– తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలి
– ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీని నిలదీసిన కేటీఆర్
– తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీ” గురించి మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన కెటిఅర్
– ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం
– ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం
హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ అవలంబిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ స్థాయిలో “ఓటు చోరీ” గురించి నీతులు చెబుతున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న “ఎమ్మెల్యేల చోరీ” గురించి మాట్లాడకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలని కెటిఆర్ అన్నారు. “ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీకి సిగ్గుందా అని సూటిగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ టికెట్లపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంత బహిరంగంగా, సిగ్గు లేకుండా జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యాన్ని చూసి రాహుల్ గాంధీ సిగ్గుపడాలని ఆయన విమర్శించారు.
పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను రాహుల్ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలు స్వయంగా కలిసి, వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. “ఇవ్వాళ వీళ్ళను మీరు గుర్తుపట్టగలరా?” అంటూ ఆ ఫోటోలను చూపిస్తూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు “మేము కాంగ్రెస్లో చేరలేదు” అని చెప్పడాన్ని కేటీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. “అది కాంగ్రెస్ కండువా కాదు అని అంటున్నారు, మీరు దీన్ని ఒప్పుకుంటారా?” అని రాహుల్ గాంధీని నిలదీశారు.
“ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమిటి?” అంటూ రాహుల్ గాంధీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే, ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు. ఈ ద్వంద్వ ప్రమాణాలపై రాహుల్ గాంధీకి సిగ్గు లేదని తీవ్ర విమర్శలు చేశారు.