-హామీలు తక్షణమే అమలు చేయాలి
-బోగస్ డిక్లరేషన్, గ్యారంటీలతో కాలం గడపొద్దు
-రాష్ట్రంలో మరో వసూలు రాజ్యం వచ్చింది
-కిషన్‌రెడ్డి రైతు దీక్షలు ప్రారంభం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేయ డాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు రాష్ట్రంలో అనేక రకాలుగా రైతులకు అన్యాయం చేసింది. రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతి నియోజక వర్గంలో లక్ష ఎకరాల సాగు చేస్తామని చెప్పి రైతు వ్యతిరేక విధానాలతో ఇబ్బందిపెట్టారు. అందుకే కేసీఆర్ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో పేరుతో అనేక రకాలు గా 400 పైగా హామీలు ఇచ్చింది. ప్రజలకు, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదని విమర్శించారు.
ప్రజలకు వెన్నుపోటు పొడవడమే ఇందిరమ్మ రాజ్యమా?
రైతుల కష్టాలు తీరుస్తామని గ్యారంటీల పేరుతో మభ్యపెట్టారు. వంద రోజు ల్లోనే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తామని వెన్నుపోటు పొడిచారు. డిసెంబ రు 9న తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ నిలబెట్టుకోలేదు. నేడు రైతులకు తీసుకున్న అప్పులు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రైతులు దళారీల దగ్గర మిత్తీలకు అప్పులు తెచ్చుకుని పంటలు పండిస్తే ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడు తోందని అన్నారు. రాష్ట్రంలో వసూళ్లకు పాల్పడి ఆ పైసలను ఢల్లీికి పంపడం పైనే శ్రద్ధ ఉందన్నారు.
కేసీఆర్‌ను మించిన పాలన
గత ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పేరుతో దళితులను, గిరిజన బంధు పేరుతో గిరిజనులను మాయమాటలతో వెన్నుపోటు పొడిచారు. నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గత కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వసూలు రాజ్యం పోయి.. మరొక వసూలు రాజ్యం వచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలన పోయి.. సోని యా గాంధీ కుటుంబ పాలన వచ్చిందన్నారు.
బోగస్ డిక్లరేషన్..బోగస్ గ్యారంటీ
రూ. 2 లక్షల లోపు రైతు రుణాలను తక్షణమే మాఫీ, రూ. 15 వేలు రైతు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, వరికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ వంటి హామీలు ఇంతవరకు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో రూ.2200 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తోందని, ప్రతి ఏడాది రూ.26 వేల కోట్ల ఖర్చుతో ధాన్యం కొంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్.. రైతులకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ గ్యారంటీ అని ధ్వజమెత్తారు.
రైతులకు అండగా పోరాటం
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక ఎకరానికి ఏడాదికి రూ.18 వేలు ఎరువుల సబ్సిడీ రైతులకు అందిస్తోంది. గత కేసీఆర్ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేయకుండా రైతులను నిండా ముంచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా బీఆర్‌ఎస్ సర్కారు అడ్డుకుందని విమర్శించారు. అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా అన్ని మండల కేంద్రాల్లో రైతులకు అండగా ఉండేలా బీజేపీ నిరసన దీక్షలు చేపట్టిందని వివరించారు. రైతులకు అండగా ఉంటామని, ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు.