అమరావతికి ముంపు నీరు పోయే దారేదీ?
– ఇంకిపోవడం తప్ప బయటకు పోయే మార్గం లేదు
– చెప్పినా పట్టించుకోని అధికారులు
– ఈ పరిస్థితి ఉంటే నిర్మాణం ఆలస్యం
– మరో కెఎల్ రావు అవసరం ఉందా అనేంతగా సమస్య
(అభి)
రాజధాని అమరావతి నగరం ముంపునకు గురైంది. పైన కురిసిన వర్షాలకు నీరొచ్చి చేరింది. గతంలో నిర్వహించిన అనేక సర్వేల్లోనూ అమరావతికి ముంపు ఉందని తేలింది. అయితే దీన్నుండి నగరాన్ని బయట పడేయాలంటే బ్లూ ప్లాను అమలు చేయాలని, ీనికోసం నీరుకొండ రిజర్వాయర్ నుండి కిష్టాయపాలెం రిజర్వాయర్ వరకూ కాలువ తవ్వాలని, పైభాగంలో శాఖమూరు చెరువలోకి లింకు కలపాలని నిర్ణయించారు.
ఇదంతా ఒకెత్తయితే వరద వస్తే నీరు బయటకు ఎలా పంపాలనే అంశంలో సిఆర్డిఏ అధికారులు అనుసరించిన తీరు కొంత ఇబ్బంది కరంగా మారింది. నీరు బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడం, ప్రణాళిక లేని పనులు చేపట్టడం,కాంట్రాక్టర్లు కూడా వారికి చెప్పిన పని మినహా కనీస ఆలోచన లేకుండా చేయడంతో అమరావతి ముంపు బారినపడింది.
దీనికి ముఖ్య కారణాలు ఒకటి ప్రభుత్వం అనుకున్న విధంగా ఖచ్చితమైన రూపంలో సరైన సమయంలో వర్షపునీరు పోయే విధంగా కాలువలు నిర్మించకపోవడం. రెండు కొండవీటివాగు వెళ్లే మార్గం దగ్గర జాతీయ రహదారి కింద తూములు వేయాల్సిన చోట కాకుండా వేరే చోట వేయడం, కీలకమైన ముంపు నీటి ప్రహహానికి అడ్డుగా ఎస్ఆర్ఎం యూనివర్శిటీ నిర్మాణ సమయంలో అడ్డ కట్టలు పడ్డాయి. దాన్ని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ముంపు నీరు ఇప్పుడు బయటకు పోయే మార్గం కనిపించడం లేదు.
రాజధాని అమరావతిలోకి లాం దగ్గర నుండి కొండవీటివాగు, మోతడక వైపు నుండి కొట్టేళ్ల వాగు, వైకుంఠపురం పొలాల్లో నుండి పాలవాగు, మందడంలో నుండి సారవాగు ప్రవహిస్తున్నాయి. ఇందులో కొండవీటి వాగు కొండవీడు కొండలు, ఆ పరిసరాల నుండి వస్తుంది. మోడతక ఈ పరిధిలో నుండి కొట్టేళ్ల వాగు వస్తుంది. రాజధానికి వచ్చే వరద నీరంతా ఈ రెండువాగుల ద్వారా ప్రవహిస్తుంది. వీటికి దిగువన పాలవాగు తోడవుతుంది.
కొండవీటివాగు : కొండల్లో నుండి లాం, పెదపరిమి పొలాల మీదుగా నీరుకొండ వద్దకు చేరుకుంటుంది.
కొట్టేళ్లవాగు : మోతడక, అనంతవరం, నెక్కల్లు పరిసరాల్లో నుండి తుళ్లూరు, పెదపరిమి మధ్యలో నుండి నీరు కొండ, శాఖమూరు పరిసరాల్లోకి వస్తుంది.
పాలవాగు : వైకుంఠపురం నుండి దొండపాడు, రాయపూడి, మందడం, వెంకటపాలెం మీదుగా వస్తుంది. దీనికి రాయపూడి వద్ద క్రిష్టానదిలోకి స్లూయిస్ ఉంది. ఇది రెండు పాయలుగా చీలింది. ఒకటి దిగువ భాగానికి వస్తుంది.
సారవాగు :వెలగపూడి నుండి మందడం సబ్ రిజిస్ర్టరా్ కార్యాలయం పక్కనుండి మందడం నుండి వెంకటపాలెం దాటి మంతెన ఆశ్రమం వద్ద క్రిష్టానదిలోకి స్లూయిస్ ఉంది. వెంకటపాలెం వద్ద దీన్ని సారవాగుగా నామకరణం చేశారు. ఇందులోనే పాలవాగు కలిసింది. ఇటీవల ఈ స్లూయిస్ నుండే వరద నీరు లోపలకు వచ్చి పొలాలు ముంపునకు గురయ్యాయి.
వాగుల సహజ స్వభావం రీత్యా వరద వస్తే ఆపడం కష్టం అవుతుంది. ఒక్కసారిగా పెద్దఎత్తున వచ్చి పడతాయి. ఏ నిర్మాణ రంగ సంస్థయినా వరద నీరు వస్తే బయటకు ఎలా పంపించాలనే అంశంపైనే ప్రధాన ఆలోచన చేస్తుంది. కానీ అమరావతి విషయంలో నిర్మాణ రంగ సంస్థగా ఉన్న సిఆర్డిఏ అధికారులు ఆ దిశగా పనులు చేయలేదు. పనులు చేయించే పనిలో ఉన్నారు మినహా సమస్య ఎదురవకుండా చూసే పని చేయలేదు. ఫలితం ముంపు. విమర్శలు, ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలన్నీ ముందుకు వచ్చాయి.
బ్లూప్లానులో భాగంగా ముందుగా కాలువలు తీసి మిగిలిన పనులు చేపట్టి ఉంటే ఇలాంటివి పెద్దగా సమస్యగా కనిపించవు. ముంపు సమస్య ఉందనే నిధులిస్తున్న ప్రపంచబ్యాంకు కూడా ముందుగా వరద ముంపు నివారణా పనులు చేపట్టాలని సూచించింది. రూ.15 వేల కోట్ల అగ్రిమెంటు సమయంలోనూ ఈ విషయాన్ని నొక్కి చెప్పింది.
గతంలో వ్యవసాయ పొలాలు ఉన్న సమయంలో రైతులు ముందుగానే ఆలోచించి కాలువలు తీసుకున్నారు. రాజధాని ప్రకటన అనంతరం దీని రూపురేఖలు దెబ్బతిన్నాయి. ఈ విషయంలో అధికారులు పట్టించుకోకపోవడం పెద్ద సమస్యగా ఉంది. గతంతో రైతులు ఆలోచించి చేసుకున్న ప్లానును కూడా ఇప్పుడు అధికారులు చేయలేకపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే అమరావతి ముంపు నివారణ చేయాలంటే డాక్టర్ కెఎల్ రావు లాంటి ప్రఖ్యాత ఇంజనీరు అవసరం ఉందా అనే విధంగా పరిస్థితి తయారు చేశారు.
సమగ్ర ప్లాను కార్యాచరణ లేకుండా ఇలాగే చేసుకుపోతే పనులు పూర్తవడం ఇప్పట్లో అయ్యే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యమంత్రి కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వెంటనే శాశ్వత పరిష్కార చర్యల కోసం చేసిన ప్లానును వెంటనే పూర్తి చేసేలా చూడాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని రైతులు చేసిన సూచనను సిఆర్డిఏ అధికారులు పెడచెవిన పెట్టారు. ఫలితంగా నీరు బయటకు పోవడం పెద్ద సమస్యగా తయారై కూర్చొంది.
ముంపునకు పరిష్కారం ఏమిటి ?
1.ఎస్ఆర్ఎం యూనివర్శిటీ వద్ద అడ్డుకట్ట తొలగించాలి
2.జాతీయ రహదారి వద్ద కొండవీటివాగు నీరు నేరుగా వెళ్లేలా తూములు ఏర్పాటు చేయాలి
ఇప్పుడున్న తూములకు వీలుగా కాలువ తవ్వాలి. బ్లూప్లానుకు వీలుగా ప్రవాహానికి అడ్డు లేకుండా చూడాలి.
3. గతంలో జాతీయ రహదారి దిగువన కొండవీటి వాగుకు గామన్ ఇండియా వేసిన తూముల ప్లాను కాదని నవయుగ మార్చింది. దాన్నినీటి ప్రవాహానికి వీలుగా మార్చాలి
4. బ్లూప్లాన్లో భాగంగా కాలువలు నేరుగా కొండవీటి వాగు లిఫ్టు వద్దకు చేరుకులా మార్గం ఏర్పాటు చేయాలి.
5. క్రిష్టాయపాలెం నుండి పెనుమాక, ఉండవల్లి వరకూ కొండవీటివాగులో ఉన్న గుర్రపు డెక్క యుద్ధ ప్రాతిపదికన తొలగించాలి. గతంలో పడవల్లో పొక్లెయినర్లు పెట్టి తొలగించారు.
6. రోడ్లు వేసే చోట డక్టుల నిర్మాణం పేరుతో మట్టి తవ్వి పక్కన అడ్డు కట్టలుగా వేశారు. అవే ఇప్పుడు నీటి ప్రవాహాన్ని బలంగా అడ్డుకున్నాయి. వాటిని తొలగించి నీటిని దిగువకు పంపించాలి.
7. ఈ 8,9,10,11 రోడ్ల వద్ద నీటి ప్రవాహానికి అడ్డకట్టలు తొలగించాలి. కాలువల్లో ఉన్న ఫైల్ క్యాపులు, కట్టలు తొలగించాలి
8. అసలు కొండవీటివాగు, కొట్టేళ్ల వాగు అమరావతి వైపుకు రాకుండా మోతడక, యండ్రాయి, వైకుంఠపురం వైపు క్రిష్టానదిలోకి మళ్లించే ప్రణాళిక చేయాలి.
మురో ముఖ్యమైన విషయం ఏమిటంటే బ్లూప్లాన్ అమలు చేసినా వాగుల సహజ స్వభావం రీత్యా ఓక్కసారిగా వచ్చి పడతాయి. వాటిని ఆపడం సాధ్యం కాదు. బ్లూప్లాను అమలు చేసినా రిజర్వాయర్లలో నీరు అప్పటికే ఉంటుంది. అదనంగా వచ్చే నీరు వాటిల్లో చేరితే పొంగడం తప్ప మరొకటి ఉండదు. నేరుగా ఉండవల్లి లిఫ్టుల వద్దకు తరలించినా అంత తోసుకువచ్చే నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాదు.
ఇప్పటి వరకూ కొండవీటివాగుకు ముంపు వచ్చిన ప్రతిసారీ క్రిష్టానదిలో వరద వస్తోంది. కనుక వాగులను ఇప్పుడున్న అమరావతికి పడమట సరిహద్దు భాగంలో నుండే మళ్లించడంపై దృష్టి సారించాలి.