గత ఐదేళ్లు జెండాలు మడిచి అటక పై పెట్టిన కమ్యూనిష్టులు.. నేడు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే, అటక పై వున్న జెండాలకు దుమ్ము దులిపి జనంలోకి బయలు దేరారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పరోక్షంగా అంటకాగిన సీపీఎం నాయకులు, ఇప్పుడు జెండాలను బయటకు తీసి, ఉద్యమాలు మొదలుపెట్టి వైసీపీ తో పరోక్షంగా స్నేహం చేస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించిన సీపీఎం నాయకులు, నేడు జగన్‌తో గొంతు కలుపుతున్నారు. జగన్ కళ్ళ అద్దాలు పెట్టుకొని చూడటం తో, కమ్యూనిస్టులకు జగన్ పాలన కమ్మ గా కనిపించి ఉంటుంది. ఒకప్పుడు కమ్యూనిస్టులు విలక్షణ పాత్ర పోషించే వారు. నేడు వారి స్వార్ధ పూరిత రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ కి శాపంగా మారాయి. మంచి చేస్తున్న వారిని కూడా విమర్శించడం కమ్యూనిష్టుల నైజంగా మారింది.
వారి స్వార్ధ పూరిత ఉద్యమాలు, కపట నాటకాలు ప్రజలు గమనించే.. వారిని ఎక్కడ వుంచాలో అక్కడే ఉంచుతున్నారు. కూటమి ప్రభుత్వం వారు చెప్పినట్లు ఆడాలని కోరుకుంటున్నారు. కమ్యూనిష్టులు సైద్దాంతిక భావ దారిద్ర్యం తో బాధపడుతున్నారు. తాము మాత్రమే ప్రజాపక్షమని,ఇతరులు ప్రజా వ్యతిరేకులని వారి భావన. నిజంగా వారు అంత పవిత్రులు అయితే, ప్రజల పక్షాన నిష్టగా పోరాటం చేస్తున్నవారయితే.. దేశ వ్యాప్తంగా వారి అడ్రస్ ఎందుకు గల్లంతు కావాల్సి వచ్చిందో ప్రజలకు చెప్పాలి.
ప్రజాసమస్యల పై జనచైతన్య యాత్రలు చేస్తారట. వారు ఉనికి కాపాడుకోవడం కోసమే ఉనికి యాత్రలు మొదలు పెడుతున్నారు. మాకు మించిన జనోద్ధారకులు లేరు అన్నవిదంగా కమ్యూనిస్టులు, కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఇష్టాను సారం విషం కక్కారు. ప్రభుత్వం పై విషపు రాతలు రాయడం లో సాక్షిపత్రిక తో పోటీ పడుతోంది కమ్యూనిష్టుల పత్రిక ప్రజాశక్తి కూడా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ లో మాటల కోతలు, నిధుల కోతలు తప్ప ప్రజలకు ప్రాధాన్యత లేదని, కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనాల్లో ప్రజలను పట్టించుకోలేదని, నిజాయితీ లేదని, చెప్పిన లెక్కలన్నీ మోసపూరితమని, ఇది ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటికాదని. రూ.15 వేల కోట్ల సొంత పన్నులు పెరుగుతాయంటే ప్రజలపై భారం వేయడమేనని, పన్నేతర ఆదాయం రూ.7 వేల కోట్ల నుండి రూ.19 వేల కోట్లకు పెంచారని, వాటికోసం సారా తాగిస్తారా అని, సూపర్‌సిక్స్ పథకాల్లో బడ్జెట్ ప్రారంభంలోనే మూడు ఎగిరిపోయాయని, మిగిలిన మూడు పథకాలు సగం నిధులకే పరిమితం అయ్యాయని, రూ.48 వేల కోట్లు వ్యవసాయ బడ్జెట్ చూపించి 22 శాతం గ్రోత్‌రేట్ ఉంటుందని చెప్పడం కంటి తుడుపు మాటలేనని విషం కక్కారు.
ఐదేళ్లు వాళ్లు దోచుకున్నారు, ఇప్పుడు మేము దోచుకుంటాం అనే విధంగా ప్రభుత్వ తీరు ఉందని, మూలధన వ్యయాన్ని తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారని, పి 4 పేరుతో పేదవాళ్లను ధనవంతులు దత్తత తీసుకునే కార్యక్రమం పెట్టారని, మొత్తంగా పి4 పేరుతో ప్రభుత్వం ప్రజల బాధ్యత నుండి తప్పుకునే కార్యక్రమం చేస్తున్నారని సిపిఎం నాయకుడు బివి రాఘవులు బడ్జెట్ పై ఇష్టానుసారం విషం కక్కారు.
