– ఒకే యాత్ర.. రెండు పాడెలు!
– రాజకీయ విన్యాసాల సాక్షిగా రాలిపోయిన రెండు ప్రాణాలు!
– ఇబ్రహీంపట్నం ‘రక్త’ చరిత్ర..
నాయకుడు వస్తున్నాడంటే ప్రజల్లో భరోసా కలగాలి. కానీ, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సాక్షిగా సాగిన దృశ్యాలు చూస్తుంటే, అది ‘ప్రజల కోసం’ సాగిన యాత్రలా లేదు, కేవలం ‘ప్రచార పిచ్చి’ కోసం సాగిన మృత్యు క్రీడలా కనిపిస్తోంది. అప్పుడప్పుడు పరరాష్ట్రాల నుంచి వచ్చి వెళ్లే నాయకుడి కోసం ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు వదలడం అత్యంత దారుణం.
ఒకే యాత్ర.. రెండు పాడెలు!
వైకాపా శ్రేణుల అతి ఉత్సాహం ఈరోజు ఇద్దరు వ్యక్తులను బలితీసుకుంది:
డీ. రాంబాబు (చిల్లకల్లు గ్రామ అధ్యక్షుడు): పార్టీ కోసం పనిచేసే కార్యకర్త. ఎండలో, కిక్కిరిసిన జనం మధ్య యాత్ర సాగదీయడం వల్లే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. నాయకుడి జేజేల మధ్య ఒక సామాన్య కార్యకర్త మరణ కేక వినిపించకపోవడం ఆ పార్టీ అంతర్గత సంస్కృతికి నిదర్శనం.
భార్గవ్ (స్థానిక యువకుడు): నాయకుడి కళ్ళలో పడాలనే ఆరాటంతో చేసిన బైక్ స్టంట్లు, గంజాయి బ్యాచ్ వీరంగం ఒక యువకుడి ప్రాణాన్ని బారికేడ్ల పాలు చేసింది.
మానవత్వం కన్నా.. కాన్వాయ్ కే ప్రాధాన్యమా?
గుంటుపల్లి వద్ద అంబులెన్స్ సైరన్ వేస్తూ ప్రాణభిక్ష కోరుతున్నా, వైకాపా కార్యకర్తలు దారివ్వకపోవడం వారి ‘అరాచక మానవత్వానికి’ పరాకాష్ట. ప్రాణవాయువు కంటే పార్టీ జెండానే ముఖ్యం అనుకోవడం ఏ రకమైన సామాజిక న్యాయం? పోలీసులపైకి దూసుకెళ్లడం, వికృత విన్యాసాలు చేయడం చూస్తుంటే మనం రాతి యుగంలో ఉన్నామా అనిపిస్తోంది.
కల్తీ వీరుల కోసమే ఈ ఆరాటమా?
ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం దందా చేసి కిడ్నీలు పాడుచేసిన చరిత్ర ఉన్న నేతలను, ములకచెరువు కల్తీ లిక్కర్ కేసులో బెయిల్ మీద వచ్చిన వారిని పరామర్శించడానికి ఇంత హంగామా అవసరమా? కల్తీ నెయ్యిపై కారుకూతలు కూసి జనం చేతిలో దెబ్బలు తిన్నవారిని ఓదార్చడానికి వెళ్తూ, కష్టపడి పనిచేసే కార్యకర్తలను శ్మశానానికి పంపడం ఏ రకమైన రాజకీయం?
ఒకవైపు శవాలు కుప్పకూలుతుంటే.. మరోవైపు నినాదాల హోరుతో సాగిన ఈ పర్యటన రాష్ట్ర చరిత్రలో ఒక “బ్లాక్ డే”. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి చేసే ఈ “షో”లు ఆపకపోతే, ప్రజలే ఆ నాయకులకు తగిన బుద్ధి చెబుతారు.
– చాకిరేవు