Suryaa.co.in

Editorial

కృష్ణమూర్తి నియామకం చెల్లుతుందా?

– మూడు సార్లు టీటీడీ సభ్యుడిగా కొనసాగడం చెల్లదంటున్న నిబంధనలు
– అమిత్‌షా సిఫార్సుతో టీటీడీలో పీఠమేస్తున్న కృష్ణమూర్తి వైద్యనాధన్
– మూడుసార్లు వరసనగా కొనసాగకూడదన్న టీటీడీ మాజీ ఈఓ ఎల్వీ
– గత పర్చేజింగ్ కమిటీ సభ్యురాలు ప్రశాంతిరెడ్డికి మళ్లీ చోటు
– కల్తీ నెయ్యి వ్యవహారాన్ని గుర్తు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్టింగులు
– ఇప్పటికే కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ కమిటీ ఏర్పాటు
– మరి కృష్ణమూర్తిని కొనసాగిస్తారా? తప్పిస్తారా?
– ఆయన కోసం నిబంధనలు మారుస్తారా?
– ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించి అమిత్‌షాను తృప్తిపరుస్తారా?
– సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగునెలల తర్వాత ప్రకటించిన టీటీడీ పాలకవర్గంలో చోటు సంపాదించిన కృష్ణమూర్తి వైద్యనాధన్ నియామకంపై వివాదం నెలకొంది. దీనిపై సోషల్‌మీడియాలో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. టీటీడీ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి వరసగా మూడుసార్లు టీటీడీ సభ్యుడిగా కొనసాగకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఒకసారి విరామం తర్వాత, ఎన్నిసార్లయినా టీటీడీ సభ్యుడిగా కొనసాగవచ్చని చెబుతున్నారు. ‘టీటీడీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి మూడుసార్లు కొనసాగడం నిషిద్ధం ఉన్న మాట నిజమే’నని టీటీడీ మాజీ ఈఓ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు.

కృష్ణమూర్తి వైద్యనాధన్ గత మూడు పాలకమండలిలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీనితో ఆయన నియామకం చెల్లదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షాకు నమ్మినబంటయిన కృష్ణమూర్తి, ఆయన ఒత్తిళ్లు-సిఫార్సుతోనే మూడుసార్లు టీటీడీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో కూడా, అమిత్‌షా సిఫార్సుతోనే ఆయన కొనసాగారు. దీనితో కృష్ణమూర్తి నియామకం చెల్లుబాటుపై చర్చకు తెరలేచింది. మరి ఆయన కోసం టీటీడీ నిబంధనలు మారుస్తారా? లేక వివాదం ఎందుకని తొలగించి, ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించి, అమిత్‌షాను సంతృప్తిపరుస్తారో చూడాలి.

ఇక జగన్ హయాంలో టీటీడీ బోర్డులో పనిచేసి, పర్చేజింగ్ కమిటీలో సభ్యురాలిగా పనిచేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి స్థానం కల్పించడంపైనా సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఆమె పర్చేజింగ్ కమిటీ సభ్యురాలిగా పనిచేసినప్పుడే టీటీడీ పాలకవర్గం నెయ్యి కొనుగోలు చేయడం, అది తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివాదంగా మారి, సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ కమిటీ వేయడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. ఆమె సభ్యురాలిగా ఉన్న పర్చేజింగ్ కమిటీలోనే ఇప్పటి మంత్రి, అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి కూడా సభ్యుడిగా ఉండటాన్ని భక్తులు సోషల్‌మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. నెయ్యి కొనుగోలు వివాదంపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణ కమిటీని నియమించిన నేపథ్యంలో, ఆమెను మళ్లీ కమిటీ సభ్యురాలిగా నియమించడం విపక్షాల విమర్శలకు అవకాశం కల్పించడమే అవుతుందని టీడీపీ సోషల్‌మీడియా సైనికులు వ్యాఖ్యానిస్తున్నారు.

LEAVE A RESPONSE