– లగిచర్ల వెళ్తున్న బీజేపీ ఎంపీలు డీకే అరుణను,ఈటల రాజేందర్, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ప్రజాప్రతినిధులుగా లగిచర్ల వెళ్తున్న వారిని అడ్డుకోవడం ప్రభుత్వం పిరికితనానికి, పూర్తి అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం పేదల పట్ల అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పేదలకు అన్యాయం చేస్తూ కేసులు నమోదు చేయడం దుర్మార్గం. ఇలాంటి ఘటనలపై వాస్తవాలను తెలుసుకునేందుకు వెళ్తున్న ప్రజాప్రతినిధులను అడ్డుకోవడం దురదృష్టకరం.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన స్థానిక పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారితోపాటు ఈటెల రాజేందర్ గారు, మహేశ్వర్ రెడ్డి గార్లను అడ్డుకొని అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అహంకార ధోరణి ని వెల్లడిస్తోంది. పేదల పక్షాన ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను అరెస్టు చేయించడం.. ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన నేతలపై దాడులు చేయించడంగానే భావిస్తున్నాం.
ప్రజా ప్రతినిధులను ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు పోలీసులు అనుమతించడం లేదంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది అని పూర్తిగా అర్థమవుతోంది. తప్పుడు కేసులు నమోదు చేసి రాష్ట్ర రైతాంగాన్ని పరోక్షంగా భయభ్రాంతులకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ, నిరంకుశత్వ, నియంతృత్వ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
బాధితులతో మాట్లాడి, ఒప్పించి భూసేకరణ చేయాల్సిన సర్కారు.. గిరిజన బిడ్డలపై పోలీసులతో దమనకాండ సృష్టిస్తోంది. కరెంట్ తీసేసి.. మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా పోలీసులు అభ్యంతరకర పరిస్థితిలో రాత్రికి రాత్రే అక్రమ అరెస్ట్ లు చేస్తున్నారు. నాడు కేసీఆర్ సర్కారు.. ఖమ్మంలో రైతుల చేతికి బేడీలు వేస్తే.. ఇప్పుడు రేవంత్ సర్కారు రైతులను జైలులో పెట్టింది. జైలులో ఉన్న రైతులతో బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడారు.
ఇందిరమ్మ రాజ్యమంటే.. ఆడబిడ్డలపై దాడి చేయడమేనా రేవంత్ రెడ్డి ?
ఇందిరమ్మ రాజ్యమంటే.. పేద గిరిజనుల భూములను అక్రమంగా గుంజుకోవడమేనా..?
అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులను వెంటనే విడుదల చేయాలి. ప్రజల బాధలను అర్థం చేసుకుని వాటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తే.. ప్రజలు సరైన బుద్ధి చెబుతారు.