– సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలి
– మీడియా సంస్థలపై దాడులకు తెగబడుతుంటే సర్కారు ఏం చేస్తోంది?
– కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కు చట్టాలు వర్తించవా?
– రేవంత్ రెడ్డి…. నిన్ను అకారణంగా జైల్లో వేసిన సంగతి మర్చిపోయావా?
– మీలో పౌరుషం చచ్చిపోయిందా?
– బీఆర్ఎస్ తో కుమ్కక్కైపోయారా?
– లేకుంటే కాళేశ్వరంసహా అన్ని స్కాంలు చేసిన ఆ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?
– తెలంగాణ కేసీఆర్, కేటీఆర్ జాగీర్ కాదు
– ఖబడ్దార్… ఇష్టమొచ్చినట్లు చేస్తే మిమ్ముల్ని రోడ్లపై తిరగనీయం
– మీడియాపై దాడులు చేస్తే మీ అంతు చూస్తాం
– ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై దాడి చేసిన 2 గంటల్లోనే మా కార్యకర్తలు టీ న్యూస్ ఛానల్ సంగతి చూస్తారు
– నిప్పులు చెరిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: ఆక్రమ నిర్మాణాల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు చెరువులు, కుంటల్లో భవంతులు నిర్మించి కాలేజీలు, వ్యాపారాలు చేసుకుంటున్న అక్బరుద్దీన్ ఒవైసీ కుటుంబానికి మినహాయింపు ఇచ్చారా? అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. అక్బరుద్దీన్ కాలేజీలో 10 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నందున అక్రమ నిర్మాణాలైనా వాటిని కూల్చలేమని చెబుతున్న హైడ్రా అధికారులు… ఏ జీవనాధారం, గూడు లేక మూసీ పరివాహక ప్రాంతాల్లో కట్టుకున్న గుడిసెల్లో, చిన్న చిన్న ఇండ్లను ఎందుకు కూల్చివేశారని నిలదీశారు.
‘‘అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉంటుందా? పేదల ప్రాణాలకు, జీవితాలకు విలువ లేదా? వాళ్లు మనుషులు కాదా? ఎంఐఎం నాయకులు పోలీసులను కొడితే చర్యలు తీసుకోరు. కరెంట్ బిల్లులు కట్టకుంటే వత్తాసు పలుకుతారా? ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారు? ఆఖరికి తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిచ్చి పోషిస్తుంటే పట్టించుకోరు? ఇదేం పద్దతి..’’అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కథనాలు రాసిందనే కారణంతో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయాలపై ఆ పార్టీ నాయకులు దాడి చేసేందుకు సిద్ధమవడంపైనా కేంద్ర మంత్రి నిప్పులు చెరిగారు. మీడియాపై దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు.
‘‘రేవంత్ రెడ్డిగారు.. మీకు పౌరుషం లేదా? మిమ్ముల్ని ఆకారణంగా జైల్లో వేసి బెయిల్ రాకుండా చేశారు కదా? అవన్నీ మర్చిపోయి వాళ్లతో కుమ్కక్కైపోయారా? కాళేశ్వరం, ఈఫార్ములాసహా అనేక స్కాంలు చేసిన కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేసి జైలులో వేయడం లేదు’’అని నిలదీశారు. మహా టీవీపై దాడి చేసినప్పుడే కఠినంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు కదా? అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని, మీడియా స్వేచ్ఛను కాపాడే విషయంలో బీజేపీ ముందుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు ‘‘మీకు దమ్ముంటే ఏబీఎన్, ఆంధ్రజ్యోతిపై దాడులు చేసి చూడండి. మీరు దాడి చేసిన రెండే రెండు గంటల్లోనే మీ బీఆర్ఎస్ ఆఫీస్ ను, అందులోని టీవీ ఛానల్ సంగతి మా బీజేవైఎం నాయకులు చూస్తరు.’’ అని హెచ్చరించారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో సోమవారం పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వెంకట్రావుపల్లెలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన వేంకట్రావుపల్లె స్కూల్ ను సందర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. ఏమన్నారంటే…
మేడిపల్లి మండలంలోని దమ్మన్నపేట నుండి కాచారం వయా కల్వకోట, రంగాపూర్ గ్రామాల వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 2 కోట్ల 47 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. ఈ రహదారిలోనే 1 కోట్ల 80 లక్షల రూపాయలు వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం సంతోషంగా ఉంది. అందులో భాగంగా మేడిపల్లి మండలంలో 1 కోటి 58 లక్షల రూపాయల జాతీయ ఉపాధి నిధులతో 9 అంతర్గత రోడ్లను నిర్మించినం.
పాతబస్తీ సల్కం చెరువు భూమిలో అక్రమంగా నిర్మించిన అక్బరుద్దీన కాలేజీ జోలికి పోబోమని, ఒకవేళ చర్యలు తీసుకుంటే అన్యాయం జరుగుతుందని హైడ్రా కమిషనర్ చెప్పడం మూర్ఖత్వం. ఇది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమా? సంబంధిత అధికారి నిర్ణయమా? స్పష్టం చేయాలి.
అక్బరుద్దీన్ ఒవైసీకి కొమ్ములున్నాయా? ఎందుకు మినహాయింపు ఇవ్వాలి? అట్లయితే మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు కట్టుకుని జీవిస్తున్న వేలాది మంది పేదల ఇండ్లను కూల్చేశారు కదా? వాళ్లు మనుషులు కాదా? వాళ్ల ప్రాణాలకు విలువ లేదా? అక్బరుద్దీన్ కాలేజీ భవనంపై యాజమాన్యానికి నోటీసులెందుకు ఇవ్వలేదు. వెంటనే ఖాళీ చేయాలని నోటీసులిచ్చి విద్యా సంవత్సరం ముగిశాక కూల్చేస్తామంటే సరిపోయేది కదా? ఆ పని ఎందుకు చేయలేదు? ఒక్క అక్బరుద్దీన్ కుటుంబానికే విలువ ఉందా? పేదలకు విలువ లేదా?
కానిస్టేబుళ్లపై దాడి చేసే ఒవైసీ మనుషులకు వాళ్లకు వత్తాసు పలుకుతారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేస్తే వత్తాసు పలుకుతారు. తీవ్రవాదులతో సంబంధాలున్న వాళ్లకు ఉద్యోగాలిస్తుంటే వత్తాసు పలుకుతారు. ఇదేం పద్ధతి? ఒవైసీ ఆస్తులకు, అరాచకాలకు హైడ్రా మినహాయింపు ఇచ్చిందా? వాళ్లు ఏమైనా కబ్జాలు చేయొచ్చా? అరాచకాలు చేయవచ్చా? తక్షణమే సీఎం సమాధానమివ్వాలి.
మొన్న మహా టీవీ పై దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు ఆంధ్రజ్యోతిలో వాళ్లకు వ్యతిరేకంగా ఎడిటోరియల్ రాస్తే ఆ పేపర్, టీవీపై కూడా దాడి చేసేందుకు సిద్ధమవుతున్న పోలీసుల నుండి సమాచారం వచ్చింది. ఇదేం పద్ధతి? మహా టీవీపై దాడి చేసినప్పుడు వాళ్లను అరెస్ట్ చేసి కఠినంగా వ్యవహరిస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా? మీరు ఏబీఎన్ మీద దాడి చేసి చూపించండి. మా అధ్యక్షులు రామచంద్రరావు ఆదేశాల మేరకు యువ మోర్చా కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపిస్తారు.
తెలంగాణలో ఇక బీఆర్ఎస్, కేటీఆర్ జాగీర్ కాదు. వాడు వీడు అని మాట్లాడితే రోడ్ల మీద నీ కాన్వాయ్ కూడా తిరగదు. రాధాక్రిష్ణ అన్నట్లుగా ‘తెలంగాణకు ముందు మీ బతుకేంది? ఆనాడు రబ్బర్ చెప్పులు, ముడతల చెప్పులు వేసుకున్న బతుకు నీది. ఇయాళ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? తెలంగాణ ఉద్యమంలో మీరెన్నడైనా లాఠీదెబ్బలు తిన్నారా? జైలుకు వెళ్లారా? ఇయాళ వేల కోట్లు సంపాదించి దుబాయి, మస్కట్ లో వ్యాపారాలు చేస్తోంది నిజం కాదా? తెలంగాణకు ముందు ఫైనాన్స్ పైసలు కట్టలేకపోతే కేసీఆర్ కారును కూడా గుంజుకు పోయింది నిజం కాదా? నా కొడుకు కొత్త షర్ట్ వేసుకుంటే కేసీఆర్ కొడుకు ఇస్టమొచ్చినట్లు ట్రోలింగ్ చేశారు. నా కొడుకుతో కొట్లాడే స్థాయి కేటీఆర్ ది. నేను మొన్ననే చిన్న పాత ఇల్లు కట్టుకున్నా. నాకు వేల కోట్ల ఆస్తులున్నాయని ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ ను సవాల్ చేస్తున్నా… ఎవరికి ఎన్ని ఆస్తులున్నాయో, ఎవరికి వేల కోట్ల బినామీ ఆస్తులున్నాయో తేల్చుకుందాం. దేవుడి వద్దకు వెళ్లి ప్రమాణం చేద్దాం.. దమ్ముంటే రావాలి.
ఆనాడు తెలంగాణ కోసం మాతోపాటు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మద్దతిస్తూ… కేసీఆర్ కుటుంబం ఎన్ని తప్పులు చేసినా ఆయనకు బాహాటంగా మద్దతిచ్చింది. ఆయనను హీరో చేసింది. ఇయాళ అదే పేపర్, టీవీ మీరు చేసిన తప్పులను ఎత్తి చూపితే మాత్రం తెలంగాణ వ్యతిరేక టీవీ, పత్రికని దాడులు చేయాలనుకుంటున్నారా? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నడు? దాడి చేస్తామని అన్న వెంటనే లోపలేసి బొక్కలే వేయకుండా మీనమేషాలు వేస్తోంది. టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో నన్ను, డ్రోన్ ఎగరేశారనే సాకుతో రేవంత్ రెడ్డి జైల్లో వేసి బెయిల్ రాకుండా చేసింది. మరి రేవంత్ కు ఆ పౌరుషం ఎటు పోయింది? వాళ్లను ఎందుకు జైల్లో వేస్తలేవు? వాళ్లతో ఎందుకు కుమ్మక్కైనట్లు?
నేనడుగుతున్నా.. కాళేశ్వరంలో లక్ష కోట్లు దోచుకుంది నిజం కాదా? ఫోన్ ట్యాపింగ్ పేరుతో అందరి జీవితాలను నాశనం చేసింది వాస్తవం కాదా? ఈ ఫార్ములా కేసులో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు చెప్పినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? డ్రగ్స్ కేసులో, ఫాంహౌజ్ కేసులో, గొర్రెల స్కాం, విద్యుత్ కొనుగోళ్ల స్కాంలో కేసీఆర్ కుటుంబ పాత్ర ఉన్నది నిజమా? కాదా? అయినా ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చట్టం కేసీఆర్ చుట్టంగా మారింది.
ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసిన 2 గంటల్లోపే టీ ఛానల్ పై దాడి తప్పదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలను ఆదేశించారు. అంతే తప్ప మీ ఊకదంపుడు హెచ్చరికలకు, దాడులకు తెలంగాణ ప్రజలు భయపడరు. అసలు ఇట్లాంటి వాటిని సమర్దించే వాళ్లకు సిగ్గుండాలి. అట్లాంటోళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడటం వారి అసమర్ధతకు నిదర్శనం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, మీడియాకు బాసటగా నిలిచేందుకు బీజేపీ సిద్ధం. తెలంగాణలోని లక్షలాది మంది కార్యకర్తలు అండగా ఉంటారు.