Suryaa.co.in

Andhra Pradesh

రైతులంటే ప్రభుత్వానికి లెక్కలేనితనంగా ఉందా.?

అధికారంలోకి వచ్చాక సబ్సీడీలు తీసేశారు.
తుపాన్ తో దెబ్బతిన్న పంటలను ఎందుకు పరిశీలించలేదు.?
పరిహారం ఇవ్వాల్సి వస్తుందని రైతుల వద్దకు రావడం లేదు.
ప్రభుత్వంపై టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఫైర్
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అసని తుపాన్ ప్రభావంతో రైతులు నష్టపోయినా ప్రభుత్వంలో చలనం లేదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటనష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు రైతుల వద్దకు రాలేదంటే ప్రభుత్వం నిద్రపోతుందనుకోవాలా..రైతులంటే లెక్కలేదనుకోవాలా అని ప్రశ్నించారు. అసని తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు రెండోరోజు పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా, అమాలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తంలో శుక్రవారం టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సభ్యులు పర్యటించారు. పలువురు రైతులు స్టీరింగ్ కమిటీ సభ్యుల వద్ద సమస్యలను మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ… ‘‘రైతులకు ప్రభుత్వం నుండి జిప్సం, సల్ఫేట్ వంటి ఎరువులకు అందడం లేదు. 2020-21 లో నిండు శాసన సభ సాక్షిగా వ్యవసాయ రంగానికి 20 వేళా కోట్లు కేటాయించి అందులో కేవలం 3వ వంతు ఖర్చు పెట్టారు.

వ్యవసాయ రంగం అంటే అంత లెక్క లేదా మీకు అంటూ యాంత్రీకరణకు కేంద్రం ఇచ్చే పధకాన్ని ఆపేసారు. యాంత్రీకరణ కింద మీరు ఈ మూడు సంవత్సరాలలో ఎంత ఖర్చు పెట్టారో, బిందు తుంపర సేద్యం కింద ఎంత ఖర్చు పెట్టారో దమ్ముంటే చెప్పాలంటూ నిలదీశారు. మూడేళ్లలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేసారు. రాష్ట్రాన్ని పతనావస్థకు తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పధకాలు ఒక్క ఆంధ్రప్రదేశ్ రైతులకు చేరనీకుండా చేసే హక్కు మీకు ఎక్కడుందంటూ నిలదీశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్డీఆర్ఎఫ్ నార్మ్స్ కంటే ఇన్పుట్ సబ్సిడీ పెంచి ఇచ్చాము. వైసీపీ ప్రభుత్వం దానిని రివర్స్ చేసింది. పంట నష్టానికి సంబంధించి సరి అయిన గణాంకాలు ఉండటం లేదు. ఇప్పుడు ఈ తుఫాను కు దెబ్బ తిన్న పొలాలను ఇంతవరకు ఎందుకు పరిశీలించలేదు. మమ్మల్ని తిట్టటం కాదు. మమ్మల్ని ఎలా కేసులలో ఇరికించాలా అన్ని చూడకుండా వెంటనే ఎంత మేర పంట నష్టం జరిగిందో అంచనా వేసి రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారాన్ని అందిచమంటూ కనీసం 4, 5 సంవత్సరాల క్రితం టీడీపీ హయాంలో ఇచ్చిన ఆ స్కేల్ అఫ్ ఫైనాన్స్ అయినా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

తుఫాన్ అంచనా వేయడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందింది. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా గోదావరి జిల్లాలో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ఎకరాకు రూ.75వేలు పెట్టుబడిపెట్టి రూ.30 వేలు కౌలు వెచ్చించి రైతులు పొలాలు సాగు చేస్తున్నారు. అరటి సాగు చేసిన రైతు ఎకరాకు రూ.1.35వేల నష్టం వాటిల్లింది. ఇన్ పుట్ సబ్సీడీని టీడీపీ రూ.3,750కోట్లు ఇచ్చింది. అంతకంటే ఎక్కువ తుపాన్ లు ఇప్పుడు వచ్చాయి. ఇప్పటి వరకు వచ్చిన తుఫాన్ వల్ల 53 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 20,300 కోట్లు రైతులకు నష్టం జరిగిందని వాళ్లే అంచనా వేశారు. పరిహారంలోనూ అవకతవకలకు పాల్పడ్డారు. పార్టీలు చూసి పరిహారం ఇస్తున్నారు. మూడేళ్లలో 8 సార్లు వరదలు వచ్చాయి. ఏన్డీఆర్ ఫాంలో హెక్టారుకు పదివేలు ఉంటే మేము ఇరవై వేలు ఇచ్చాం. అరటికి రూ.30 వేలు ఇచ్చాం. వరికి వైసీపీ ప్రభుత్వం రూ.15వేలు, అరటికి రూ.25వేలు మాత్రమే ఇస్తున్నారు.

జొన్నకు టీడీపీ హెక్టారుకు రూ.10 వేలు ఇస్తే 6,800 మాత్రమే ఇస్తున్నారు. ఆపరాలు పొద్దు తిరుగుడుకు టీడీపీ హెక్టారకు రూ.10 వేలు ఇస్తే ఈ ప్రభుత్వం రూ.4వేలు మాత్రమే ఇస్తోంది. జీడిపంటకు టీడీపీ రూ.30 వేలు ఇస్తే ఈ ప్రభుత్వం 20 వేలే ఇస్తోంది. మామిడికి రూ.30 వేలు టీడీపీ ఇస్తే..వీల్లు 20 వేలే ఇస్తున్నారు. మూడేళ్లుగా వరి రైతులకు ఉరి తాళ్లే మిగిలాయి. మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. అప్పు తెచ్చుకునేందుకు మీటర్లు పెడుతున్నారు. దుర్మార్గంగా అన్ని రేట్లు పెంచుతున్నారు. సీఎంగా ఏం చేస్తారో జగన్ చెప్పడం లేదు. వ్యవసాయంలో టీడీపీ 11శాతం వృద్ధి రేటు సాధిస్తే..అది ఈ రోజు ఏమైంది.? భూసార పరీక్షలు ఎందుకు ఆపేశారు.? రైతుల దిగుబడి పెరిగితే ఓర్చుకోలేరు.? మైక్రో ఇరిగేషన్ ఆపేశారు. ఏడాదికి యాంత్రీకరణ కింద రూ.5వందల కోట్లు ఖర్చే చేశాం. దమ్ముంటే వ్యవసాయంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. మీరు రైతాంగాన్ని సర్వ నాశనం చేశారు. మీ విధానాలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘రైతులను చంద్రబాబు ఏవిధంగా ఆదుకున్నారో జగన్ తెలుసుకోవాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారు. చంద్రబాబు గారి హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజులలో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు రబీ కోతలు సమయానికి కూడా ఖరీఫ్ బకాయిలు విడుదల చేయకపోవటం వంటి పరిస్థితులున్నాయి. రైతుకు మద్దతు ధర కోసమంటూ సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా 30,000 కోట్లు ఋణం తీసుకుని రైతును తాకట్టు పెట్టె రైతులకు మాత్రం న్యాయం చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితులు మారాలి.

రైతుకు మద్దతు ధర దక్కాలి, రైతు బాగుండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీని ఏర్పాటు చేసారు., ఈ కమిటి రాష్ట్రమంతా పర్యటించి రైతుల కోసం పోరాడటానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జ్యోతుల నెహ్రు, తుని నియోజకవర్గ ఇంచార్జ్ యనమల కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇతర రైతు నాయకులూ, పలువురు టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A RESPONSE