– రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తున్నదా… కాంగ్రెస్ రాచరికమా?
– సెక్రటేరియట్లో జగ్గారెడ్డి ఏ హోదాలో మీటింగ్ పెట్టుకున్నరు?
– తక్షణమే జగ్గారెడ్డి, హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
– ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పాలి
– స్పందించకపోతే త్వరలోనే బీఆర్ఎస్ నేతలతో మీటింగ్ పెడుతం
– నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై. సతీష్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతూ రాచరిక పోకడలతో పాలన నడుస్తున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీశ్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంలో ఏ హోదా లేకుండా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సచివాలయంలో సంగారెడ్డి, సదాశివపేట పురపాలక, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడమే ఇందుకు నిదర్శనమని మండిపడ్డారు.
ఏ హోదా లేకుండా జగ్గారెడ్డి సచివాలయంలో మీటింగ్ ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. జగ్గారెడ్డితో పాటు సమావేశంలో పాల్గొన్న అధికారులపై, సంబంధిత శాఖల ఉన్నతాధికారులపై కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చర్యలు తీసుకోవాలని సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏ హోదాలో జగ్గారెడ్డి సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టారో, సమావేశానికి ఎందుకు అనుమతి ఇచ్చారో కూడా సీఎస్ చెప్పాలని కోరారు.
తెలంగాణ సచివాలయంలో ఎవరైనా సమావేశం పెట్టుకోవచ్చా అనే విషయంపై కూడా స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. సమీక్ష నిర్వహించిన జగ్గారెడ్డి, సమీక్షకు హాజరైన అధికారులపై చర్యలు తీసుకోకపోతే.. సచివాలయంలో ఎవరైనా సమావేశం పెట్టుకోవచ్చనే సందేశం ఇచ్చినట్టుగా, సమాధానం చెప్పినట్టుగా భావించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు.
కాబట్టి త్వరలోనే బీఆర్ఎస్ మిత్రులతో కలిసి పెద్దఎత్తున తరలివచ్చి… తాము కూడా సెక్రటేరియట్లో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటామని స్పష్టంచేశారు. ప్రభుత్వ అధికారులు నిబంధనలకు లోబడి పనిచేయాలని, కాంగ్రెస్ నాయకులకు జీతగాళ్లలా ఊడిగం చేయడం మానుకోవాలని హెచ్చరించారు.