిపేర్ కావడం ఆ సెంటర్లలో దరఖాస్తు చేసుకున్న చోట ఆ సెషన్స్ లో యావరేజ్ మార్కులు తగ్గాయి.
అలా తగ్గిన చోట వారికి పేపర్ కష్టంగా వచ్చిందని భావించి వారికి 4.7 మార్కులు వరకు పెంచి అదనంగా కలిపారు. ఆ సెషన్స్ లో వచ్చిన వారికి అదనంగా మార్కులు కలవడం వల్ల మిగిలిన వారికి నష్టం జరిగింది. వాళ్లు అన్యాయం అయ్యారు.
ఈ నార్మలైజేషన్ విధానంలో 01-07-2025 ఉదయం సెషన్ లో పరీక్ష రాసిన వారికి 0.75 మార్కులు యాడ్ చేశారు. అదే రోజు మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష రాసిన వారికి 4.75 మార్కులు యాడ్ చేశారు. 13-06-2025 సెకెండ్ షిఫ్ట్ లో రాసిన వారికి 4.25 మార్కులు చేర్చారు. కొన్ని సెషన్స్ లో 0.5, 0.75 మరికొన్ని సెషన్స్ లో 4.25 నుంచి 4.75 వరకు యాడ్ చేయడం వల్ల ఎక్కువ మార్కులు యాడ్ చేసిన వారికే ఉద్యోగాలు వచ్చాయి. దీనివల్ల కష్టపడి చదివిన చాలా మందికి ఈ నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల వారికి అన్యాయం జరిగింది. 4 లక్షల మంది డియస్సీ పరీక్ష రాస్తే.. 16 వేల ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి.
జగన్ హయాంలో పారదర్శకంగా 1.37లక్షల ఉద్యోగాల భర్తీ
2019లో వైఎస్.జగన్ హయాంలో 1.37 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం 20 లక్షల మంది పరీక్ష రాస్తే.. ఇక్కడ మాత్రం కేవలం 16 వేల ఉద్యోగాల కోసం 4 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. 20 లక్షల మందికి ఆఫ్ లైన్ లో ఒకే రోజు పరీక్ష నిర్వహించి.. మొత్తం ఈ ప్రక్రియలో నెల రోజుల ప్రిపరేషన్ కోసం కేటాయించగా, నెల రోజుల్లో మిగిలిన ప్రోసెస్ పూర్తి చేసి.. 20 లక్షల మంది అభ్యర్ధుల్లో 1.37 లక్షల మందికి ఎలాంటి అవకతవకలు లేకుండా అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ పూర్తి చేసిన ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది.
ఈ ప్రభుత్వం మాత్రం కేవలం 4 లక్షల మంది మాత్రమే రాసిన పరీక్షలో నార్మలైజేషన్ ప్రక్రియ పేరుతో ఇష్టం వచ్చినట్లు మార్కులు కేటాయించి అవకతవకలకు పాల్పడ్డారు. మన రాష్ట్రంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ పరీక్షను ఇంటర్నేషనల్ మోడ్ అంటూ మీ ఇష్టం వచ్చినట్లు నిర్వహించారు.
మెడిసిన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం జరిగే నీట్ పరీక్ష కూడా రకరకాల సెషన్స్ లో పెట్టి అక్కడ కూడా యావరేజ్ తీసుకునే పరిస్థితి ఉంటే.. దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ ఏడాది అలా చేయవద్దు.. దాని వల్ల మెరిట్ స్టూడెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది, ఒకే రోజు పరీక్ష నిర్వహించాలని చెప్పింది. దాంతో వాళ్లు ఆ పరీక్షను మూడు నెలలు వాయిదా వేసి ఒకే రోజు నిర్వహించారు. జాతీయ స్ధాయిలో నే ఇలా వివిధ సెషన్స్ లేకుండా నీట్ పరీక్ష నిర్వహిస్తుంటే.. మీరు మాత్రం జిల్లా స్థాయి పరీక్షను వివిధ సెషన్స్ లో నిర్వహించి నిరుద్యోగులకు అన్యాయం చేశారు.
ప్రచార పిచ్చి..
