జాతీయ పార్టీ బీజేపీని ‘బావ’ సారూప్య పార్టీగా మార్చిన చిన్నమ్మ
పురందేశ్వరి బీజేపీలో ఉన్నారా? టీడీపీలో ఉన్నారా?
ఎంపీ విజయసాయిరెడ్డి
తన మరిది చంద్రబాబు నాయుడు నేరం చేసి అడ్డంగా దిరికిపోయినా అతనికి చట్టం వర్తింపజేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు. నేరం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు. 13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినప్పటికీ ఆయనకు చట్టం వర్తింపజేయవద్దంటూ పోరాటం చేయడం ఎంతవరకు సమంజసమని పురందేశ్వరికి ప్రశ్నించారు.
ఫేక్ అగ్రిమెంట్ తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఈడీ కూడా నిర్ధారించి అరెస్టులు చేసిందని, మరోవైపు ఆ అగ్రిమెంట్ ఫేక్ అని సీమెన్స్ కంపెనీ కూడా ధృవీకరించిందని, ఆ అగ్రిమెంట్ తో తమకు ఎలాంటి సంబంధమూ లేదని అలాగే ఆ డబ్బు కూడా తమకు అందలేదని కంపెనీ 164 స్టేట్ మెంట్ లో తేల్చిచెప్పిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
స్కిల్ స్కాం ద్వారా దోచుకున్న డబ్బులు చంద్రబాబు షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో స్వయంగా బాబు పీఏ వెల్లడించిన విషయాన్ని ఐటీ శాఖ నిర్ధారించిందని ఈ విషయాన్ని పురందేశ్వరి తెలుసుకోవాలని అన్నారు. ఒక చిన్న కేసులో ఎకంగా రూ.119 కోట్లు ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తరువాత షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చిందని పురందేశ్వరి గుర్తించాలని అన్నారు.
జాతీయ పార్టీ బీజేపీని ‘బావ’ (చంద్రబాబు) సారూప్య పార్టీ గా మార్చిన ఘనత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికే దక్కుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని అంశాలనూ పరిగణలోకి తీసుకున్న తరువాతే న్యాయస్థానం చంద్రబాబు అరెస్టును సమర్ధించి, రిమాండ్ విధించిందని విజయసాయి రెడ్డి తెలిపారు.
రిమాండ్ సరికాదన్న వాదనలు హైకోర్టు, సుప్రీం కోర్టులు కూడా తిరస్కరించాయని పురందేశ్వరి తెలుసుకోవాలని అన్నారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్బకేట్లు, సిద్దార్ద్ లూత్రా, హరీష్ సాల్వే బాబు కోసం చేసిన వాదనల్ని న్యాయస్ధానాలు తిరస్కరించడంతో మరిది కోసం నేరుగా పురందేశ్వరి రంగంలోకి దిగారని అన్నారు.
ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అని అబద్ధాలు చెబుతూ లోకేష్ ని వెంటపెట్టుకుని బాబు తరుపున మద్యవర్తిత్వం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడం చూస్తే ఆమెకు బంధుప్రీతి కన్నా వేరేదీ ముఖ్యం కాదని స్పష్టమవుతోందని అన్నారు.
పురందేశ్వరీ బీజేపీలో ఉన్నారా లేక టీడీపీలో ఉన్నారా అని ప్రజలు సందిగ్ధంలో ఉన్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్నానని ఇప్పుడు బీజేపీలో ఉన్నానని చెబుతున్నా ఆమె టాప్ ప్రయారిటీ మాత్రం అవినీతి మరిది చంద్రబాబుకు శిక్ష పడకుండా కాపాడుకోవడమేనని పురందేశ్వరి నిరూపిస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు.