- నకిలీ పాస్‌బుక్కులు, బినామీ పేర్లతో రుణాలు
- జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి,ఎస్పీ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జిడిసిసి బ్యాంక్ మరియు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మరియు ఎస్పీ సతీష్ కుమార్ లకు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో సొసైటి పాలక వర్గం ఆధ్వర్యంలో నకిలీ పాస్ బుక్కులు మరియు ఇతర డాక్యుమెంట్స్ సృష్టించినట్టు ఆరోపించారు. బినామీ పేర్లతో రుణాలు మంజూరు చేశారని, ఆ నాటి పాలకవర్గంపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
తదుపరి, నోటీసులు అందుకున్న రైతుల పేరు మీద నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించడం వల్ల రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. సహకార రంగం రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
నకిలీ రుణాలు పొందిన వారి ఆస్తులను జప్తు చేయాలని, కమిటీ వేసి విచారణ జరపాలని, నలభై రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు.