– గతంలో ఇద్దరు కాపులుండేవారు
– గత పదేళ్లలో ఒక్క కాపు అధికారి లేరు
– సీఎంఓలో కాపులు అనర్హులా?
– మా సమస్యలు ఎవరికి చెప్పాలి?
– పవన్ కల్యాణ్‌కు పట్టించుకునే తీరికలేదు
– టీడీపీ, జనసేన కాపు ఎమ్మెల్యేలు స్పందించడం లేదు
– పోస్టింగులలో కాపు-బలిజ అధికారులకు అన్యాయం
– ఇలాగైతే కులాల వారీగా ఇచ్చిన పోస్టింగుల జాబితాను విడుదల చేస్తాం
– కాపు కార్పొరేషన్‌కు నిధులేవీ?
– విదేశీ విద్య లేకపోవడంతో కాపు విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం
– రాజకీయ నిర్ణయధికారంలో కాపు-బలిజను భాగస్వాములను చేయాలి
– 5 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఎప్పుడు?
– త్వరలో కాపుల కార్యాచరణ
– కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం
విజయవాడ: జనాభాలో 24 శాతం ఉన్న కాపు-బలిజలు ఏరికోరి తెచ్చుకున్న కూటమి పాలనలో తమ జాతికి అన్యాయం జరుగుతోందన్న భావన కాపు-బలిజవర్గాల్లో పెరుగుతోందని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమిలో పెద్దన్నగా జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నప్పటికీ, కాపు-బలిజల సమస్యలు వినేవారు లేకపోవడంతో మా జాతిలో అసంతృప్తి పెరిగిపోతోంది. ఇది వైసీపీకి రాజకీయంగా లాభంగా మారకుండా చూడాల్సిన బాధ్యత కూటమిదే’నని గాళ్ల స్పష్టం చేశారు.
ప్రధానంగా జగన్ సీఎంగా ఉన్న ఐదేళ్లు, ఇప్పుడు కూటమి అధికారంలో ఉన్న రెండున్నరేళ్లు కాపు-బలిజల సమస్యలు విని, పరిష్కరించేవారే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు కనీసం తమ సమస్యలు వినేందుకు కూడా సిద్ధంగా లేకపోవడం తమ జాతిని అవమానించడమేనన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కాపు ఎమ్మెల్యేలు భయంతో కాపులను దగ్గరకు రానీయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మరి మేం మా జాతి సమస్యలు ఎవరికి చెప్పాలి? టీడీపీ-జనసేన ఎమ్మెల్యేల వద్దకు చెబితే మా చేతిలో ఏమీ లేదంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేల వద్దకు వె ళితే పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లమంటున్నారు. అయినా టీడీపీ కాపు ఎమ్మెల్యేలు-నాయకులు పవన్ వద్దకు వెళ్లడమేమిటి? టీడీపీలోని సీనియర్ కాపు ఎమ్మెల్యేలు ‘ పవన్ ఉన్నారు కాబట్టి నాయకత్వం మమ్మల్ని లెక్కచేయడం లేదు. పట్టించుకోవడం లేద’ని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వాళ్లే సమస్యల్లో ఉంటే ఇక వారికి మా సమస్యలేం చెబుతాం?
జనసేన ఎమ్మెల్యేలను అడిగితే మాకే పవన్ సమయం ఇవ్వడం లేదంటున్నారు. పోనీ పవన్ వద్దకు వెళదామా అంటే ఆయన ఈ రెండున్నరేళ్లలో కాపు నాయకులను దగ్గరకే రానీయని పరిస్థితి. ఎన్నిసార్లు అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వడం లేదని కాపు సంఘాలు చెబుతున్నాయి. మా సమావేశాల్లోమో పవన్ కల్యాణ్ కూటమిలో ఉన్నా కాపులకు ఇంకా మన జాతికి ఎందుకు అన్యాయం జరుగుతుంది? కాపు అధికారులకు కీలక పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదని మమ్మల్ని నిలదీస్తున్నారు. మరి ఈ పరిస్థితిలో మేం ఎవరి వద్దకు వెళ్లాలి? మా గోడు ఎవరికి వినిపించాలి?
కూటమి అధికారంలోకి వస్తే కాపు-బలిజ సమస్యలు పరిష్కారమవుతాయనుకుంటే, అసలు కూటమి కాపు-బలిజలంటేనే దూరం పెడుతున్న పరిస్థితి. మా మాట వినడానికే ఇష్టడపడని పరిస్థితి ఉంది. ఇది రాజకీయంగా కూటమికి మంచిదికాదు. అలాగని మేం వైసీపీని బలపరచడం లేదు. కూటమి నిర్లక్ష్య చర్యల వల్ల వైసీపీ రాజకీయంగా లాభపడితే అందుకు కూటమిదే బాధ్యత తప్ప, కాపు-బలిజలది కాద’’ని గాళ్ల వ్యాఖ్యానించారు.
కాపుల్లో పెరుగుతున్న అసంతృప్తి ఆగ్రహంగా మారకముందే కూటమి రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని, లేకపోతే అది జగన్‌కు రాజకీయంగా లబ్ధి చేకూర్చే ప్రమాదం ఉందని గాళ్ల హెచ్చరించారు. ఇటీవలి కాలంలో కాపు-బలిజ-తూర్పు కాపు అధికారులకు పోస్టింగు ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రద్దు చేస్తున్నారని, మరికొందరికి పోస్టింగు ఇచ్చిన పదిరోజుల్లోనే బదిలీ చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘ఇదే పద్ధతి కొనసాగితే గత రె ండున్నరేళ్లలో ఏ కులానికి చెందిన అధికారులకు ఏయే పోస్టింగులు ఎక్కడెక్కడ ఇచ్చారు? ఏయే కులాలకు లూప్‌లైన్ పోస్టింగులు ఇచ్చారు? కాపులకు పోస్టింగులకు ఇవ్వకుండా ఎంతమందిని ఖాళీగా కూర్చోబెడుతున్నారన్న జాబితాను ప్రకటించాల్సిస్తుంది. మేం ఇప్పటివరకూ కూటమి క్షేమంగా ఉండాలనే కోరుకుంటున్నాం. మాకు కాపు-బలిజ సంక్షేమం- మా జాతికి రాజకీయ నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కావాలన్న కోరిక తప్ప రాజీ య అజెండా లేదు. కూటమిలో ఏ పార్టీపైనా వ్యతిరేకత లేద’’ని గాళ్ల స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన సీఎంలో భాను, ఎస్వీప్రసాద్ సీఎంఓలో ఉండేవారని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూటమి-జగన్ హయాంలో ఒక్క ఐఏఎస్ అధికారి సీఎంఓలో లేకపోవడం దారుణమే కాదు అవమానంగా కాపు-బలిజ జాతి భావిస్తోందన్నారు. సీఎంఓలో అన్ని కులాలవారున్నారు. కానీ అప్పుడు వైసీపీ,ఇప్పుడు కూటమి ప్రభుత్వాల్లో ఒక్క కాపు అధికారి కూడా లేకపోవడం విచారకరమన్నారు.
‘ మా సమస్యలు విన్నవించుకుందామంటే అటు టీడీపీ-ఇటు జనసేన సిద్ధంగా లేవు. కాపు-బలిజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలంటే సీఎంఓలో ఒక కాపు ఐఏఎస్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు కనీసం మా బాధలు వినేందుకు ఒక అధికారయినా ఉంటారు. అప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి సీఎంఓలో తక్షణం కాపు అధికారిని నియమిస్తే ప్రభుత్వానికే మంచిద’ని గాళ్ల సూచించారు.
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్‌కు నిధులు ఇచ్చి, కాపు విద్యార్ధులకు విదేశీ విద్య నిధులిచ్చారని గుర్తు చేశారు. దానితో చాలామంది కాపు విద్యార్ధులు ఉన్నత చదులు చదవి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం దక్కిందన్నారు. అందుకు తాము చంద్రబాబుకు గతంలోనే కృతజ్ఞత చెప్పామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఉత్సవ విగ్రహమయిపోయిందని, ఉన్న బడ్జెట్ జీతాలకే సరిపోతోందని, దానితో విదేశీ విద్య అందక కాపు పిల్లలు విద్యాపరంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి మూడు వేల కోట్లు ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలని కోరారు. విదేశీ విద్యకు సంబంధించి ఉన్న 200 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో కాపులకు ఇచ్చిన 5 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని కోరారు.
కాగా రాష్ట్రంలో కాపు-బలిజ జాతి ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. దీర్ఘకాలిక సమస్యలను పక్కనపెట్టి, ఈ ప్రభుత్వంలో సాధ్యమయ్యే వాటినే గుర్తించి వాటి పరిష్కారం కోసం వివిధ దశల్లో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు గాళ్ల సుబ్రమణ్యం వెల్లడించారు.