Suryaa.co.in

Editorial

రాజుపై వేటుకు జగన్‌ జంకు

– పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీల నిరసనలో వైసీపీ ఎంపీ రాజు
– జగన్‌కు వ్యతిరేకంగా నినదించిన టీడీపీ ఎంపీలతో గళం కలిపిన రాజు
– జగన్‌ సర్కారుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాస్తున్న రఘురామకృష్ణంరాజు
– రచ్చబండలో రోజూ జగన్‌ పనితీరుపై చాకిరేవు
– అయినా పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకపోవడంపై పార్టీనేతల విస్మయం
– బాబునే అరెస్టు చేయించిన జగన్‌ ఎంపీకి రాజుకు భయపడుతున్నారా?
– ఎంపీ రాజుకు జగన్‌ భయపడుతున్నారన్న సంకేతాలు నష్టమంటున్న సీనియర్లు
– రాజుపై వేటుకు ఇదే సరైన సమయమని సీనియర్ల స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

జగన్‌ జగమొండి. ఎవరి మాటా వినరు. అవసరమైతే కొండనైనా ఢీ కొంటారే తప్ప తలవంచరు. భయం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. చంద్రబాబునే అరెస్టు చేయించిన మొనగాడు. తండ్రితో కాని పని తనయుడు చేశాడు.. కానీ ఒక ఎంపీని సస్పెండ్‌ చేయడానికి మాత్రం భయపడుతున్నారు. ఇవీ.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సంబంధించి వినిపించే కామెంట్లు.

నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయించేందుకు దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు. వేయని కమిషన్లు లేవు. కోర్టులో దాఖలు చేయని కేసులు లేవు. అయినా చంద్రబాబును ఏ కేసులోనూ దోషిగా నిరూపించలేకపోయారు. కానీ ఆ పని ఆయన తనయుడు జగన్మోహన్‌రెడ్డి చేసి చూపించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బాబును అరెస్టు చేసి, జైల్లో వేయించగలిగారు.

మరి అంతటి ధైర్యశాలి, మొండివాడు.. తనను- తన పార్టీని ధిక్కరించిన ఒక సాధారణ ఎంపీపై మాత్రం చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారన్న వ్యాఖ్యలే ఆశ్చర్యం. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చాలాకాలం నుంచీ వ్యక్తిగతంగా, జగన్‌ను-ఆయన ప్రభుత్వ నిర్ణయాలను తూర్పారపడుతున్నారు.

దానితో ఆయనపై సీఐడీ కేసు పెట్టింది. సీఐడీ అధీనంలో ఉన్నప్పుడు తనపై పోలీసులు చిత్రహింసలకు పాల్పడ్డారని, కాళ్లమీద కొట్టారంటూ ఎంపి రాజు స్వయంగా కోర్టులో జడ్జికే ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్‌ కమిటీకి సీఐడీ చీఫ్‌ సునీల్‌పై ఫిర్యాదు చేశారు. అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది.

అక్కడి నుంచి ఎంపి రాజు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మరింత రెచ్చిపోవడం ప్రారంభించారు. వివిధ పథకాలు, నిధులకు సంబంధించిన అవినీతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నారు. అమెరికా పర్యటనలోనూ, తన పార్టీ అధినేత జగన్‌పై నిప్పులు కురిపించారు.

అక్కడితో ఆగకుండా.. ప్రతిరోజూ రచ్చబండ పేరుతో ప్రెస్‌మీట్లు పెట్టి, సొంత పార్టీ సర్కారును చాకిరేవు పెడుతున్నారు. ఈ విధంగా కంటిలో నలుసు- చంకలో పుండులా మారిన సొంత పార్టీ ఎంపి రాజును, పార్టీ నుంచి సస్పెండ్‌ చేయకుండా ఎందుకు మౌనంగా ఉన్నారన్న చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది.

చంద్రబాబు లాంటి నేతకే భయపడని జగన్‌.. ఒక సాధారణ ఎంపీ, అదికూడా తన పార్టీ ఎంపీపై వేటు వేయడానికి సీఎం ఎందుకు భయపడుతున్నారో అర్ధం కాక వైసీపీ సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాబును అరెస్టు చేయించడానికి చాలా ధైర్యం కావాలని, అలాంటిది బాబును అరెస్టు చేయించిన జగన్‌.. తనపై రోజూ మాటలదాడి చేస్తున్న రాజుకు మాత్రం భయపడటంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

కనీసం క్రమశిక్షణ కమిటీ కూడా ఈ విషయంలో, ఎందుకు మౌనం వహిస్తోందో పార్టీ శ్రేణులకు అర్ధం కావడం లేదు. రాజును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నామన్న ఒక లెటర్‌, లోక్‌సభ స్పీకర్‌కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో నేతలకు బోధపడటం లేదు.

సహజంగా పార్టీ అధినేతను విమర్శిస్తే, వారిని తక్షణమే సస్పెండ్‌ చేసే నాయకత్వం.. ఏళ్ల నుంచి జగన్‌కు- ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపి రాజును సస్పెండ్‌ చేయడానికి, ఎందుకు భయపడుతోందో ఎవరికీ అర్ధం కావడం లేదు.

అంతగా రాజును చూసి, జగన్‌ భయపడాల్సిన అవసరం ఏమిటి? అంటే జగన్‌కు సంబంధించిన రహస్యాలు రాజు దగ్గర ఏమి ఉన్నాయి? మరి ఇప్పటిదాకా రాజు ఆ రహస్యాలు ఎందుకు బయటపెట్టలేదు? పార్లమెంటులోనే ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రశ్నలు అడుగుతున్నా, ఆయనపై చర్యలు తీసుకోవడం లేదంటే.. జగన్‌ ఎంపి రాజుకు భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లడం సహజమే కదా? నర్సాపురంలో రాజు స్థానంలో మరొకరిని ఇన్చార్జిగా నియమించినా, ఆయనపై లోక్‌సభ స్పీకర్‌కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

ఎంపి రఘురామకృష్ణంరాజును అనర్హుడిగా ప్రకటించాలని, వైసీపీ పార్లమెంటరీపార్టీ లోక్‌సభ స్పీకర్‌కు, ఫిర్యాదు చేసి చాలా కాలమయిపోయింది. పార్లమెంటరీ సమావేశాలకు రాజును ఆహ్వానించడం లేదు. సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లినప్పుడు రాజు అక్కడ కనిపించరు. పైగా తన పార్టీకి సంబంధం లేని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వస్తే ఎయిర్‌పోర్టులో కలసి స్వాగతం చెబుతారు. పార్టీకి సంబంధించిన వెబ్‌సైట్‌లో కూడా రాజు పేరు తొలగించారు. ఏపీ సర్కారుకు వ్యతిరేకమైన ప్రశ్నలు వేస్తూ తలనొప్పిలా మారారు. మరి పార్టీకి ఇంత నష్టం కలిగిస్తూ, సీఎం జగన్‌ ఇమేజీని డామేజీ చేస్తున్న రాజుపై.. ఎందుకు సస్పెన్షన్‌ వేటు వేయలేదన్న ప్రశ్నలకు, వైసీపీ నేతల వద్ద జవాబు దొరకడం లేదు.

తాజాగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపి, మాజీ ఎంపీలు ధర్నా చేశారు. ఆ ధర్నా కార్యక్రమానికి వైసీపీ ఎంపీ రాజు హాజరుకావడం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సొంత పార్టీ అధినేతకు వ్యతిరేకంగా, ప్రత్యర్ధి పార్టీ నిర్వహించిన ధర్నాలో సొంత పార్టీ ఎంపీ హాజరుకావడంపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి ఎంపి రాజుకు, అధినేత భయపడుతున్నారన్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని వైసీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

రాజును అనర్హుడిగా ప్రకటించాలన్న తమ పార్టీ వినతిని స్పీకర్‌ పట్టించుకోకపోతే.. పార్టీ నుంచి ఆయనను సస్పెండ్‌ చేసే అధికారాన్ని, ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్ధం కావడం లేదని, సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఎంపి రాజుకు సీఎం జగన్‌ భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లడం సహజమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE