Suryaa.co.in

Editorial

నాలుగో సింహం నిద్రపోతోందా?

– మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి దౌర్జన్యకాండ
– ఈవీఎం పగులకొట్టిన తెగింపు
– ఖాకీలు కళ్లుమూసుకున్నారా?
-అక్కడ ఉన్న ఐజీలు ఏం చేస్తున్నట్లు?
– వారిపై కొరడా ఝళిపించరా?
– పిన్నెల్లిపై అనర్హత వేటు వేయరా?
– ఈసీ ఇంకా కళ్లు తెరవదా?
– డీజీపీ చర్యలు తీసుకోరా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘పోలీసులు కనిపించని నాలుగో సింహం’’ అని అదేదో సినిమాలో హీరో సాయికుమార్ డైలాగు చె బుతాడు. కానీ నిజంగానే మాచర్లలో నాలుగో సింహం పోలింగ్ బూత్‌ల దగ్గర కనిపించలేదు. నాలుకో సింహం మండుటెండలకు తాళలేక చెట్టుకింద తొంగుంది. డజను బటర్‌మిల్కు ప్యాకెట్లు, అరడజను కిన్లే వాటర్‌బాటిళ్లూ తాగి సుఖనిద్ర పోయింది. లేకపోతే ఈ సిగ్గుమాలిన తెగింపు కనిపించేది కాదు.

ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ.. ఎన్నికల వ్యవస్థను వెక్కిరిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రూపంలో పోలింగ్‌బూత్‌లో వికటాట్టహాసం చేయదు. మరిప్పుడు పోలీసు బాసు ఎవరిపై చర్య తీసుకుంటారు? ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంటుంది? డీజీపీ-సీఎ్‌స్‌ను సస్పెండ్ చేస్తుందా? ఈవీఎంలను నేలకేసి కొట్టిన ఎమ్మెల్యే అభ్యర్ధిని అనర్హుడిగా ప్రకటిస్తుందా? పోలీసులు తమ వైఫల్యానికి సిగ్గుపడుతూ, తలలు కిందకు వంచుతారా? ఇన్ని అరాచకాలు జరుగుతుంటే అక్కడ పర్యవేక్షకులుగా ఉన్న ఐజీలు, ఇంకా పేరు గొప్ప పోలీసాఫీర్లపై వేటు వేయరా? ఇవీ.. ఏపీ పోలీసులు-ఈసీని పౌరసమాజం జలిమిగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు!

పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గమంటేనే మొదటినుంచి హింసకు కేంద్రం. ఇక ఎన్నికల హింస దానికి అదనం. ఆ విషయం పేరు గొప్ప పోలీసులకూ తెలుసు. అందువల్ల ఎక్కడెక్కడ అరాచకం జరుగుతుందో ముందే కనిపెట్టి, అక్కడ భద్రత పెంచాల్సిన పోలీసులు.. పోలీసులు ఇచ్చే నివేదిక ప్రకారం భద్రత పెంచమని ఆదేశించాల్సిన ఈసీ కలసి కళ్లు మూసుకున్నారా? మాచర్ల నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్‌లో ఆలస్యంగా బయటపడ్డ.. అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచక దృశ్యాల దర్శనం తర్వాత మెడపై తల ఉన్న ఎవరికైనా వచ్చే సందేహమే.

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే, ‘పల్నాడు శాంతికపోతం’, ‘పోలీసులను గౌరవించే’ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఒక పోలింగ్‌బూత్‌లోకి అనుచరులతో వెళ్లారు. ఉత్తిగా వెళితే బాగానే ఉండేది. కానీ ఆ

బూత్‌లో తన ప్రత్యర్ధి జూలకంటి బ్రహ్మారెడ్డికి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెలుకుని, అక్కడి ఈవీఎంను నేలపైకి విసిరికొట్టారు. అడ్డొచ్చిన టీడీపీ ఏజెంట్‌ను పక్కకుతోశారు. దీనితో అక్కడున్న సిబ్బంది కూడా నిశ్చేష్టులయి, ప్రేక్షకపాత్ర పోషించాల్సి వచ్చింది. బయట ఉన్న పోలీసులేమో, ‘సిగ్గులేనిబతుకు’ సినిమాను సెల్‌ఫోన్‌లో చూస్తున్నారు. మరి అసలే మాచర్ల. ఆపై పిన్నెల్లి కదా?! అందుకన్నమాట!!

ఈ వీడియోలు లేటయినా.. లేటె స్టుగా ఎమ్మెల్యే పిన్నెల్లి దౌర్జన్యకాండ దృశ్యాలు, సోషల్‌మీడియా ద్వారా బయట ప్రపంచం కళ్లకు కనిపించింది. ఎమ్మెల్యే పోలింగ్ బూత్‌లోకి అనుచరులతో రావడం.. వచ్చీ రాగానే ఈవీఎంను నేలకు విసిరికొట్టడం.. అక్కడి టీడీపీ ఏజెంటు అడ్డుపడటం అన్నీ 70 ఎంఎం సైజులో జనాలు దర్శించారు. సరే.. అదృష్టవశాత్తూ పోలింగ్ డేటా నాశనమవకపోవడం, మళ్లీ అధికారులు దానిని సరిచేయడంతో పోలింగ్ ఓ గంట ఆలస్యమయిందనుకోండి. అది వేరే విషయం.

అయితే ఇక్కడ జరిగిన ప్రజాస్వామ్యపాతక పరిహాస ఎపిసోడ్‌లో.. శిక్ష ఎవరికన్నది పౌరసమాజం సంధిస్తున్న ప్రశ్న. విడుదలయిన వీడియో ప్రకారమైతే, ఎమ్మెల్యే పిన్నెల్లి నూటికి రెండొందల శాతం శిక్షార్హుడు. ఆయనక్కొడే కాదు. ఆ పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులపైనా చర్యల కొరడా ఝళిపించాల్సిందే. అంతేనా?.. ఆ పోలీసుస్టేషన్ పరిథిలోని సీఐ, ఎస్‌ఐనూ సస్పెండ్ చేయాల్సిందే.

అంతటితో చేతులు దులిపేసుకుంటే సరిపోదు. అసలు పోలింగ్‌కు ముందే మాచర్లలో అడ్డావేసిన ఇద్దరు ఐజీలను కూడా.. ఈ ైవె ఫల్యం ఖాతాలో కలపకుండా, కిందివారిపై వేటేస్తే కుదరదు. అది మరీ అన్యాయం అవుతుంది. ఇప్పటికే ఇద్దరు ఐజీలను విడిచిపెట్టి, అదనపు పోలీసుబందోబస్తు కోరిన ఎస్పీ బిందుమాధవ్‌పై వేటు వేయడం మరీ దారుణం.

అంటే ఏపీలో ధృతరాష్ట్ర పాలన నడుస్తోందన్న సంకేతాలివ్వదలిచారా? అన్నది పౌరసమాజం- మేధావులు జమిలిగా సంధిస్తున్న ప్రశ్న. మాచర్లలో విధ్వంసానికి గురైన ఆ పోలింగ్ బూత్ ఆఫీసరు, ఇప్పటిదాకా జరిగిన దారుణాన్ని పైవారికి ఫిర్యాదు చేయలేదా? ఒకవేళ చేసినా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునేందుకు భయపడ్డారా? అన్నది తేల్చాల్సిన ప్రశ్న. ‘ఆయనే ఉంటే మంగలితో పనెందుక’ని పాత సామెత చెప్పినట్లు… అసలు మొట్టమొదటే ఈసీ ధైర్యంతో నిర్ణయాలు తీసుకుని చర్యల కొరడా ఝళిపిస్తే, ఇన్ని అరాచకాలు ఎందుకు జరుగుతాయన్నది బుద్ధిజీవుల ప్రశ్న. సీఎస్‌ను మార్చాలన్న ప్రధాన రాజకీయ పార్టీల డిమాండును బుట్టదాఖలు చేసిన ఈసీ.. మాచర్లలో జరిగిన అరాచకకాండకు ఏం సంజాయిషీ ఇస్తుంది? ఎవరిని బాధ్యులను చేస్తుంది?

పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు డీజీపీని మార్చి, ఈసీ ఏం సాధించిందన్నది.. మాచర్ల పోలింగ్‌బూత్ పోలీసుల వైఫల్యం చూస్తే, ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సో..ఉత్తరాది అధికారుల పర్యవేక్షణలో జరిగిన పోలింగ్‌లో.. వారి ప్రతిభ ఉత్తిదేనన్నది పౌరసమాజం ఉవాచ.

మరి తప్పెవ రిది? శిక్ష ఎవరికి? ఈవీఎంను బద్దలు కొట్టిన ఎమ్మెల్యేకు అరదండాలు వేస్తేనే, పోలీసు-ఈసీ వ్యవస్థలపై ప్రజలకు గౌరవం ఉంటుందన్నది మనం మనుషులం అన్నంత నిజం. మరి ఆయనపై చర్యలకు సిపార్సులు చేసే దమ్ముందా? ఇదీ ఇప్పుడు వారి జవాబు కోసం ఎదురుచూస్తున్న ప్రశ్న!

LEAVE A RESPONSE