– అతిశయ ఆర్కే కొత్త పలుకు
(చాకిరేవు)
ఆర్కేగారికి అవగాహన అవ్వడం లేదు. ఈ మధ్య వయసు ఎక్కువై విశ్లేషణ బదులు, అతిశయంతో భ్రమల్లోకి వెళుతున్నట్లున్నారు. లేదా వేరే అజెండాతో ఈ విశ్లేషణ చేసి వుండవచ్చు.
తాను జైలుకు వెళితే, మిగిలిన వారిని కూడా పంపి వారూ వెళ్లారు, నాకూ వారికీ తేడా ఏమిటి అనేది జగన్ నైజం.
తాను భయంలో వుంటే మిగిలిన వారు కూడా భయంతో బతకాలి, అది చూసి జగన్ నాలా వారూ భయపడుతున్నారు, నాకూ వారికీ తేడా ఏమిటి అనేది ఆ కోవలోనిదే.
జగన్ ముందుగా తటస్థ జనాన్ని, అధికారులను భయపెట్టడానికి కారణం తన భయమే.
తాను కేసుల్లో లోపలకు వెళ్లడానికి సవాలక్ష స్వయంకృత పాపాలు వున్నాయి అనే భయం జగన్ను వెంటాడుతోంది. ఎందుకంటే చేయించింది ఏమిటో ఆయనకే బాగా తెలుసు. లోపలికి వెళితే తనతో వున్న 14 ఏళ్ల పాత కాంగ్రెస్ క్యాడర్, తిరిగి కాంగ్రెస్ చేరుతుంది అనే భయం మరొకటి.
లోపలికి పోకున్నా.. ఒక పద్ధతి ప్రకారం కొరుకుడుపడని చెల్లి రాజకీయ పోరాటం మొదలెట్టింది. ఆలస్యం చేసేకొద్దీ ఆమె బలపడవచ్చు. చెల్లితో చేతులు కలపి తిరిగి ఆహ్వానించలేని పరిస్థితులను సృష్టిస్తూ.. తన చుట్టూ వున్న కోటరీ తనను భ్రమలల్లో ఉంచుతోందా లేదా ఆస్తులు, రాజకీయ పదవులు పంచి ఇవ్వడానికి జగనుకు అస్సలు మనసు రాలేదా అన్నది, అర్థం కావడం లేదు.
కానీ క్యాడర్ దూరం అయితే కనీసం ములాఖత్ లలో కూడా గౌరవం ఇవ్వరు. ప్రతిపక్ష హోదా లేకున్నా వున్నట్లుగా భావిస్తూ.. భయపెట్టక తప్పని పరిస్థితుల్లోకి నెట్టబడ్డాడు. తనకు రక్షణగా వాడుకోవాల్సిన క్యాడర్ తాత్కాలిక సంతోషం కోసం భయ పెట్టడంను ఎంచుకోవడం ఆత్మహత్యాసదృశ్యం అని జగనుకే కాదు, అధికారులకు కూడా తెలుసు. క్రింది స్థాయి ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ పై స్థాయిలో అర్థంగాని అమాయక అధికారులు ఎవరూ లేరు.
అధికారులను నాలుగు ఏళ్ల తరువాత, ఎన్నికల ముందు భయపెట్టాలి. ముందే భయపెట్టాలని ప్రయత్నిస్తే.. వారి అహం దెబ్బతిని మొదటికే మోసం వస్తుంది అని జగనుకు తెలుసు. అర్జునుని మీద ప్రయోగించాల్సిన అస్త్రాన్ని ఘటోత్కచుడి కోసం ముందే అనవసరంగా వాడేసుకొన్నట్లుగా.. చెల్లి కోసం భయం అనే అస్త్రాన్ని ముందుగానే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి జగన్ ది.
తన పాపంలో అంటకాగిన అధికారులు కొందరు లోపలికి వెళుతున్నారు. కొందరు ప్రక్కన పెట్టబడ్డారు. వారంతా జగన్ జనాన్ని భయపెట్టడాన్ని చూసి మరింత భయపడుతున్నారు, ఇప్పట్లో తమ కష్టాలు దూరం అయ్యేలా లేవని. మిగిలిన వారు భయపడటం లేదు. చంద్రబాబు లక్ష్యాల మేరకు పరుగులు తీస్తున్నారు. కానీ భయపెట్టక తప్పదు క్యాడర్ కోసం.
ఈయన ఎంచుకున్న భయ అస్త్రం, వ్యాపార వర్గాలను భయపెడుతుంది అని కూడా జగనుకు తెలుసు.
చివర్లో దారిలోకి తెచ్చుకోవాల్సిన తటస్థ ఓటర్లను ముందస్తుగా భయపెడుతూ.. గత ఎన్నికల్లో తనకు షాక్ ఇచ్చినట్లు వారిని నిశ్శబ్ద భయంలోకి నెట్టేస్తున్నాడు. తన పాపాలే శాపాలై కర్ణుడిని యుద్ధభూమిలో వెంటాడినట్లుగా జగన్ శాపాలను మూటగట్టుకొంటున్నాడు.
ఇలా భయపెడుతూ.. కూటమి ఒక్కటిగానే ఉండకతప్పని పరిస్థితికి, తానే కారణం అవుతున్నాడు.
ఇది జగన్ మేధో యుద్ధం అనుకొంటా.. యుద్ధంలో నీకు బలహీనమైన శత్రువును నేనే అనే సంకేతాలను తెలివైన చంద్రబాబుకు పంపిస్తున్నాడు. బహుశా నాలుగేళ్ల పాటు ప్రతిపక్ష స్థాయి మాదే అనే హోదా కాపాడుకొంటే.. ఓడినా ఆ తరువాత జరిగే పరిణామాల బట్టి తన ఒకే ఒక్క ఛాన్స్ మరియు ఆఖరి ఛాన్స్ పార్టీకి కొన్ని సీట్లు పెరిగినా లేదా రెండో అతి పెద్ద పార్టీగా వచ్చినా.. అక్కడి నుండి అప్పటి నుండి తానైనా.. తన స్థానంలో ప్రతిష్టించబడే వారి చేతనైనా.. పార్టీని నిలబెట్టుకోవచ్చు అనే మానసిక భావనకు వచ్చి వుండవచ్చు.
ఇప్పటికైతే కవచకుండలాలు అయిన క్యాడర్ ను, నమ్మిన కుల మతాలను, కాంగ్రెస్ కు దానం చెయ్యడానికి ఆయన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే అదే జరిగితే.. బీజేపీ కోపానికి భస్మం అయ్యి, బెయిలు రద్దు అయ్యి, కేసుల్లో కదలిక వచ్చి, శశికళ లెక్కన అనుభవించాల్సి రావచ్చు.
సర్కస్ బోనులో నుండి రింగులోకి వచ్చి గర్జిస్తూ భయపెట్టి లోపలికి వెళ్లే పాత్రలో ఒక ప్యాలస్ నుండి బయటకు వచ్చి మరో ప్యాలెస్ లోకి వెళ్లే పనికి మాత్రమే పరిమితమై ఏడాది దాటాక కూడా గత ఎన్నికల ముందు నాటి భయాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత గుర్తెరిగి, భయంతో చేసుకుపోతున్నాడు జగన్.
జగన్ రెడ్డి బాటలో బాబు నడిచి భయపెట్టి తెరాస లెక్కన అవ్వాలని ఆర్కే అజెండా ఏమో.. అందుకే ఈ ఆర్కెస్ట్రా అనుకొంటా.
చాలా మీడియాలను అటూ ఇటూ టార్గెట్ చేస్తుంటే.. భయపెడుతుంటే.. ఏ మాత్రం తగ్గని మీడియాలలో ఒకటైన తనే ఏకైక హీరోగా గర్వించడం ఏదైతే ఉందో అది లలితా జువలరీస్ గుండుబాస్ మార్కెటింగ్ లెక్కన వుంది.