హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదు
‘నిజం గెలవాలి’ అని చెప్పేందుకే నేను వచ్చా
బ్రిటిష్ వాళ్లతో పోరాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది
చంద్రబాబుపై కేసులు పెట్టడం తప్ప..అభివృద్ధిపై ఈ ప్రభుత్వం ధ్యాస పెట్టడం లేదు
జైల్లో పెట్టింది చంద్రబాబును కాదు..రాష్ట్ర అభివృద్ధిని, న్యాయాన్ని
ఎన్టీఆర్ నేర్పించిన తెలుగు పౌరుషంతో ప్రభుత్వంపై పోరాడుదాం
– నారా భువనేశ్వరి
చంద్రగిరి: నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాటంలో భాగంగా చేపట్టిన నిజం గెలవాలిలో ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో హింసా రాజకీయాలు, అత్యాచారాలు, గంజాయి తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు.
అగరాలలో జరిగిన నిజం గెలవాలి సభలో తనలోని ఆవేదన, బాధను ప్రసంగంలో బెలిబుచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో గుండెపోటుతో మరణించిన వారి కుటుంబ సభ్యులను బుధవారం భువనేశ్వరి పరామర్శించారు.
అనంతరం సాయంత్రం అగరాలలో ఏర్పాటు చేసిన ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి ప్రసంగించారు…‘‘నేను రెండు రోజుల క్రితం నారావారిపల్లెకు వెళ్లినప్పుడు గతంలో నా కుటుంబంతో గడిపిన సంఘటనలు గుర్తొచ్చి గుండె పిండేసింది. నా మనసులో ఏముందో సాటి మహిళలుగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి, రాజకీయాలు చేయడానికి రాలేదు. మొదటిసారిగా ఒకసభలో మాట్లాడుతున్నా..తప్పులుంటే నన్ను క్షమించండి.
నిజం గెలవాలనేది ఒక పోరాటం…ఈ పోరాటం నా ఒక్కదానిదే కాదు.. మీ అందరిదీ. ఈ పోరాటం మన రాష్ట్రం కోసం, మన కోసం, మన బిడ్డల భవిష్యత్ కోసం. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని, పార్టీని ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్ నమ్మిన ప్రజలే దేవుళ్లు…సమాజమే దేవాలయం అని ఎన్టీఆర్ ఇచ్చిన నినాదంతో ఎన్టీఆర్ ట్రస్టును చంద్రబాబు నెలకొల్పారు. దాన్ని నేను నడిపిస్తున్నా..సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నాం. 3 వేలమంది అనాథ పిల్లలను చదివిస్తున్నాం. తిరుపతిలో వరదలు వస్తే ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సాయం అందించి 49 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించాను.
చంద్రబాబు గురించి నాకుంటే మీకే ఎక్కువ తెలుసు..ఆయన జీవితమంతా ప్రజలు..ప్రజలు అంటూ కష్టపడుతున్నారు. ఆయన మనసులో టీడీపీ బిడ్డలది మొదటి స్థానం అయితే మా కుటుంబానిది రెండో స్థానం. 14 ఏళ్లు చంద్రబాబు సీఎంగా పని చేశారు..ఆ 14 ఏళ్లు ఏపీని ముందుకు తీసుకెళ్లాలనే తపించారు. ఆయన 25 ఏళ్ల క్రితం ఒక విజన్ తో ఆలోచించి హైటెక్ సిటీని కట్టారు. రాళ్లు, రప్పలు, లైట్లు కూడా లేని ప్రాంతంలో హైటెక్ సిటీ ఏంటని అందరూ నవ్వారు. చంద్రబాబు అంతగొప్ప..ఇంతగొప్ప అని నేను ఎప్పుడూ చెప్పలేదు.
