– ఏ ముఖం పెట్టుకుని నెల్లూరుకు వస్తున్నారు జగన్ రెడ్డి?
– సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
నెల్లూరు: ఏ ముఖం పెట్టుకుని నెల్లూరుకు వస్తున్నారు జగన్ రెడ్డీ? ఇంటర్నేషనల్ లిక్కర్ స్కామ్ నిందితులకు ముఖం చాటేసి నెల్లూరు అందగాళ్లను పలకరించడానికి వస్తున్నారా? విజయవాడ జైలుకు వెళితే లిక్కర్ కేసు నిందితులు, వారి కుటుంబసభ్యులు నిలదీస్తారని భయపడుతున్నారా? అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే…
మీ అత్యాశ, ధనదాహం కారణంగా జైలుకు వెళ్లిన వారిని కనీసం పలకరించకపోవడం అన్యాయం కదా..? కాకాణి అండ్ బ్యాచ్ చేసిన అరాచకాల బండారాన్ని ఎల్లుండి బయటపెడతా! నర్తకీ సెంటర్ వేదికగా సినిమా చూపిస్తా! శాంతిభద్రతల పరిరక్షణకే పోలీస్ అంక్షలు. ఘోరాలు –నేరాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని చూసేందుకు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరుకు వస్తున్నాడంట. పాపాలు చేసిన కాకాణిని పరామర్శిస్తున్నారు సరే…గోవర్ధన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలతో అకారణంగా జైలుకు వెళ్లిన వారిని ఎవరు పరామర్శిస్తారు?
వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గంలో విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో తెలుసా…ఆస్తుల ధ్వంసం కారణంగా జరిగిన నష్టమెంత? ఆ రోజు సీఎంగా జగన్ రెడ్డి ఏ రోజైనా కాకాణి దురాగతాలను ప్రశ్నించారా?
చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులతో పాటు మా తల్లిదండ్రులను నీచంగా మాట్లాడిన రోజు కనీసం మందలించారా? దుర్మార్గాలు చేసిన కాకాణిని మందలించకపోగా జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తారా?
అరాచకాలు చేసిన కాకాణిని, ఒక మహిళా ఎమ్మెల్యే గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నారు. గతంలో చాలా దుర్మార్గంగా మాట్లాడిన వల్లభనేని వంశీని సైతం పరామర్శించి వచ్చారు. జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్న ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు 12 మంది అరెస్ట్ అయ్యారు.
సంచలనంగా మారిన ఈ కేసులో జైలుకెళ్లిన నిందితుల్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి, గ్రూప్ 1 ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో రాజ్ కసిరెడ్డి, భారతి సిమెంట్స్ ఇన్ చార్జి గోవిందప్ప తదితర ప్రముఖులున్నారు.. వీళ్లందరూ జైలుకు పోవడానికి కారణం ఎవరు…. జగన్ మోహన్ రెడ్డి కాదా? మొన్న మిథున్ రెడ్డి కంపెనీలో రూ.5 కోట్ల లావాదేవీలు, నిన్న శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో 12 పెట్టెల్లో రూ.11 కోట్లు బయటపడ్డాయి. దుబాయ్ కేంద్రంగా నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయిలో రూటింగ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో పాత్రధారులైన వైసీపీ ప్రధాన నాయకులందరూ ఎక్కడ కూర్చున్నారు..ఎంత సేపు కూర్చున్నారో కూడా లొకేషన్ ఆధారాలతో సహా నిర్ధారణ జరిగింది.
అక్రమంగా దోచిన డబ్బంతా కంటైనర్లలో రవాణా చేసిన సంగతి కూడా తెలిసిపోయింది. ఎన్నికల సందర్భంగా ఏఏ ప్రాంతాలకు డబ్బు చేర్చారో తేలింది. కావలి లాంటి నియోజకవర్గాల్లో ఎంతెంత ఇచ్చారో నిర్ధారణయింది. ఇన్ని ఘనకార్యాలు చేసి ఈ రోజు జైలులో ఉన్న వారందరనీ జగన్ రెడ్డి ఇంకా ఎందుకు పరామర్శించలేదు. రూ.3700 కోట్ల దోపిడీకి బాస్ ఎవరు…ఇప్పటి వరకు 12 మంది జైలుకు పోవడానికి కారణం ఎవరు? రూ.11 కోట్లను 12 అట్టపెట్టెల్లో దాచిపెట్టారు..ఈ లెక్కన రూ.3700 కోట్లను 4 వేల అట్టెపెట్టల్లో సర్దారు..
4 వేల అట్టపెట్టెలను ట్రాన్స్ పోర్టు చేయడానికి 20 లారీలు అవసరమవుతాయి? ఇంతపెద్ద స్కామ్ జరగడానికి కారణం ఎవరు? చీఫ్ సెక్రటరీ నుంచి వచ్చిన ఫైలును కాదని వాసుదేవరెడ్డిని ఎక్సైజ్ కమిషనర్ గా నియమించిందెవరు?
డిజిటల్ పేమెంట్లు ఉండకూడదని, రూ.1.30 లక్షల కోట్ల లావాదేవీలు కరెన్సీలోనే జరగాలని ఎవరి నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది? ఓ వైపు ప్రధానమంత్రి డిజిటల్ ఇండియా అంటుంటే కాదని, క్యాష్ ఆంధ్రప్రదేశ్ గా దేశంలో మార్కు వేసిందెవరు? వీటన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి దురాశ, అత్యాశ కాదా..?
దోచిన డబ్బంతా ఏ ప్యాలెస్ లో పెట్టారు..తాడేపల్లిలో దాచారా…పులివెందులలో భద్రపరిచారా..లేక ఇడుపులపాయాలో భద్రంగా పెట్టారా? రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన కుమారుడిగా జగన్ రెడ్డి రూ.43 వేల కోట్లు దోచేశారని సీబీఐ తేల్చింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో కేవలం ఒక్క లిక్కర్ స్కామ్ లోనే రూ.3700 కోట్ల దోపిడీ బయటపడింది.
మైనింగ్, శాండ్, లాండ్ స్కాముల్లో ఎన్ని వేల కోట్ల దోపిడీ జరిగిందో. ఈ వేల కోట్లను ఎక్కడ దాచారు.. ఈ పాపపు సొమ్మును ఏం చేసుకుంటారు? జగన్ రెడ్డి కారణంగా మద్యం స్కాంలో చిక్కుకుని జైలులో ఉన్న వారిని పరామర్శించకుండా ఆయన నెల్లూరుకు ఎందుకు వస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అంత మంచి బాలుడా.. మిథున్ రెడ్డిని ఎందుకు పరామర్శించడం లేదు..చెవిరెడ్డి, ధనుంజయరెడ్డి, రాజ్ కసిరెడ్డిని ఎందుకు పట్టించుకోరు..వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పలకరించలేదు. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలులో పరామర్శించిన వ్యక్తి ఎలాంటి దారుణాలకు ఒడిగట్టాడో, ఎన్నెన్ని పాపాలు చేశాడో, ఎలాంటి భాష వాడాడో ఎల్లుండి ప్రజల సమక్షంలో సినిమా చూపిస్తా?
లెక్కకు మించి పాపాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మొన్న సతీసమేతంగా వెళ్లి గవర్నర్ ను కలిసివచ్చారు. ఎన్నో దుర్మార్గాలు చేసిన జగన్ రెడ్డికి ఆ అర్హత ఎక్కడిది? తన కారణంగా జైలులో ఉన్న వారిని పలకరించి బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడాలో తెలియకే జగన్ రెడ్డి వారి పరామర్శకు వెళ్లడం లేదని రాష్ట్రమంతా అనుకుంటున్నారు. వారిని పరామర్శించడానికి వెళితే కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పే పరిస్థితిలో జగన్ రెడ్డి లేరు..వారు నిలదీస్తారని భయపడిపోతున్నాడు…అందుకే వెనకడుగు వస్తున్నాడు. అక్రమ మైనింగ్ కేసులో తన అత్యాశ కారణంగా జైలుకెళ్లిన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని బయటకు వచ్చాక అయినా పలకరించిన పాపాన పోయారా? దుర్మార్గాలు, పాపాలు చేసిన వ్యక్తిని పరామర్శించేందుకే జగన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నారు. రప్పా రప్పా అంటూ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు..పొట్టేళ్లను నరికినట్టు నరికేస్తే తప్పేముందని తప్పుదారి పట్టిస్తున్నారు.
ఒకప్పుడు అరాచకాలకు అడ్డాగా ఉన్న బీహార్ లో పరిస్థితులు బాగుపడ్డాయి.. ఇప్పుడు వైసీపీ నేతలు ఏపీని మరో బీహార్ లా చేయాలని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిభద్రతల పరిరక్షణకే పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు మేం అక్రమ కేసులు పెట్టామని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారు..అది కూడా మేం పెట్టామా…ఈ కేసుకు కారణం కాకాణి ధనదాహం కాదా? అప్పట్లోనే ఇద్దరు తహసీల్దార్లు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, పలువురు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యారు..వీరంతా చర్యలకు గురైంది కాకాణి వల్ల కాదా?
వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన మెక్ డోల్ బ్రూవరీస్ లంచం ఇవ్వలేదని మూయించింది ఎవరు..జగన్ రెడ్డి ప్రభుత్వం కాదా? డబ్బు విషయంలో జగన్మోహన్ రెడ్డికి తన, మన తారతమ్యం లేదు. 2020 నుంచి 2023 వరకు 11 కొత్త మద్యం కంపెనీలు వెలిశాయి. పాత డిస్టలరీలన్నింటిని మూయించి 11 కొత్త కంపెనీలతో వ్యాపారం చేయించారు. ఇన్ని పాపాలు చేసి ఇప్పుడు తగుదనమ్మా అంటూ పరామర్శల పేరుతో రాజకీయాలు చేస్తారా? రాజకీయ చైతన్యానికి మారుపేరైన నెల్లూరు జిల్లాలో చెత్త రాజకీయాలు చేసి భ్రష్టుపట్టించిన ఘనత వైసీపీ నాయకులదే!