– సైట్ విజిట్ పేరుతో 6 వేల కోట్లు దోచుకున్న గజదొంగ.
-కార్మికుల కష్టార్జితం 100 కోట్లతో నీకు ఫుట్ బాల్ సోకులా?
రేపు ఎన్నికల్లో కార్మికులు నీతో ఫుట్ బాల్ ఆడటం ఖాయం బిడ్డ.. జాగ్రత్త
– అమెరికా పోయినా ఆ కుక్క తోక వంకర బుద్ధి మారలే
– దాశరథి ఎక్కడ పుట్టిండో తెలియని అజ్ఞాని మన ముఖ్యమంత్రి
– మెడికల్ బోర్డులో 70 శాతం మందిని రిజెక్ట్ చేసి.. అనారోగ్యంతో ఉన్న కార్మికుల ఇబ్బంది పెడుతున్న దుర్మార్గుడు
– అతి చేస్తున్న పోలీసుల్లారా ఖబడ్దార్
– రేపు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. అక్రమ కేసులు పెడితే జైల్లో ఊచలు లెక్కపెట్టిస్తాం.
– సింగరేణి కార్మికులపై ఆదాయ పన్ను రద్దు చేయని బీజేపీకి.. ఇక్కడ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు
-మాజీ మంత్రి హరీష్ రావు
మంచిర్యాల: నస్పూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారీ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ కష్టాలను, కేసీఆర్ పదేళ్ల అభివృద్ధిని గుర్తు చేస్తూనే.. రేవంత్ రెడ్డి పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సింగరేణి సొమ్ముతో రేవంత్ సోకులు.. కార్మికులు నీతో ఫుట్ బాల్ ఆడటం ఖాయం. సింగరేణిని రేవంత్ రెడ్డి తన బామ్మర్ది పాలు చేసిండు. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త నిబంధన పెట్టి, రూ. 6000 కోట్ల కాంట్రాక్టులను తన బామ్మర్దికి కట్టబెట్టిండు.
నైని బ్లాక్ టెండర్లను మేం కొట్లాడి ఆపిస్తే.. బామ్మర్ది కళ్లలో ఆనందం కోసం రేవంత్ రెడ్డి వాటిని రద్దు చేయడం లేదు. గతంలో ఓబీ టెండర్లు మైనస్ 10%, 20% ఉండేవి. కానీ ఇప్పుడు ప్లస్ 12% అదనంగా పెట్టి కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. సోలార్ పవర్ స్కామ్, డీజిల్ స్కామ్, జిలేటిన్ స్టిక్స్ ధరలు 30% పెంచి అందులోనూ కుంభకోణం చేస్తున్నారు. కార్మికుల రక్త మాంసాలను రేవంత్ రెడ్డి జలగలా పీల్చుకు తింటున్నాడు.
సింగరేణి కార్మికుల కష్టార్జితం అయిన సీఎస్ఆర్ నిధులు రూ. 100 కోట్లను రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడుకోవడానికి ఖర్చు చేస్తున్నాడు. ఆ డబ్బుతో కార్మికులకు ఆసుపత్రులు, పిల్లలకు స్కూళ్లు కట్టాలి కానీ.. నీ మనవడు ఫుట్ బాల్ ఆడుకోవడానికి వాడతారా? కార్మికుల పైసలతో నువ్వు ఫుట్ బాల్ ఆడితే.. రేపు ఎన్నికల్లో సింగరేణి కార్మికులు నీతో ఫుట్ బాల్ ఆడటం ఖాయం జాగ్రత్త..
రేవంత్ రెడ్డి అమెరికా పోయిండు. ఏదో చదువుకుంటాడనుకున్నాం. కానీ ఆరడుగులైనా, అంతరిక్షానికి పోయినా రేవంత్ రెడ్డి బుద్ధి కుక్క తోక వంకర అని తేలిపోయింది. ఆయనకు తెలంగాణ సోయి లేదు. చరిత్ర తెలియదు. దాశరథి గారు పుట్టింది మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో అయితే.. రేవంత్ రెడ్డి నిజామాబాద్ గడ్డ మీద పుట్టాడు అంటున్నాడు.
దేవాదుల ఏ దేశంలో ఉందో తెలియదు, నల్లమల ఎక్కడుందో తెలియదు.. ఇదా మన ముఖ్యమంత్రికి ఉన్న తెలివి? ఆనాడు చంద్రబాబు డిపెండెంట్ ఉద్యోగాలు రద్దు చేస్తే.. కేసీఆర్ మళ్ళీ ఇచ్చారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మెడికల్ బోర్డుకు 100 మంది పోతే 70 మందిని రిజెక్ట్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న కార్మికులను అన్ఫిట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు.
మంచిర్యాలలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు. మా పిల్లల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. బిడ్డ.. గుర్తుపెట్టుకోండి. అటు సూర్యుడు ఇటు పొడిచినా.. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అప్పుడు అక్రమ కేసులు పెట్టిన పోలీసులు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది జాగ్రత్త..
సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ (IT) రద్దు చేయాలని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు చేయడం లేదు? ఐటీ రద్దు చేయని బీజేపీకి ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. ఢిల్లీలో బీజేపీ, గల్లీలో కాంగ్రెస్ కుమ్మక్కై సింగరేణిని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారు.
మంచిర్యాల జిల్లా 30 ఏళ్ల కల. కేసీఆర్ జిల్లాను చేసి, ఇక్కడ దివాకర్ రావు చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇప్పించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలను తగ్గిస్తాం, రద్దు చేస్తాం అంటోంది. మంచిర్యాల జిల్లాగా ఉండాలన్నా, అభివృద్ధి కొనసాగాలన్నా కారు గుర్తుకే ఓటేయాలి..
మంచిర్యాల జిల్లా 30 ఏళ్ల కలను సాకారం చేసింది కేసీఆర్. ఒకప్పుడు ఎంప్లాయిమెంట్ కార్డు కోసం ఆదిలాబాద్ వెళ్లాలంటే నరకం చూసేవాళ్లం. కేసీఆర్ వచ్చాక మంచిర్యాలను జిల్లా చేసి, మెడికల్ కాలేజీ ఇచ్చి, అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండు. సింగరేణి కార్మికులు 3200 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి, రూ. 2 లక్షల విలువైన జాగను రూ. 30 లక్షలకు పెంచింది కేసీఆర్.
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించి 17,600 మందికి ఉద్యోగాలు ఇచ్చింది మా ప్రభుత్వం కాదా? ఎందరో అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల త్యాగాల పునాదుల మీద, పార్లమెంట్ దద్దరిల్లేలా కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రం ఇది. పదేళ్లలో కేసీఆర్ తలసరి ఆదాయంలో, జీఎస్డీపీలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు.మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి.
కానీ నేడు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ప్రజలు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతోంది. ఎన్నికల ముందు ఇక్కడి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు పంచలేదా? ఒకవైపు ప్రేమ్ సాగర్ రావు, మరోవైపు భట్టి విక్రమార్క సంతకాలు పెట్టి 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పారు.
మరి అవ్వతాతలకు రూ. 4000 పెన్షన్ వచ్చిందా? కేసీఆర్ గారు గెలిచిన నెలలోనే రూ. 200 ఉన్న పెన్షన్ రూ. 2000 చేశారు. రేవంత్ రెడ్డి రెండేళ్లయినా ఎందుకు పెంచలేదు? మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500 ఇస్తానని చెప్పి మహిళలను మోసం చేశారు. ఇప్పటికి 26 నెలలు గడిచింది..
ఒక్కో అక్కకు, చెల్లెకు ప్రభుత్వం రూ. 65,000 బాకీ పడింది. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఫలితాలు ఇచ్చిన ఉద్యోగాలకు.. కాగితాలు పంచి నేనే ఇచ్చాను అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఈయన మంది బిడ్డను నా బిడ్డ అని ముద్దాడుకునే రకం.
మంచిర్యాలలో ఇల్లు కట్టుకోవాలంటే మున్సిపల్ టాక్స్ కంటే ముందు కాంగ్రెస్ కు టాక్స్ కట్టాలి. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి కూలగొడితే..ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు కూలగొడతాడు. ఈ దాదాగిరి, గుండాగిరి ఇంకా సాగాలా? ఆలోచించండి. మంచిర్యాలలో ఓటుకు రూ. 5000 పంచడానికి రేవంత్ రెడ్డి సింగరేణిని దోచుకున్న డబ్బు పంపిస్తున్నాడు.
దేవుడి మీద ఉత్తుత్తి ఒట్లు పెట్టించుకొని మోసం చేయాలని చూస్తున్నాడు. ఆ 5000 తీసుకోండి.. కానీ ఓటు కారు గుర్తుకే వేయండి. కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి.. 5000 ఇచ్చారు సరే.. మిగిలిన 60,000 బాకీ ఎప్పుడు ఇస్తారు? అని అడగండి. మీరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తేనే.. రేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని గల్లా పట్టి అడుగుతాం. మా అక్కాచెల్లెళ్లకు 2500 ఎందుకు ఇవ్వలేదు? పెన్షన్ ఎందుకు పెంచలేదు? అని నిలదీస్తాం.
కాంగ్రెస్ కు ఓటేస్తే.. జనాలు మమ్మల్ని నమ్మారు, హామీలు అమలు చేయకపోయినా పర్లేదు అని రేవంత్ విర్రవీగుతాడు. రెండేళ్లలో మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మన కౌన్సిలర్లే గెలిచి అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి మోసపోయాం.. మళ్ళీ మోసపోవద్దు
అసెంబ్లీలో ప్రశ్నిస్తే.. లాగుల తొండలు తీస్తా, పేగులు మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు.నిరుద్యోగ యువతకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో ఆ అహంకారానికి ఓటుతో బుద్ధి చెప్పాలి.