ఏమీలేని చోట హైటెక్ సిటీ ఎందుకు అని నేను చంద్రబాబుతో అన్నప్పుడు..హైటెక్ సిటీ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడు అని నాతో అన్నారు. ఇప్పుడు ఆ సిటీ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు..అది చంద్రబాబు పడ్డకష్టం. లక్షలాది మంది కుటుంబాల్లో ఆయన వెలుగులు నింపారు. ఐటీ, ఐ.ఎస్.బీ, ఇంకా పెద్ద పెద్ద సంస్థలను తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. ఎలాంటి గర్వం లేకుండా ఒక మెట్టు కిందకు దిగే వ్యక్తి చంద్రబాబు.
యువతకు ఉద్యోగాలివ్వాలి..వారు సంతోషంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పే వ్యక్తి. అలాంటి వ్యక్తిని 47 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, స్కిల్ డెవలెప్ముంట్ కేసుల్లో దేనిలోనూ సాక్ష్యాలు, ఆధారాలు లేవు…అయినా కేసులు పెట్టారు. స్కిల్ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో మొదట రూ.3 వేల కోట్ల అవినీతి అన్నారు..తర్వాత రూ.370 కోట్లు అన్నారు..ఇప్పుడు రూ.27 కోట్ల అవినీతి అంటున్నారు. వారు పెట్టే కేసుల్లో ఏమన్నా అర్థం ఉందా.?
స్కాం జరిగిందని చెప్తన్నారు..మరి ఆ డబ్బులు ఎవరికన్నా వెళ్లినట్లు రాసి ఉందా…ఆధారాలు ఉన్నాయా..లేవు. చంద్రబాబుపై కేసులు మీద కేసులు పెడుతున్నారు..అది తప్ప వారికి మరో ధ్యాస లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనిగానీ, ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన లేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగాక ఆయన ఎంతో కష్టపడ్డారు. రోజుకు మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోయేవారు. ప్రజలకు మంచి చేసి, దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలని పరుగులు పెట్టేవారు.
మీకేమన్నా పిచ్చిపట్టిందా..నిద్రపోకుండా కష్టపడుతున్నారు, ప్రజలకు సేవ అంటూ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదని నేను అనేదాన్ని. అలా అడిగిన తర్వాత రెండు రోజులు సాధారణంగా ఉంటూ మళ్లీ నిద్రలేకుండా కష్టపడేవారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు జైల్లో పెట్టారు. మొన్నటి అంగళ్లు ఘటనలో ఆయనపై హత్యాయత్నం కేసులు పెట్టారు. రైతులకు నీరందించాల్సిన నీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అవుతున్నాయని అడిగినందుకు కేసులు పెట్టారు.
అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ బిడ్డలు శ్రీకాకుళం నుండి కుప్పంనకు సైకిల్ యాత్ర చేస్తే పుంగనూరులో వారి చొక్కాలు చింపి, జెండాల తొలగించి అవమానించారు. ఎంత మందిని అరెస్టు చేసినా టీడీపీ జెండా పట్టుకునే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తారని మర్చిపోతున్నారు. వారి చేష్టలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఈ పోరాటాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. యువగళం పాదయాత్రలో లోకేష్ మైక్, సౌండ్ వాహనం, స్టూల్ కూడా ఎత్తుకెళ్లారు. ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవాలి. టీడీపీ శ్రేణులు కనబడితే కేసులు పెడుతున్నారు.
నేను ఎవర్ని కలిసినా నాపై 10 కేసులు, 20 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. కేసులు పెట్టడం 50 రోజులు జైల్లో పెట్టడం చేస్తున్నారు. యువగళం వాలంటీర్లను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అవన్నీ చూసి ప్రజలకు చంద్రబాబు కష్టం తెలిసేదా లేదా అనుకునేదాన్ని. కానీ ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నా..ప్రజలంతా చంద్రబాబు కష్టం గుర్తుంచుకున్నారు. మహిళలు, ప్రజలు చంద్రబాబు కోసం బయటకు వచ్చి పోరాడుతున్నారు. పోరాడుతున్న వారిపట్ల ఆడ, మగ అని చూడకుండా పోలీసులు ఇష్టానుసారంగా కొట్టడం, లాక్కెళ్లి వ్యానుల్లో పడేస్తున్నారు. స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇదేనా పరిపాలన అంటే.? ప్రజలు ఎందుకు బయటకు వచ్చి పోరాడుతున్నారో అర్థం చేసుకోవాలి..చంద్రబాబు మహానాయకుడు అని, మహిళలకు భద్రత కల్పిస్తారని నమ్ముతున్నారు.
మహిళల కోసం చంద్రబాబు 22 పథకాలు తీసుకొచ్చారు. మహానాడు వేదికగా మహిళలకు మహాశక్తి పథకాలు ప్రకటించారు. ఆయన బయట ఉండుంటే దసరాకు మరిన్ని పథకాలు మహిళలకు ప్రకటించేవారు. ఇవాళ కాకపోయినా, రేపైనా నిజం గెలిచి చంద్రబాబు బయటకు వస్తారు. ఈ ప్రభుత్వం అనుకుంటోంది.. చంద్రబాబును నిర్బంధిస్తే ఫిజికల్ గా, మెంటల్ గా వీక్ అయ్యి పార్టీ చెల్లాచెదరవుతుందని అనుకున్నారు. ఆ ధ్యాసతోనే ఎన్నికలకు మందు ఇవన్నీ చేస్తున్నారు. చంద్రబాబు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తి. 45 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో ఎదుర్కొన్నారు..ఆయనకు ఇదొక సమస్య కాదు.
త్వరలో చంద్రబాబు వచ్చి మీ కోసం సేవాభావంతో ఇంకా కష్టపడతారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉంటే రాష్ట్రం ఎంత సంతోషంగా మీరంతా చూశారు..మనం కూడా రాష్ట్రం గురించి గర్వంగా చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు పాలన చూస్తుంటే ప్రభుత్వం ఉందా అనిపిస్తోంది. చంపడాలు, భయపెట్టడాలు, రేప్ లు, గంజాయి తప్ప రాష్ట్రంలో అభివృద్ధి కనబడటం లేదు. మహిళలకు భద్రత లేదు.. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఏ రాష్ట్రానికి, స్త్రీ కూడా నాలా ఇబ్బంది పడకూడదు.
భారతదేశం అంటే డెమెక్రటిక్ స్టేట్స్ గా పిలుస్తారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో యు హేవ్ రైట్ టు స్పీక్, రైట్ టు వ్రైట్, రైట్ టు టాక్, రైట్ టు వాక్, రైట్ టు టేక్ పొఫెషన్ అని ఉంది. మన దేశం ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకుంటున్నాం…కానీ మన రాష్ట్రంలో అరాచకం జరగుతోంది. బ్రిటిష్ వాళ్లతో పోట్లాడినట్లు ఈ ప్రభుత్వంతో పోరాడాల్సి వస్తోంది. మనమంతా చేయీ, చేయీ కలిపి పోరాడాలి..అడగు ముందుకే తప్ప వెనక్కి వేయకూడదు. మనకు ఎన్టీఆర్ పౌరుషం నేర్పించారు.
అదేంటో వారికి చూపిద్దాం. చంద్రబాబును జైల్లో నిర్బంధించారని వాళ్లు అనుకుంటున్నారు….చంద్రబాబును కాదు, రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భంధించారన్న సంగతి వారు మర్చిపోయారు. మీరంతా నాతో నిజం గెలవాలి అనే పోరాటంలో పాల్గొనాలి. మన స్వేచ్ఛ కోసం పోరాడదాం.. చంద్రబాబు కోసం పోరాడుదాం..మన కోసం పోరాడుదాం. నిజం గెలవాలి..నిజమే గెలవాలి..సత్యమేవ జయతే..జైహింద్’’ అని భువనేశ్వరి ప్రసంగం ముగించారు.