Suryaa.co.in

Editorial

బాధితులకు జగన్ సాయం 57 కోట్లు?

– టీడీపీ దాడిలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకూ కోటి రూపాయలు
– 36 మంది కార్యకర్తలు చనిపోయారంటూ గతంలో ఢిల్లీలో జగన్ ధర్నా
– మొత్తం 93 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న జగన్
-మొన్నటి కోటి సాయంపై వెక్కిరింపులతో దిద్దుబాటు
– సాయం చేయరన్న చెడ్డపేరు చెరిపేసుకునే ఎత్తుగడ
– ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి సాయం
– ప్రభుత్వానికి ధీటుగా సాయం చేయాలన్న వ్యూహం
-భారతితో కలసి బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులివ్వాలని నిర్ణయం
– జనాలకు చేరువయ్యేందుకు జగన్ తపన
– పిసినారి పేరును తొలగించుకునే యత్నం
( మార్తి సుబ్రహ్మణ్యం)

నయా పైసా సాయం చేయరనే చెడ్డపేరున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనన్న.. తాజా వరదల నేపథ్యంలో ఆ చెడ్డపేరు తొలగించుకునేందుకు తంటాలు పడుతున్నారట. వ్యాపారస్తుడైన జగన్‌కు ఉన్న పిసినారి అన్న పేరు..ఇటీవల బెజవాడ వరద బాధితుల సహాయార్ధం జగన్ ప్రకటించిన కోటి రూపాయల విరాళంతో బట్టబయలయింది. నిజానికి మంచి పేరు తీసుకురాకపోగా, బూమెరాంగయింది.

‘‘లక్షకోట్ల ఆస్తిపరుడైన జగన్ ప్రకటించిన కోటిరూపాయలు ఏం చేసుకోవాలి? అంత డ బ్బు ఎక్కడ దాచిపెట్టుకోవాలం’’టూ .. సోషల్‌మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తడం, జగన్‌ను నైతికంగా ఇరుకున పడేసింది. ఆయన ఇమేజీని దారుణంగా డామజీ చేసింది. దానితో వ్యూహం మార్చి, ప్రభుత్వానికి ధీటుగా బాధితులకు భారీ సాయం చేయడం ద్వారా.. తనపై ఉన్న ‘పిసినారి’ అనే మచ్చ తొలగించుకోవాలని, నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందులో భాగంగా ఇటీవల బెజవాడలో కురిసిన భారీ వర్షాలతోపాటు, రాష్ట్రంలో కురిసిన వర్షాలకు ఇప్పటివరకూ మృతి చెందిన 57 మంది కుటుంబాలకు.. కోటి రూపాయల చొప్పున, 57 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు జగన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వైసీపీ అధికార మీడియా సాక్షిలోనే 57 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల్లో టీడీపీ చేసిన దాడిలో 36 మంది వైసీపీ కార్యకర్తలు మృతి చెందారని జగన్ ఆరోపించారు. దానిని నిరసిస్తూ ఆయన ఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. వీరందరికీ కలిపి ఒకేసారి ఇచ్చే చెక్కును, జగన్ తన భార్య భారతీతో కలసి ఇస్తారంటున్నారు. దీనికి సంబంధించి బాధితుల కుటుంబ వివరాలు తీసుకోవాలని, తన జిల్లా పార్టీ నేతలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు.

నిజానికి జగన్ పార్టీ స్థాపించిన తర్వాత ఇప్పటివరకూ ఎన్నోసార్లు వరదలు, తుపాన్లు వచ్చాయి. అయితే ఏ ఒక్క సందర్భంలోనూ ఆయన.. బాధితులకు ఒక్కసారి కూడా వ్యక్తిగత సాయం గానీ, పార్టీ నుంచి విరాళాలు గానీ ఇచ్చిన దాఖలాలు గానీ లేవు. పోనీ పార్టీ నిధులు ఏమైనా తక్కువా అంటే అదీకాదు. వైసీపీ బ్యాంకు ఖాతా దాదాపు 400 కోట్ల రూపాయల పైమాటేనంటున్నారు. ఇటీవల ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం బట్టబయలయినప్పుడు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు చదివించుకున్న పార్టీల్లో బీఆర్‌ఎస్ తర్వాత వైసీపీనే కావడం గమనార్హం. కాబట్టి బాధిత కుటుంబానికి-మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు కోటి రూపాయలివ్వడం, జగన్‌కు పెద్ద కష్టం కాదంటున్నారు.

సహజంగా టీడీపీ తన ఎన్టీఆర్ ట్రస్టు నుంచి ఇప్పటివరకూ బాధితులకు వందల కోట్ల సాయం చేసింది. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రకృతి ప్రకోపించిన ప్రతి సందర్భంలోనూ, ఎన్టీఆర్ ట్రస్టు బాధితుల సాయంలో ముందుంటుంది. టీడీపీ సైన్యం స్వయంగా సహాయ కార్యక్రమాల్లో దిగుతుంటుంది.

చంద్రబాబునాయుడు విపక్షనేతగా ఉండే సందర్భాల్లో అయితే రోజుకు హీనపక్షం, 50 మందికి వివిధ రూపాల్లో ట్రస్టు నుంచి సాయం చేసేవారు. దానికోసం ఆయన రోజుకు గంటసేపు కేటాయించేవారు. అందులో ఎక్కువగా ఆసుపత్రి, స్కూళ్ల ఫీజులే ఎక్కువగా ఉండేవి. వాటిని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వహకులే చెల్లించేవారు. నిరుపేదలైతే ఎన్టీఆర్ స్కూలు, కాలేజీలో ఉచితంగా సీట్లు ఇచ్చేవారు.

అలాగే ఆరెస్సెస్ కూడా కొన్ని దశాబ్దాల నుంచి, బాధితుల పక్షాన రంగంలోకి దిగుతోంది. చివరకు వరదలో కొట్టుకువచ్చే శవాలకు దహనస్కంసారాలు కూడా నిర్వహిస్తున్న మానవతా సంస్థ అది. అప్పటి దివిసీమ ఉప్పెన నుంచి మొన్నటి కరోనా వరకూ ఆరెస్సెస్ చేయని సేవలంటూ లేవు. బట్టలు, పుస్తకాలు, ఆహార సామాగ్రి అందించే అలవాటు సంఘ్‌కు కొన్ని దశాబ్దాల నుంచే ఉందన్న విషయం తెలిసిందే.

అసలు సమాజంలో పేరున్న ప్రముఖులు ఏర్పాటుచేసుకునే ట్రస్టులే, బాధితులకు కోట్లాదిరూపాయల సాయం చేస్తుంటాయి. చిన్నా చితకా రాజకీయ పార్టీ అధ్యక్షులు సైతం, తమ స్ధాయిలో బాధితులకు సాయం ప్రకటిస్తుంటాయి.

కానీ లెక్కలేనన్ని మైనింగ్ కంపెనీలు, పవర్ ప్రాజెక్టులు, మీడియా సంస్థలతో వేలకోట్లకు ఎదిగిన జగన్ కుటుంబం మాత్రం ఇప్పటిదాకా ఏ సందర్భంలోనూ ఎర్ర యాగాణీ సాయం ప్రకటించకపోవడం విమర్శలకు గురవుతోంది. ఇటీవల బెజవాడ బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించినప్పుడయితే, జగన్ శైలిపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వ్యక్తమయ్యాయి. అయితే జగన్ సీఎంగా ఉన్నప్పుడు బాధితులకు భారీ సాయం చేసినప్పటికీ, అది ప్రభుత్వ డబ్బు తప్ప, సొంతానిది కాదు కదా అన్న వ్యాఖ్యలు వినిపించాయి.

‘‘దానితో అసలు ఏమీ ఇవ్వకపోయినా బాగుండేది. జగన్ స్థాయి వ్యక్తి కోటిరూపాయలు ప్రకటించి తన స్థాయి తక్కువ తనాన్ని బయటపెట్టుకోవడమే విమర్శలకు కారణమయింది. లక్ష కోట్ల ఆస్తులున్న జగన్, కోటిరూపాయలివ్వడమేమిటన్న అనవసర చర్చకు దారితీసింది. ఫలితంగా జగన్ కుటుంబం పిసినారి. తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదన్న వ్యాఖ్యలు మొదలయ్యాయి. ఈ చర్చకు తెరదించడం కోసమే ఆయన ఒక్కో బాధిత కుటుంబానికి కోటి రూపాయలివ్వాలని నిర్ణయించుకున్నట్లున్నార’’ని వైకాపా సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.

ఆరకంగా ఇప్పటివరకూ మృతి చెందిన 57 మంది వరదమృతులతోపాటు.. టీడీపీ దాడిలో చనిపోయారంటున్న 36 మంది మృతుల కుటుంబాల వద్దకు సతీసమేత ంగా వెళ్లి స్వయంగా చెక్కులు అందించాలని భావిస్తున్నారు. దానిద్వారా జగన్ విశాల హృదయాన్ని ప్రపంచానికి చాటుకోవాలన్నదే అసలు లక్ష్యమంటున్నారు.

LEAVE A RESPONSE