Suryaa.co.in

Andhra Pradesh

కుప్పం అభివృద్ధిపై చర్చకు చంద్రబాబు సిద్ధమా..?

-ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చంద్రబాబు రౌడీయిజం
-టీడీపీ గూండాలు, రౌడీలు కుప్పంలో చేసిన అలజడి రాష్ట్రమంతా చూసింది
-ఎన్టీఆర్‌ నుంచి పార్టీని జయప్రదంగా ఎలా లాక్కున్నాడో అందరికీ తెలుసు
-ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల నుంచి గెలిచి వచ్చిన నాయకుడు వైయస్‌ జగన్‌
-రాష్ట్రంలో సంక్షేమ పాలన చూసి చంద్రబాబు కడుపు మండుతోంది
-ఎల్లో మీడియా సహకారంతో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు
-చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజం

తాడేపల్లి: ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృషించేందుకు చంద్రబాబు కుట్ర పనుతున్నాడని, కుప్పంలో తన గూండాలముఠాతో బాబు చేయించిన రౌడీయిజం రాష్ట్రమంతా చూసిందని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, ముఖ్యమంత్రి సంక్షేమ పాలన దెబ్బకు కుప్పంలో కూడా చంద్రబాబు కుప్పకూలి రోడ్డున కూర్చునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సవాల్‌ విసిరారు. కుప్పంలో చంద్రబాబు ఏ వీధి సెలెక్ట్‌ చేసుకున్నా సరే.. ఆ వీధిలోకి వెళ్లి 33 సంవత్సరాలుగా చంద్రబాబు ఏం చేశారో.. ఈ 3సంవత్సరాల్లో ఎన్ని సంక్షేమ పథకాలు అందాయో ప్రజలనే అడుగుదామని, దీనికి చంద్రబాబు సిద్ధమా అని మంత్రి కారుమూరి ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. మంచి వ్యక్తిని, మహా నాయకుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన నుంచి పార్టీని లాక్కొని, చెప్పులు వేయించి, మానసిక క్షోభకు గురిచేసి, ఆయన చావుకు కూడా కారణమయ్యాడని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ నుంచి టీడీపీని కైవసం చేసుకోవడం కోసం అన్యాయంగా, జయప్రదంగా చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశాడో అన్నీ తెలుసన్నారు.

ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి గెలవలేని చంద్రబాబు.. సీఎం వైయస్‌ జగన్‌ ప్రజారంజక పాలన చూసి కడుపుమంట రగిలిపోతున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టినా ప్రజల్లోకి వెళ్లి.. ప్రజల నుంచి గెలిచి సింగిల్‌గా వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌.. అని గుర్తుచేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కలెక్టర్ల మీటింగ్‌లో మా వాళ్లకే చేయండి.. మా వాళ్లనే చూడండి అని దుర్మార్గంగా మాట్లాడాడని గుర్తుచేశారు. సీఎం వైయస్‌ జగన్‌ పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు చూడొద్దు అందరికీ న్యాయం చేయండి అని చెప్పారన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో.. కరుడుగట్టిన టీడీపీ నాయకులకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అందుకే కుప్పంలో వైయస్‌ఆర్‌ సీపీ కైవసం అయ్యిందన్నారు. దాన్ని తట్టుకోలేక అరాచకాలు సృష్టించడం మొదలుపెట్టాడని, చంద్రబాబు మనుషులు రౌడీయిజం చేస్తూ.. క్రరలు పట్టుకొని ఫ్లెక్సీలు చింపుకుంటూ చిన్న వయస్సులో ఎంపీపీ అయిన బీసీ యువతిపై ఏ విధంగా దాడికి యత్నించారో ప్రజలంతా చూశారన్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ రౌడీలు రాళ్లు విసురుతుంటే చోద్యం చూశాడని, బాబు తన రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేశాడని మండిపడ్డారు. యాక్షన్‌.. డైరెక్షన్‌ ప్రీప్లాన్డ్‌గా ఆర్గనైజ్‌ చేసి పెట్టుకున్నారని ఇదంతా రాష్ట్ర ప్రజానీకం గమనిస్తుందన్నారు.

ప్రజల దగ్గరకు వెళ్తే కాండ్రించి ఉమ్మేసే పరిస్థితిలో టీడీపీ ఉందని, నాయకులు, కార్యకర్తలు కూడా చంద్రబాబుకు దూరమయ్యారు. కానీ, ఎల్లో మీడియా ద్వారా ప్రభుత్వం మీద బురదజల్లి ఏదో ఒక అలజడి సృష్టించాలని కుట్రలు చేస్తున్నాడని మంత్రి కారుమూరి మండిపడ్డారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో చేసిన అరాచకాలు, అన్యాయాలు అన్నీ ఇన్నీ కావన్నారు. పుష్కరాల్లో ప్రచార ఆర్భాటానికి 29 మందిని పొట్టనపెట్టుకుని మాట్లాడావా.. విజయవాడలో ఎన్ని గుళ్లు కూల్చావ్‌.. కాల్‌ మనీ కేసులో ఎంతోమంది మహిళలు బలైనా పెదవి విప్పావా..? రిషితేశ్వరి కేసు గురించి మాట్లాడావా..? ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టి ఈడుస్తే.. సెటిల్‌మెంట్‌ చేసి ఆవిడనే తిరిగితిట్టింది గుర్తులేదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇవాళ ప్రశాంతంగా, లా అండ్‌ ఆర్డర్‌ సమస్య లేకుండా చక్కగా పాలన జరుగుతున్న ఆంధ్రరాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.

LEAVE A RESPONSE