Suryaa.co.in

Editorial

రాజొస్తారొస్తారా? 

-ప్రధాని మోడీ సభకు ఎంపీ వెళతారా?
-మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకుంటారా?
-రాజును రానీయకుండా ఓ కేంద్ర మంత్రి ఒత్తిళ్లు?
-వేదికపై ఎంపీ రఘురామ పేరు
-“ఎంపీ రఘురామ కృష్ణంరాజు భీమవరం టూర్ పై సస్పెన్స్

మార్తి సుబ్రమణ్యం

వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై తిరుగుబాటు బావుటా ఎగరవేసి.. సిఐడి పోలీసులతో దెబ్బలు తిన్న నరసాపురం వైసిపి రెబల్ ఎంపీ రఘురాం కృష్ణంరాజు భీమవరం టూర్ పై సస్పెన్స్ కొనసాగుతోంది.

సోమవారం భీమవరంలో జరగనున్న అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, ప్రధాని మోడీ రానున్న నేపథ్యంలో.. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ కార్యక్రమానికి హాజరు కావలసి ఉంది. అదే సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరుకానునందున, ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆయనతో కలిసి ఉన్న వేదికను పంచుకుంటారా లేదా ? ఉప్పు నిప్పుగా ఉన్న జగన్ -రాజు ఆ వేదికపై పలకరించుకుంటారా లేదా? అన్న ప్రశ్నలు ఉత్కంఠ గా మారాయి.

ప్రధాని మోడీ హాజరుకానున్న అల్లూరి విగ్రహావిష్కరణకు తాను హాజరుకాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా అరెస్టు చేసే కుట్రలు చేస్తోందంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు, గత వారం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ప్రధానమంత్రి కార్యాలయం తోపాటు, కేంద్ర హోమ్ , పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శులకు లేఖలు కూడా రాశారు. అక్కడ నుండి తగిన స్పందన లేకపోవడంతో, చివరకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురాం కృష్ణంరాజు ను అరెస్టు చేయవద్దని ..అవసరమైతే కేసులు పెట్టుకోవచ్చు తప్ప, అప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది . ఈ పరిణామాలతో ఎంపీ రాజు భీమవరం టూర్ కు , రూట్ క్లియర్ అయింది.

కోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే భీమవరంలోని రఘురామకృష్ణంరాజు ఇంటి ముందు రోడ్డు తవ్వడంతో, వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం కనిపించింది. ఎంపీ ని వేధించడానికే రోడ్డు తవ్వేశారన్న ప్రచారం జరిగింది. దానితో స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. రోడ్డు ఫోటోలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని ఫిర్యాదు చేశారు. దానితో ఆగమేఘాలపై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం, వెంటనే దానిని సీఎంవో కు పంపటం.. ఆ తరువాత రోడ్డును క్లియర్ చేయడం ..చక చక జరిగిపోయాయి. దీన్నిబట్టి కోర్టు ఆదేశించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలు ఆపబో దన్న విషయం స్పష్టమైందని, ఎంపీ వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు రఘురామకు మద్దతుగా భీమవరం, నరసాపురం నుంచి దళితులు భారీ సంఖ్యలో భీమవరానికి రానున్నారు. వీరికి స్థానిక క్షత్రియ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని సభకు రాకుండా ఎంపీ రాజుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని అసంతృప్తితో .. స్థానిక క్షత్రియ నాయకులు అల్లూరి విగ్రహాయ్ కార్యక్రమం ఏర్పాట్లకు దూరంగా ఉన్నారు. దానితో స్థానిక బిజెపి, వైసిపి నేతలు రంగంలోకి దిగి.. అమలాపురం, రాజమండ్రి ఇతర ప్రాంతాలకు చెందిన రాజులను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజును రావద్దంటున్న ఓ కేంద్ర మంత్రి?

కాగా ప్రధాని పాల్గొనే కార్యక్రమానికి స్థానిక ఎంపీ రఘురామకృష్ణంరాజును రానివ్వకుండా, ఓ కేంద్ర మంత్రి శతవిధాల ప్రయత్నిస్తున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. రాజు సభకు వస్తే.. ప్రధాని కార్యక్రమానికి అంతరాయం కలుగుతుందని, ఫలితంగా భీమవరానికి చెడ్డ పేరు వస్తుందంటూ సదరు కేంద్ర మంత్రి, స్థానిక క్షత్రియ సంఘం నేతల కు నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఆయన ఇప్పటికే అనేకసార్లు క్షత్రియ నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో సదరు కేంద్రమంత్రి పై, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోం దన్న వ్యాఖ్యలు క్షత్రియ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. ఎంపీ రాజును సభకు హాజరు కాకుండా చూసేందుకు, శ్రమ పడుతున్న సదరు కేంద్రమంత్రి.. సభకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ లను, ఏ పత్రికలకు ఇవ్వాలని కూడా ఆయనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతకూ రాజు వస్తారా? రారా?

హైకోర్టు ఆదేశాలతో ఎంపీ రాజు భీమవరం పర్యటనకు న్యాయపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఇక ఆయన హాజరు పైనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు తనను రానీయకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించిన ఎంపీ రాజుకు, ఇప్పుడు భీమవరం వెళ్లడం అనివార్యమైంది. ఒకరకంగా ఇది ఆయనకు ప్రతిష్టాత్మకంగా మారింది

పైగా వేదిక మీద ప్రోటోకాల్ ప్రకారం.. ప్రధాని మోదీ, సీఎం జగన్మోహన్ రెడ్డి ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ,రాష్ట్ర మంత్రి రోజాతో పాటు ఎంపీ రాజు పేరు కూడా ఉంది. దీనితో ఇప్పటివరకు వేదిక పై స్థానానికి సంబంధించి ఉన్న సస్పెన్స్ తొలగిపోయింది.

అయితే ఎంపీ రాజును అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ఆయనను మార్గమధ్యంలోనే పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చూపించకుండా , ఏదైనా పోలీస్ స్టేషన్లకు తరలించి, సభ ముగిసే వరకు ఆయనను అక్కడే ఉంచే ప్రమాదం లేకపోలేదని ఎంపీ వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలు వచ్చిన మరుసటి రోజునే, భీమవరంలోని ఎంపీ ఇంటి ముందు రోడ్డును తవ్వడాన్ని అందుకు ఉదాహరణ గా చూపిస్తున్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు ఇదే నిదర్శనమని , రాజు వర్గీయులు వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే నిజంగా ఎంపీ రాజును అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తే .. కేంద్ర – రాష్ట్రప్రభుత్వాలు అప్రతిష్ట పాలు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు, వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరానికి వెళతారా? ఒకవేళ వెళితే ఆయనను వేదిక వరకు వెళ్ళనిస్తారా ? లేక మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకుంటారా ?అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి.

తరలింపు భారం వైసీపీ దే!

కాగా ప్రధాని సభను విజయవంతం చేసే బాధ్యత వైసిపి తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తీసుకు వస్తున్న బస్సులలో, జనాలను తరలించే బాధ్యత కూడా స్థానిక వైసీపీ నాయకులే తీసుకున్నారు. బిజెపికి స్థానికంగా పెద్దగా పలుకుబడి లేకపోవడంతో, ఆ బాధ్యతను వైసిపి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి మోడీ సభ ఏర్పాట్లకు సంబంధించి ,వైసిపి బిజెపి నాయకులు సంయుక్త ఏర్పాట్లు చేస్తున్నారు.

LEAVE A RESPONSE