Suryaa.co.in

Andhra Pradesh

పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా..లేక జగన్ ఇంట్లో పాలేరా?

• సంజయ్..సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా..లేక జగన్ రెడ్డి జేబులోని డబ్బు తీసుకుంటున్నారా?
• 16 నెలలు జైల్లో ఉన్న ఆర్థిక నేరస్తుడు జడ్జిలపై ఫిర్యాదు చేసేస్థాయికి రావడం వ్యవస్థల దుర్వినియోగానికి పరాకాష్ట
• గౌరవప్రదమైన న్యాయవ్యవస్థ… న్యాయమూర్తులపై ఇంత దుర్మార్గంగా మాట్లాడటం దేశంలో జగన్ రెడ్డి పాలనలోనే చూస్తున్నాం
• చంద్రబాబు అవినీతి చేస్తే… తెలుగుదేశానికి ఇతర ఖాతాల నుంచి డబ్బులొస్తే 4 ఏళ్ల 8 నెలలుగా కోర్టుల్లో ఎందుకు నిరూపించలేకపోయారు?
• వేలకోట్ల అవినీతి జరిగిందని బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడటం తప్ప, వెయ్యిపైసల అవినీతిని అయినా న్యాయస్థానాల్లో ఆధారాలతో నిరూపించారా?
• న్యాయమూర్తుల ముందు బిక్కముఖాలు వేసి, సిగ్గులేకుండా మీడియా.. సాక్షి పత్రిక..ఛానెళ్ల ముందు ప్రతాపం చూపుతున్నారా?
•ప్రతిపక్షాలను అణచివేయడానికి.. ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేస్తూ, పొన్నవోలు లాంటి అసమర్థుల్ని.. ఢిల్లీలో కొందరు న్యాయవాదుల్ని పెంచి పోషిస్తున్నాడు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

సీఐడీ చీఫ్ సంజయ్.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజలసొమ్మ జీతంగా తీసుకుంటూ, జగన్ రెడ్డికి ఊడిగంచేస్తూ వ్యవస్థల్ని, పాలనా ప్రమాణాల్ని దిగజారుస్తున్నారని, చంద్రబాబుపై వైసీపీప్రభుత్వం మోపిన తప్పుడుకేసులకు సంబంధించి న్యాయస్థానాల్లో ఆధారాలు చూపించలేక.. బిక్కముఖం వేసిన ప్రబుద్ధులు సిగ్గులేకుండా మీడియాతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్ రెడ్డి ఆదేశాలతో ప్రతిపక్షనేతలు… ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వం తరుపున న్యాయస్థానాల్లో వాదించే సుధాకర్ రెడ్డి లాంటి న్యాయవాదులు బరితెగించి మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుంటున్నాం.. బాధ్యతతో వ్యవహరించాలనే కనీసం ఇంగితజ్ఞానం విస్మరించి, న్యాయస్థానాల్ని … న్యాయమూర్తుల్ని తప్పుపడుతున్నారు. సంజయ్… పొన్నవోలు లాంటి వారు పరిధిదాటి మాట్లాడటం అనేది జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే చూస్తున్నాం.

తాడేపల్లి ఆదేశాలు..కట్టుకథల తో సీఐడీ చీఫ్ సంజయ్ ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు పెడితే, ఆ కేసుల వాదనకోసం పొన్నవోలు తన నిర్దేశకత్వంలో ఢిల్లీ నుంచి వేలకోట్లు ఇచ్చిమరీ లాయర్లను పిలిపించి న్యాయస్థానాల్లో అడ్డంగా వాదనలు వినిపించడం చేస్తున్నాడు. సంజయ్ …సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటున్నారా… జగన్ రెడ్డి జేబులోని డబ్బు తీసుకుంటున్నారా?

చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిందన్న కడుపుమంటతోనే పొన్నవోలు ఢిల్లీలో మీడియాసాక్షిగా న్యాయవ్యవస్థపై విషం కక్కాడు
చంద్రబాబుపై తొలుత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో అవినీతి అని సీఐడీ తప్పుడు కేసు పెట్టి అన్యాయంగా జైలుకు పంపంది. ఆ కేసుకు సంబంధించిన వాదనల బాధ్యతను పొన్నవోలు తన భుజాలపై వేసుకున్నాడు. మొత్తంగా ఈ ప్రభుత్వం రూ.3వేలకోట్ల అవినీతి జరిగిందని అసత్యప్రచారంచేసింది. చివరకు రోజురోజుకీ దిగజారి రూ.27కోట్ల సొమ్ము తెలుగుదేశం ఖాతాలకు వచ్చిందని పొన్నవోలు న్యాయస్థానాల్లో దిగజారి మాట్లాడాడు. టీడీపీకి వచ్చే ప్రతి పైసాకు ఆపార్టీ ఎప్పటికప్పుడు ఇన్ కంటాక్స్.. ఎలక్షన్ కమిషన్ కు లెక్కలు చెబుతోంది.

దాని సంగతి వదిలేస్తే చంద్రబాబుపై వైసీపీప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులో ఆయన తప్పుచేశాడని నిరూపించే ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని, హైకోర్టు ఇటీవలే ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దాంతో కడుపు మంట ఎక్కువైన పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో మీడియా సాక్షిగా బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తిసహా..ఇతర న్యాయమూర్తుల్ని…రాష్ట్ర హైకోర్టును ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడు. సుధాకర్ రెడ్డి ఏఏజీగా పనిచేస్తున్నాడా..లేక జగన్ రెడ్డి పాలేరుగా పనిచేస్తున్నాడా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ స్థానంలో ఉండి న్యాయస్థానాల్ని గౌరవించకుండా.. న్యాయమూర్తుల్ని గౌరవించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా?

జగన్ రెడ్డిపై సుధాకర్ రెడ్డికి అంత వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే తాడేపల్లి ప్యాలెస్లో బాత్రూమ్ లు కడగొచ్చు. అంతేగానీ న్యాయస్థానాల్ని దూషిస్తూ నోరుపారేసుకుంటే అందుకు తగిన మూ ల్యం చెల్లించుకుంటాడు. చంద్రబాబు అవినీతిచేశాడు.. తెలుగుదేశానికి ఇతర మార్గాల్లో నిధులు వచ్చాయని చెప్పిన జగన్ రెడ్డి.. సంజయ్.. సుధాకర్ రెడ్డి ఒక్క ఆధారం కూడా ఎందుకు కోర్టులో చూపలేకపోయారు? 4 ఏళ్ల 8నెలల్లో ఒక్క సాక్ష్యం కూడా కనిపెట్టలేని అసమర్థులు… చేతగాని దద్దమ్మలు వీళ్లు.

చంద్రబాబు తప్పుచేశాడనే దుష్ప్రచారం తప్ప.. నాలుగున్నరేళ్లైనా జగన్ రెడ్డి ఒక్క ఆధారం కూడా ప్రజలు…న్యాయస్థానాల ముందు ఉంచలేకపోయాడు
జగన్ రెడ్డి భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డాడని రూ.43వేలకోట్లు కొట్టేశాడని సీబీఐ, ఈడీలు నిగ్గుతేల్చాయి… అదీ ప్రివెంటిఫ్ ఆఫ్ కరప్షన్ కేసు అంటే. జగన్ రెడ్డి..అతని ప్రభుత్వం చంద్రబాబుపై పెట్టిన స్కిల్ డెవలప్ మెంట్ కేసు తప్పుడు కేసు. అదే కాదు.. ఇప్పటివరకు పెట్టిన ఇసుక కేసు.. మద్యం కేసు…ఫైబర్ నెట్ కేసు.. ఇతరకేసులన్నీ టుంబ్రీ కేసులు. 2014-19 మధ్య చంద్రబాబునాయుడు నీతిగా..నిజాయితీగా సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించాడు. అందుకే అధికారంలోకి వచ్చి జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లు అయినా ఎక్కడా చిన్న తప్పు కూడా ఎత్తిచూపలేకపోయాడు. అసలు తప్పుజరిగితే కదా.. కనిపెట్టడానికి?

న్యాయవ్యవస్థని కూడా బ్లాక్ మెయిల్ చేసి తనగుప్పెట్లో పెట్టుకోవాలన్నదే జగన్ కుతంత్రం
ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన స్థాయి మరిచి రాష్ట్రహైకోర్టుని తప్పు పట్టాడు. చంద్రబాబుకు న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరుచేస్తూ, పొన్న వోలుకు.. జగన్ రెడ్డికి ఎందుకంత కడుపుమంట? తప్పుడు కేసులు పెట్టినట్టే.. న్యాయస్థానాలిచ్చే తీర్పులను కూడా సుధాకర్ రెడ్డి…జగన్ రెడ్డే నిర్ణయిస్తారా? వ్యవస్థల్ని మేనేజ్ చేసే జగన్ రెడ్డి అధికారమదంతో న్యాయమూర్తుల్ని… న్యాయ స్థానాల్ని తప్పపడుతున్నాడు.

గతంలో అధికారమదంతో జగన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై హైకోర్టులోని 5గురు జడ్జీలపై ఫిర్యాదు చేశాడు. 16నెలలు చంచల్ గూడ జైల్లో ఉన్న వ్యక్తి.. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చాడంటే వ్యవస్థలు ఏస్థాయిలో దిగజారాయో అందరూ అర్థం చేసుకోవాలి. భారతదేశ స్వాతంత్ర్య చరిత్రలో ఏరోజూ కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇంతగా దిగజారి.. హద్దులు దాటి ప్రవర్తించలేదు. అన్నివ్యవస్థల్లానే న్యాయవ్యవ స్థను కూడా బ్లాక్ మెయిల్ చేసి తనగుప్పెట్లో పెట్టుకోవాలన్నదే జగన్ కుతంత్రం.

చంద్రబాబు అవినీతి చేసినట్టు.. తెలుగుదేశం ఖాతాల్లోకి ఇతర మార్గాల్లో నిధులు వచ్చినట్టు పొన్నవోలు న్యాయస్థానాల్లో ఎందుకు నిరూపించలేకపోయాడు?
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుచేస్తూ రాష్ట్రహైకోర్ట్ ఇచ్చిన తీర్పుని ఏఏజీ పొన్నవోలు ఏ విధంగా తప్పుపడతాడు? ఢిల్లీలో మీడియాతో మాట్లాడు తూ ఏ హోదాలో హైకోర్టు న్యాయమూర్తిని కార్నర్ చేసి మాట్లాడతాడు? తెలుగు దేశం పార్టీకి రహస్యఖాతాల నుంచి కోట్లరూపాయలు వస్తే.. చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా అవినీతి చేసుంటే వాటికి సంబంధించిన ఆధారాలను న్యాయస్థానాల ముందు ఎందుకు ఉంచలేదో సుధాకర్ రెడ్డి చెప్పాలి.

వ్యక్తుల నుంచి.. డిజైన్ టెక్ సంస్థ నుంచి.. ఇతరత్రా మార్గాల్లో టీడీపీ ఖాతాల్లోకి డబ్బులు వస్తే .. వచ్చినట్టు నిరూపించే ఆధారాలను సుధాకర్ రెడ్డి రాష్ట్ర హైకోర్టు ముందు ఉంచకుండా, మీడియాతో నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడాడో.. చంద్రబాబు దోషి అని ఎలా చెప్పాడో సమాధానం చెప్పాలి. ఇసుకపాలసీలో చంద్ర బాబు తప్పుచేసుంటే.. మద్యం అమ్మకాల్లో అవినీతికి పాల్పడితే.. ఫైబర్ నెట్.. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడి ఉంటే పొన్నవోలు ఒక్క సాక్ష్యం కూడా ఎందుకు న్యాయస్థానంలో చూపలేకపో యాడు? నిందలేస్తూ తప్పించుకునే క్రమంలో అబద్ధాలను నిజాలని చెప్పి నమ్మించడానికి పొన్నవోలుకు.. జగన్ రెడ్డికి…సజ్జలకు.. సంజయ్ కు సిగ్గుశరం ఉన్నాయా?

తెలుగుదేశం ఖాతాల్లోకి నిధులు వచ్చాయని నోటికొచ్చినట్టు వాగకుండా పొన్నవోలు మీడియాకు ఎందుకు ఆధారాలు చూపలేదని ప్రశ్నిస్తున్నాం. కేవలం తన రాజకీయ కక్ష సాధింపులకోసమే జగన్ రెడ్డి తప్పుడు కేసులతో ప్రతిపక్షాలను అణచివేయ డానికి.. ప్రజలసొమ్ముని దుర్వినియోగం చేస్తూ, పొన్నవోలు లాంటి అసమర్థుల్ని.. ఢిల్లీలో కొందరు న్యాయవాదుల్ని పెంచి పోషిస్తున్నాడు.” అని బొండా ఉమా స్పష్టంచేశారు.

LEAVE A RESPONSE