గతంలో డియస్సీలో ఎంపికైన వారికి డిఈఓ కార్యాలయంలో అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తే.. వాళ్లు ఆయా స్కూళ్లలో చేరేవారు. కానీ చంద్రబాబు మాత్రం వీరికి తాడేపల్లిలో 19వ తేదీన మొత్తం 16 వేల మందికి తాడేపల్లిలో అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెబుతున్నారు. ఇందుకోసం ఒక్కో జిల్లా నుంచి ఎంపికైన వారందరికీ వేర్వేరు ప్రాంతాల్లో వసతి ఏర్పాటు చేసి ముందురోజే రావాలని, ఎవరి దుప్పట్లు వారే తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
19వతేదీ ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసి తాడేపల్లికి తీసుకెళ్తామని.. అక్కడ నియామకపత్రాలు అందజేసిన తర్వాత అదే రోజు సాయంత్రం లేదా మరుసటి బస్సుల్లో ఇళ్లకు పంపిస్తామని మెసేజ్ చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఎంపిక అయిన 16 వేల మందిని తాడేపల్లి రప్పించి.. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం అత్యంత అమానవీయం. వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, బాలింతలు దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. ఈ రకంగా చేయడం అత్యంత దారుణం, అవమానకరం.
జగన్ హయాంలో అవకతవకలు లేకుండా..
వైయస్.జగన్ హయాంలో 1.37 వేల ఉద్యోగాలకు సంబంధించిన నియామక పత్రాలను ఎలాంటి అవకతవకలు లేకుండా ఒకే రోజు అందించారు. చంద్రబాబు గారూ… 1998 డియస్సీలో అర్హులైన 4059 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేస్తే.. వారిందరికీ 25 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వారందిరికీ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ మీలా ఎక్కడా సంబరాలు చేసుకోలేదు.
మీరు దిగిపోయే ముందు 2018లో సుమారు 6954 ఉద్యోగాల భర్తీకి డియస్సీ నోటిఫికేషన్ ఇచ్చి.. ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్శిపోతే… జగన్ వచ్చిన తర్వాత ఈ 6954 మందికి సెలక్షన్స్ పూర్తి చేసి గుట్టుచప్పుడు కాకుండా ఎలాంటి ఆర్భాటం చేయకుండా వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. ఎలాంటి ప్రచారం చేసుకోలేదు.
అలాగే 2008 డియస్సీలో అర్హత ఉండి ఉద్యోగాలు రాని 2193 మందికి కూడా 15 ఏళ్ల తర్వాత వైయస్.జగన్ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు కేవలం 16వేల ఉద్యోగాలిచ్చి… వారందరినీ ఏకంగా తాడేపల్లి రప్పించుకుని తన ప్రచార పిచ్చితో వారిని ఇప్పందులు పాల్జేస్తున్నారు.
6.48 లక్షల ఉద్యోగాల భర్తీతో .జగన్ రికార్డ్
చంద్రబాబు నాయుడు 2019 కాలంలో కేవలం 32, 108 ఉద్యోగాలు ఇస్తే.. వైయస్.జగన్ 2019-24 మధ్యలో 6,48,087 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇందులో రెగ్యులర్ ఉద్యోగాలు 2.31 లక్షలు కాగా… 43,923 కాంట్రాక్ట్ ఉద్యోగాలు, 3,73,161 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేశారు. వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చేనాటికి ప్రభుత్వరంగంలో కేవలం 3.97లక్షల మంది ఉద్యోగులు మాత్రమే ఉంటే, ఆయన టర్మ్ లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 6 లక్షలకు పెరిగింది. అన్ని ఉద్యోగాలిచ్చినా వైయస్.జగన్ ప్రభుత్వం ఏనాడూ ప్రచారం చేసుకోలేదు. ఇలా ఉద్యోగులను ఇబ్బంది పెట్టింది కూడా లేదు.
మరోవైపు రిజర్వేషన్ ప్రక్రియలో కూడా అవకతవకలు జరిగాయి. మాకున్న సమాచారం మేరకు సోషల్ స్టడీస్ స్టూల్ అసిస్టెంట్ పోస్టులో నరసింహారావు అనే ఎస్సీ అభ్యర్ధికి 70.03 మార్కులు వచ్చినా ఉద్యోగం రాలేదు. ఓసీ కేటగిరీకి చెందిన మరో వ్యక్తికి 67 మార్కులకే ఉద్యోగం వచ్చింది. నియామక ప్రక్రియలో పారదర్శకత ఎక్కడుంది. మీ రహస్య అజెండా ఏమిటి?
నార్మలైజేషన్ ప్రక్రియలోనూ, రిజర్వేషన్స్ లోనూ తప్పులు జరిగితే… మీరు మాత్రం పండగ చేసుకుంటున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. మెరిట్ ఉండి కూడా ఉద్యోగాలు రాకుండా అన్యాయానికి గురైన అర్హులందరికీ తప్పకుండా ఉద్యోగాలివ్వాలి. వారందరి తరపున వైయస్సార్సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుందని చంద్రశేఖర్ హెచ్చరించారు.