కూటమి బడ్జెట్‌కు దిశానిర్దేశం లేదని. సూపర్‌సిక్స్ పేరుతో చేసిన ఎన్నికల వాగ్ధానాలకు పూర్తిగా గాలికొదిలేశారా అన్న అనుమానం కలుగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ 2025-26 బడ్జెట్లో కానరాలేదని, ఆ వాగ్ధానాలను పూర్తిగా విస్మరించి, ఒట్టు తీసి గట్టుమీద పెట్టి బడ్జెట్ లో లెక్కలు ఘనంగా చెపితే, జనం నమ్ముతారా అని, అరచేతిలో అద్భుత రాజధాని పెరుమాళ్లకెరుక, కళ్లముందు కన్పించే అప్పులకుప్ప ఆందోళనకరం. వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి ప్రాధాన్యతే ఇవ్వలేదు. సాగునీటి రంగానికి కనీసం 10% కేటాయింపులు ఉండాలని, లెక్క ప్రకారం బడ్జెట్లో రూ.32 వేల కోట్లు కేటాయించాలి. కానీ ఈరోజున సాగునీటికి కేటాయించింది కేవలం రూ.11,314 కోట్లు, 3.5% కూడా లేదని విషం కక్కారు.
కడుపునింపని కొటేషన్లు మాత్రం బడ్జెట్ పుస్తకంలో బోలెడన్ని ఉన్నాయి. గారిడీ లెక్కలతో ఈ రాష్ట్రాన్ని ఎటు మోసుకుపోవడానికో అర్థం కావడం లేదని ఈ విధంగా బడ్జెట్ పై విషం చిమ్ముతూ, మరో సిపిఐ నాయకుడు వ్యాసం రాశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మహిళా సంక్షేమాన్ని, ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని, ఉచిత గ్యాస్, పది లక్షల వరకూ జీరో వడ్డీ రుణాలు ఇస్తామని ప్రకటించినా అవేమీ బడ్జెట్లో కనిపించలేదని, మహిళా శిశు సంక్షేమశాఖకు కేటాయించిన రూ.4,332 కోట్ల బడ్జెట్ సరిపోదని. తల్లికి వందనం కింద రూ.12 వేల కోట్లు కావాల్సి ఉంటే, రూ.9403 కోట్లు మాత్రమే కేటాయించారని, అంటే పిల్లలను తగ్గిస్తారా లేక బకాయిలు పెడతారా మరో మహిళా నాయకురాలు బడ్జెట్ పై నోరు పారేసుకొన్నారు.
గత ఐదేళ్లు జగన్ రెడ్డి అరాచక,అసమర్ధ పాలన పై చేసిన పోరాటాలు ఏమిటో ప్రజలకు కమ్యూనిస్టులు సమాధానం చెప్పగలరా? జగన్ రెడ్డి రాష్ట్రాన్నిఎంత విధ్వంసం చేసినా నోరెత్తని కమ్యూనిస్టులు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులు నుంచే విషం కక్కడం మొదలు పెట్టారు. జగన్ పాలనలో అన్ని రంగాలు కుప్పకూలాయి. అన్ని వ్యవస్థలను ధ్వంసం అయ్యాయి. అన్నివర్గాల ప్రజలు అవస్థలు పడాల్సిన దుస్థితి.
భూ మాపియా, గనుల మాపియా, ఇసుక మాపియా ,మద్యం మాపియా రాష్ట్రాన్ని,మట్టి మాఫియా,కొత్తగా డ్రగ్స్ మాఫియా దోపిడీ చేసి రాష్ట్రాన్ని కరిమింగిన వెలగపండుగా మిగిల్చారు. ప్రజారోగ్యం, విద్య గాలిలో దీపం అయ్యాయి. పారిశ్రామిక రంగం పతనమైంది. పరిశ్రమలు పారిపోయాయి. పల్లె, పల్లెలో వేదనే మిగిలింది. నిరుద్యోగులు వంచనకు గురి అయ్యారు.
ఫీజు రీయంబర్స్ మెంట్, విద్యార్ధుల సంక్షేమం, దైవాధీనం . విద్యుత్తు చార్జీలు 9 సార్లు పెంచి ప్రజల పై రూ 60 వేల కోట్ల భారం వేశారు. ధరలు పెరిగి బ్రతుకు భారమై మధ్య తరగతి వారు పేదలు గాను, పేదలు నిరుపేదలుగాను మారారు. నవ్యాంద్రను నాశనం చేశారు వైసీపీ నాయకులు. తన విద్యుక్త ధర్మాన్ని విడనాడి, దోపిడీకి ప్రణాళికలు వేశారు తప్ప, అభివృద్ధి కి ప్రణాళికలు వేయలేదు.
వ్యవసాయం, నీటి పారుదల రంగం,రోడ్లు, విద్యుత్ అన్ని రంగాలు నేలమట్టం అయినాయి. విభజన అనంతరం 2014- 19 మధ్య అభివృద్ధి పథాన దూసుకు పోతున్న రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్రాన్ని సర్వం చేసిన జగన్ పరిపాలన పై కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు ఏమిటి? ఐదేళ్లు మౌనంగా వున్న వారు, కూటమి పాలనలో ఏదో జరిగిపోయినట్లు వారి పత్రికలలో వ్యాసాలు రాయడం,.పరిపాలన పై విమర్శలకు దిగడం వారి కుచ్చిత రాజకీయాలకు నిదర్శనం.
కమ్యూనిస్టులు నచ్చిన, మెచ్చిన వారు పరిపాలన ఎంత అద్వాన్నంగా చేసినా మాట్లాడరు. వారికి నచ్చని చంద్రబాబు ఏమి చేసినా నచ్చదు. గత ఐదేళ్లు పోలవరాన్ని, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పాడుపెట్టినా మాట్లాడని కమ్యూనిష్టులు.. కూటమి ఈ బడ్జెట్ లో సాగునీటి రంగానికి రూ 18,019 కోట్లు కేటాయించినా విమర్శిస్తున్నారు. దశాబ్దాల క్రితం ప్రభుత్వ పథకాల కింద కట్టుకున్న ఇళ్లకు, ఓటిఎస్ పేరుతో డబ్బులు వసూలు చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు, పాఠశాలల విలీనం వంటి వినాశకర విధానాలను అమలు చేశారు.
నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెంచి ప్రజల నడ్డి విరిచారు. ఎన్నికల ముందు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. వేతన సవరణ, సిపిఎస్ రద్దు హామీ గాలికి వొదిలేశారు. చట్టబద్ధంగా ఉద్యోగులకు అందాల్సిన ఏ ఒక్క సహాయం సకాలంలో చెల్లించలేదు. నిరుద్యోగ యువత ఎంతో ఆశించిన డిఎస్సి, ఇతర ఉద్యోగాల కోసం ప్రకటిస్తానన్న జాబ్ క్యాలెండర్ అడ్రస్సు లేదు.రా
జధానిని నాశనం చేశారు. ఇసుక పాలసీ పేరుతో పేద, లక్షలాది భవన నిర్మాణ కార్మికులను ఇక్కట్లకు గురి చేశారు. మద్యం పాలసీ వల్ల మద్యం నియంత్రణ జరగకపోగా మద్యం ధరలు పెంచారు. వైసీపీ ప్రజా ప్రతినిధుల్లో కీచక పర్వం తారా స్థాయికి చేరి జుగుప్సా కరంగా వ్యవహరించారు. జగన్ రెడ్డి దుర్మార్గ, ప్రజా వ్యతిరేక పాలనపై కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు ఏమిటి?
వాస్తవాలతో సంబంధం లేకుండా నాలుగు మభ్యపెట్టే మాటలు చెబుతూ, చంద్రబాబుని విమర్శించినంత మాత్రనా ప్రజలు కమ్యూనిస్టులను నమ్మే పరిస్థితి ఉందా? విలువలు, సిద్ధాంతాల కంటే స్వార్ధ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ, చంద్రబాబుపై విషం కక్కుతున్నారు. కాలం గడిచే కొద్ది వారు కాలగర్భంలో కలిసిపోతున్నా, కాలం చెల్లిన సిద్దాంతాలు విడనాడటంలేదు. ఆదర్శాలే తప్ప ఆచరణ ఎరుగరు.
వారి మాటలకు,చేతలకు పొంతన ఉండదు. గతంలో కమ్యూనిస్టులు దృఢమైన వైఖరితో ఉండి, దేశహితం,ప్రజాహితం కోసం పనిచేసే వారు. ఇప్పుడు తాము మాత్రమే ప్రజాపక్షం అయినట్లు. చంద్రబాబు పాలనలో ప్రజలకు నష్టం జరుగుతున్నట్లు ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై కమ్యూనిస్టులు పసలేని ఆరోపణలు చేస్తు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు.
కానీ ప్రజలు విజ్ఞులు. బూటకపు ఆరోపణలతో ఫలితం ఉండదు. చంద్రబాబు పై వున్న ద్వేషంతోనే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తు న్న కమ్యూనిస్టులు వికృత రాజకీయాలకు పాల్పడటం వల్లనే , ప్రజల్లో ఆదరణతో పాటు గౌరవం కుడా కోల్పోతున్నారు. వారి విమర్శలకు, సిద్దాంతాలకు ఆకర్షితులయే తరం తరిగి పోయింది.
ఇప్పటికైనా కమ్యూనిస్టులు జగన్ పాలనలో ఏమి జరిగిందో, ఇప్పుడు ఏమి జరుగుతుందో గమనించి, విమర్శలు చెయ్యాలి. గత ఐదేళ్లు జగన్ ప్రభుత్వం పై ఎందుకు పోరాటాలు చెయ్యలేదో.. అధికారంలో ఉన్నప్పుడు రహస్యంగా అండదండలు అందించాల్సిన అవసరం ఏమిటో కమ్యూనిష్టులు ప్రజలకు సమాధానం చెప్పాలి.
– నీరుకొండ ప్రసాద్
హైదరాబాద్
9849625610