(గోపరాజు నాగేశ్వరరావు)
నియంతల పాలనమైనా, ప్రజాప్రతిఘటన లేకుండా ఆధిపత్యం ఏకపక్షంగా సాగినంతకాలం సామాజిక వాతావరణం ప్రశాంతంగానే కనుపిస్తుంది . కానీ, ఆ ప్రశాంతత కడుపులో కల్లోలం దాచుకున్న కడలి గర్భంలా ఉంటుంది!
నియంతృత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజాప్రతిఘటన మొదలైనప్పుడు, అంతవరకు కల్లోలాన్ని కడుపులో దాచుకొని పైకి ప్రశాంతంగా ఉన్నట్లు కనుపించిన సముద్రగర్భంలో ప్రకంపనలుపుట్టి ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలతో ఉప్పెనయై విజృంభించి ఊళ్లకు ఊళ్లను ముంచెత్తినట్లు పూర్వపు నరసరావుపేట రాజకీయ వాతావరణం టిడిపి ఆవిర్భావంతో, కోడెల శివప్రసాదరావు రాజకీయ రంగప్రవేశంతో ప్రశాంతత భగ్నమై హింసాత్మక సంఘటనలకు నిలయమై, ఉప్పెనగా మారింది.
హత్యలు జరిగేవి. బాంబులు ప్రేలేవి. గృహదహనాలు దొమ్మీలు దాడులు నిత్యకృత్యమై ఎందరో అమాయకులు ఇబ్బందులు పడ్డారు. అల్లాంటి అవాంఛనీయ వాతావరణం నెలకొనడానికి కారణం టిడిపి నాయకుడు కోడెల శివప్రసాదరావు అందామా? అంతవరకు నిర్నిరోధంగా కొనసాగిన కాంగ్రేసు ఆధిపత్యాన్ని ప్రశ్నించిన కారణంగా టిడిపి పై అక్కసుతో కాంగ్రేసువారు నెలకొల్పిన హింసాత్మక వాతావరణం అందామా?
1947 నాటి తొలి స్వాతంత్ర్య దినం నుండి టిడిపి ఆవిర్భావం దాకా అధికారంలో వున్న కాంగ్రేసు, దాని తరఫున మకుటం (పదవి) వున్న మహారాజుల్లా అధికారం చలాయించిన కాసు వారు, ప్రతిఘటన ఎదురు కానంతవరకు గాంధీగారి శాంతిమార్గంలో పాలన జరిపారన్నది నిజం.
ఎప్పుడైతే టిడిపి ఆవిర్భవించి,కాంగ్రేసు అధికారాన్ని నిర్వీర్యం చేయడం అనివార్యమని తెలిసిందో,ఆ క్షణంలోనే హింస మొదలైంది. దీర్ఘకాలం వేళ్లూనుకుపోయి స్ధిరంగా వున్న ఒక రాజకీయ వ్యవస్థ తన అధికారం కోల్పోయే సమయంలో చట్టవ్యతిరేక హింసాత్మక చర్యలకు పాల్పడడం సహజం. హిట్లర్ నియంత అంతిమఘట్టం అదే కదా !
అప్పుడు , తాము క్షేమంగా వుండి తమ రాజకీయ కార్యకలాపాలు దిగ్విజయంగా కొనసాగించేందుకు హింసాత్మక చర్యలుచేపట్టటం ఎంత అనివార్యమో, ప్రతిహింసతో పాలకపార్టీని నిలువరించడం ప్రత్యర్ధి రాజకీయ వ్యవస్ధకు అంతే అనివార్యమైన చర్య! ఆ చర్య చట్టబధ్ధమా? కాదా? అన్నది వేరే విషయం.
మనుగడ కోసం జరిగే పోరాటంలో తమ చర్యల మంచిచెడులను ఆలోచించే తీరిక ,అవసరం,ఎవ్వరికీ ఉండదు. అంతవరకు హింస,దౌర్జన్యంతో పెత్తనం కాపాడుకున్న వారు తీరా ప్రతిఘటన ఎదురుకాగానే శాంతివచనాలు వల్లించడం సర్వసాధారణం.
టిడిపిలో కోడెల శకం ముగిసిపోయిన తరువాత కాంగ్రేసులో కూడా ఇంచుమించుగా కాసుశకం ముగిసిపోయింది. చివరివెలుగుగా కాసు మహేశ్వరరెడ్డి కాంగ్రేసును కాదని వైసిపిలో చేరి గురజాల నుండి ఎంఎల్లే అయినా,అతని విజయం వల్ల కాసు కుటుంబ రాజకీయప్రతిష్ట ఇనుమడించింది లేదు.
వైసిపికి చెందిన ‘సాక్షి ‘ టివీలో ‘ నరసరావుపేటలో చెల్లని కాసు ‘ అని వార్తాకధనాలు ప్రసారంచేసిన వైసిపి పంచనే చేరడంవల్ల కాస్తో కూస్తో మిగిలిన కాసువారి ప్రతిష్ట మరింత మసకబారిపోయింది.
అంతకుముందు నరసరావుపేట నియోజకవర్గంలో కాంగ్రేసు ఓటమి ఖాయమని,కాసువారు కాకుండా అలెగ్జాండర్ అనే దళిత అబ్యర్ధిని నిలబెట్టి ఓటమిపాలు చేయడంవల్ల, ఆశించిన విధంగా నరసరావుపేట అసెంబ్లీ సీటు త్యాగంచేశారన్న మంచిపేరు రాకపోగా, ఓడిపోయే తరుణంలో దళితులు గుర్తొచ్చారా ? అనే విమర్శలకు కాసువారు లోనుకావలసి వచ్చింది.
ఇక, నరసరావుపేట నియోజకవర్గంలో కూడా కాంగ్రేసుకు ప్రజల మద్దతులేదని గ్రహించిన కాసువారు, క్రమంగా నరసరావుపేట వరకు వైసిపికి,దాని మాత్రుసంస్ధ యైన కాంగ్రేసుకూ దూరమై, ‘ ఇంట్లోవాడే పెట్టాలి కంట్లో పుల్ల ‘ సూత్రాన్ని పాటించి, గత అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి చదలవాడ అరవిందబాబు విజయంకోసం తీవ్రంగా కృషిచేశారు. అందువల్ల,కూటమిలో కాసువారికి గొప్ప పేరు రాకపోగా, స్వయంగా కాసువారు ఎన్నికలలో గెలువలేరుగాని, వారి కారణంగా వచ్చే ఓట్లు ఇతరపార్టీ అబ్యర్ధుల గెలుపు ఓటములను ప్రభావితం చేయగలవన్న నమ్మకం కలిగించారు. సరిగ్గా ఇలాంటి స్ధితిలోనే ఉన్న కమ్యూనిస్టులను ‘తోకపార్టీలు ‘ అన్నట్లు, ఆ ఖనత కేవలం కమ్యూనిస్టులకు మాత్రమేనా? అంటూ ఆగ్రహంతో పోటిపడిన చందంగా మారింది.
రాజకీయ ఎత్తుగడలలో ఘోర వైఫల్యం చెందటం, వెంటతిరిగే భజన బృందంలో మిడిమిడిజ్జానులు మాత్రమేమిగలటం, కాసువారి కీర్తికి పట్టిన గ్రహణానికి కారణమనడంలో సందేహం లేదు.
బహిరంగంగా టిడిపి పంచన చేరకపోయినా ,కూటమి అభ్యర్ధి విజయంతో, నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తాము గెలిపించింది టిడిపి అభ్యర్థి నైనా, ఆధిపత్యం కాసువారిదే కావటం,- ఆర్ధికవనరులు దండిగా సమకూర్చుకోకుండా రాజకీయాలు నడపటం అసాధ్యమని గ్రహించి మేల్కోవడం, కొంత ఉపశమనం కలిగించే అంశం. !?