Suryaa.co.in

Editorial

సీఎం రేవంత్ సెక్యూరిటీ కళ్లు కప్పటం సాధ్యమా?

  • సెల్ఫ్ డ్రైవింగ్, ప్రైవేటుకారు ప్రయాణం అంత సులభమా?

  • సూపర్ ఇమేజ్ ఉన్న ఒక సీఎం ఆ సాహసం చేయగలరా?

  • ఇప్పటికీ ఉదయం 5 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళ్లిపోతారని కేటీఆర్ సంచలన ఆరోపణ

  • సెల్ఫ్ డ్రైవింగ్‌తో మైహోం బూజాకు వెళతారన్న కేటీఆర్

  • సీఎం సెక్యూరిటీ అందుకు అనుమతిస్తుందా?

  • నిఘా దళానికి సమాచారం తెలియకుండా ఉంటుందా?

  • సాగర్ సొసైటీలో ఎంత సేపు గడుపుతారో మాకు తెలియదా?

  • రేవంత్ ఎక్కడెక్కడ గోడలుదూకుతాడో తెలుసు

  • రేవంత్ దాటిన రేఖలు, తారలు, వాణిల గురించి మాట్లాడగలం

  • నేను నోరు విప్పితే ఇంట్లో అన్నం పెట్టరన్న కేటీఆర్

  • కేటీఆర్ ఆరోపణలు సత్యమా?సంచలనం కోసమేనా?

  • రేవంత్ ఫొటోలున్నాయన్న కేటీఆర్ వాటిని ఎందుకు విడుదలచేయలేదు?

  • కేటీఆర్ మీడియా చిట్‌చాట్ వ్యూహాత్మకమా?

  • రేవంత్ ఇమేజ్‌ను డామేజ్ చేయడమే కేటీఆర్ లక్ష్యమా?

  • రాజకీయ వర్గాల్లో వాడి వేడి చర్చ

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఉదయ 5 గంటలకు మైహోం బూజాకు ఒంటరిగా వెళతారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళుతుంటారు. ఆయన సాగర్ సొసైటీలో ఎంతసేపు గడుపుతారో తెలుసు. రేవంత్ దాటిన రేఖలు, తారలు, వాణిల గురించి మేమూ మాట్లాడగలం. రేవంత్ ఎక్కడెక్కడ గోడలుదూకుతాడో తెలుసు. నేను నోరు విప్పితే రేవంత్‌కు ఇంట్లో అన్నం పెట్టర’ంటూ.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో దుమారం సృష్టిస్తున్నాయి.

సహజంగా ఇప్పటివరకూ రాజకీయాల్లో ప్రత్యర్ధుల అవినీతి, కుంభ కోణాలపైనే ఆరోపణలు-ప్రత్యారోపణలు ఉండేవి. కానీ తెలంగాణ రాజకీయాలు ఆ స్ధాయి దాటి వ్యక్తిగత-నాలుగుగోడలకు పరిమతమయ్యే వ్యవహారాలను, బజారున చర్చించుకునే స్థితికి చేర్చింది. పదేళ్లపాటు కేటీఆర్‌కు సినిమా తారలతో ఉన్న సంబంధాలపై మొదలయిన ఆరోపణలు.. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి వరకూ చేరడం.. అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న కేటీఆర్.. ఇప్పుడు అదే రేవంత్‌పై సరిగ్గా అలాంటి ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

9 నెలల క్రితం వరకూ ఏపీ రాజకీయాల్లో బూతులు వినిపించేవి. రోజా, కొడాలి నాని, పేర్ని నాని, వంశీ అండ్ అదర్స్ టీడీపీ నేతలపై బూతులు లంకించుకునే వారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేకపోవడంతో, ఆ బూతులు-తిట్లు వినిపించకపోవడంతో జనం హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో.. సినిమా తారలతో ఉన్న సంబంధాలు రచ్చకెక్కి, వాటిని నేరుగా కాకపోయినా, పరోక్షంగా అయినా అందరికీ తెలిసేలా పరస్పరం ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇందులో అప్పుడు బాధితుడు కేటీఆర్ అయితే.. ఇప్పుడు బాధితుడు రేవంత్‌రెడ్డి! ఇది రాజకీయాల్లో ఆరోగ్యకరం కాదన్నది సీనియర్ల హితోక్తి!!

పదేళ్ల కేసీఆర్ జమానాలో అన్నీ తానై చక్రం తిప్పిన బీఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మీడియాతో జరిపిన చిట్‌చాట్ రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈసారి ఆయన తన రాజకీయ ప్రత్యర్ధి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుల అవినీతి, భూ కుంభకోణాలు, బిల్లుల కమిషన్లపై కాకుండా.. కేవలం రేవంత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన ఆరోపణలు సహజంగా చర్చనీయాంశంగా మారాయి.

అయితే ఆ ఆరోపణలు సత్యమా? వాటికి ఆధారాలున్నాయా? అవి నిజమైతే కేటీఆర్ వాటి ఆధారాలు ఎందుకు బయటపెట్టలేదు? తన దగ్గర ఫొటోలు కూడా ఉన్నాయన్న కేటీఆర్, తాను రేవంత్‌పై చేసిన ఆరోపణలు నిజమైతే.. నిత్యం ఎక్స్‌లో చురుకుగా ఉండే ఆయన, వాటిలో ఒక్క ఫొటో కూడా ఎందుకు పోస్టు చేయలేదు? అంటే ఇవన్నీ మహిళలలో రేవంత్‌కు ఉన్న ఇమేజీని, డామేజీ చేసేందుకు వ్యూహాత్మకంగా చేసిన ఆరోపణలా? అసలు అవి సాధ్యమేనా?

నిరంతరం భారీ సెక్యూరిటీతో ఉండే ఒక సీఎం.. అందునా బోలెడు ఇమేజ్ సంపాదించుకున్న రేవంత్, మీడియా-సోషల్‌మీడియా చురుకుగా ఉన్న ఈ కాలంలో అందరి కళ్లు ప్పి, సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని ఇష్టం వచ్చిన చోటకు వెళ్లేంత సాహసం చేయగలరా? అన్న చర్చకు తెరలేచింది.

పూర్వం రాజులు అధికారులకు పాలన వదిలేసి, విలాసాల్లో మునిగేవారు. భోగలాలసుడైన రాజుకు, రాజ్యంలోని వాస్తవ పరిస్థితులు తెలియకుండా ఉండేందుకు, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉండేది. ఆ కోటరీ రాజును భ్రమల్లో, మాయాప్రపంచంలో ఉంచేది. మీ పాలన అద్భుతం.. అపురూపం.. అనితర సాధ్యం.. అనన్య సామాన్యమని.. ఇప్పటి కొన్ని మీడియా సంస్థలు, కోటరీల మాదిరి భజన చేసేవి. కొన్నాళ్ల తర్వాత రాజుకు నిజాలు తెలిసినా, అప్పటికే జరగవలసిన నష్టం జరిగేది.

అదే తెలివైన రాజులు కోటరీ మాటలు నమ్మకుండా.. తన పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఎలా ఉన్నారని తెలుసుకునేందుకు రకరకాల మారువేషాలలో వెళ్లి, నిజాలు తెలుసుకుని, మళ్లీ రాజ్యానికి వచ్చి తగిన చర్యలు తీసుకునేవారు.
తమ పాలనపై విమర్శలు చేసేందుకు, కొంతమందిని జీతం ఇచ్చి మరీ నియమించుకునేవారు. వారు కూడా రాజ్యంలో జరుగుతున్న వాస్తవ దృశ్యాలు, ప్రజాభిప్రాయాలను ఆవిష్కరించేవారు. అంతేగానీ.. ఇప్పటిమాదిరిగా వ్యతిరేకంగ రాసే వాళ్లను పది అడుగులు పాతరేస్తాం.. బట్టలూడదీసి ఉరికించి కొడతాం అనేవాళ్లు కాదు. అది వేరే వ్యవహారం!

అప్పట్లో ఇప్పటిమాదిరిగా వాట్సాప్, ఎక్స్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, సిగ్నల్ వంటి సామాజిక మాధ్యమాలు లేవు కాబట్టి, రాజు ఎవరో అప్పటి ప్రజలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. కాబట్టి అన్ని నిజాలు చెప్పేవారు. కానీ ఇప్పుడు పాలకుల మెహర్బానీ, మెరమెచ్చులు, ప్రకటనలు, ప్రలోభాలకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సాగిలబడుతున్నప్పటికీ.. సోషల్‌మీడియా మాత్రం ఒళ్లంతా కళ్లు చేసుకుని, మేడే కూడా సెలవు తీసుకోకుండా.. 24 గంటలూ ఉచిత సమాచార శ్రమదానం చేస్తోంది.

ఎక్కడో మారుమూల ఏజెన్సీలో గ్రామంపై పులిదాడి వీడియోను.. ఒకే ఒక్క నిమిషంలో సోషల్‌మీడియా ద్వారా, ప్రపంచానికి తెలిసిపోతున్న కాలమిది! అలాంటిది ఒక సీఎం..అందునా కేవలం ఆయనను చూసే ఒక జాతీయ పార్టీని గెలిపించిన ప్రజలకు.. ఆయన ఉదయం ఐదు గంటలకు, సెక్యూరిటీ కళ్లుగప్పి సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని వెళితే, అంతపెద్ద మహానగరంలో ఎవరి కంటికీ కనపడకుండా ఉంటుందా? ఆ అసాధారణ దృశ్యం, ఒక్క సెల్‌ఫోన్ కంటికి చిక్కకుండా పోతుందా? లేదు కదా? మరి బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి కేటీఆర్.. తెలంగాణ సీఎం రేవంత్‌పై, అంత పెద్ద ఆరోపణ ఎలా చేయగలిగారన్నదే, ఇప్పుడు అనుమానంతో కూడిన ఆశ్చర్యం!

సీఎం రేవంత్ ఉదయం 5 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుని మైహోం బూజాకు వెళతారన్న, కేటీఆర్ ఆరోపణ లో సత్యమెంతో చూద్దాం. సీఎం రేవంత్ ఉదయం ఐదుగంటలకు అక్కడకు వెళ్లి ఏం పనిచేస్తారు? సాగర్ సొసైటీలో అంత సేపు ఏం చేస్తారు? ప్రైవేట్ కారులో ఎక్కడికి వెళతారు? అసలు ఎవరీ రేఖలు.. తారలు.. వాణిలు? అన్న కేటీఆర్ ఆరోపణలు.. రంధ్రాన్వేషణ పక్కకు పెడితే.. అసలు భారీ సెక్యూరిటీ మధ్య ఉండే సీఎం, అంత స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంటుందా అన్నదే ప్రశ్న.

నిజానికి ముఖ్యమంత్రులు, హోంమంత్రులకు మిగిలిన వారితో పోలిస్తే ఎక్కువ సెక్యూరిటీ ఉంటుంది. ఇక తీవ్ర వాదుల నుంచి ప్రాణభయం ఉన్న వీఐపీలు, సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ ఉండే వీఐపీలు సాధారణ నాయకుల మాదిరిగా, సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్లడం దుర్లభం.

సహజంగా ఒక సాధారణ మంత్రి, ఎమ్మెల్యే సెక్యూరిటీని విడిచిపెట్టి వెళ్లిపోతే, ఆ సమాచారాన్ని వారి గన్‌మెన్లు క్షణాల్లో హెడ్‌క్వార్టర్‌కు అందిస్తారు. దానితో ఇంటలిజన్స్ ఐజి, ఏడీజీ అప్రమత్తం అవుతారు. పైగా.. ఈ సమాచారం వివిధ వర్గాల ద్వారా కొద్ది గంటల తర్వాత, మీడియాకు చేరుతుంది. అసలు తెలంగాణ సీఎం సీఎస్‌ఓగా ఉన్న ఎస్పీ, సెక్యూరిటీ లేకుండా సీఎంను బయటకు అనుమతించరు. సీఎంఎస్‌జీ అధీనంలో ఉండే సీఎం రేవంత్ ఇంటి చుట్టూ, షిప్టుల వారీగా సెక్యూరిటీ ఉంటుంది. వారికి సీఎస్‌ఓలు నేతృత్వం వహిస్తారు. ఇలాంటి కట్టుదిట్టమైన పరిస్థితిలో.. రేవంత్‌రెడ్డి మునుపటి మాదిరిగా, స్వేచ్ఛా విహంగంలా బయట తిరగడ ం దుర్లభం అని స్పష్టమవుతోంది.

అయితే రేవంత్‌రెడ్డి వ్యవహారాలకు సంబంధించిన ఫొటోలు, తనదగ్గర ఉన్నాయని బాంబు పేల్చిన కేటీఆర్..అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కీలక సమయంలో, వాటిని మీడియాకు ఎందుకు విడుద ల చేయలేదు? పోనీ మీడియాకు విడుదల చేయకపోయినప్పటికీ.. బీఆర్‌ఎస్ అనుబంధ మీడియాలో ఎందుకు ప్రచురించలేదన్న ప్రశ్నలు, సహజంగానే తెరపైకి వస్తున్నాయి. దానికి ముహుర్తాలు, వారాలు, వర్జాలు చూడటం ఎందుకు?

LEAVE A RESPONSE