– అభివృద్ధి లేక డైవర్షన్ రాజకీయాలే అజెండా
– కేసులు–నోటీసులు–లీకులే పాలన, అభివృద్ధి జీరో
– మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి పై మాట్లాడే ధైర్యం లేకే డైవర్షన్ డ్రామాలు
– హైడ్రా పేరుతో ప్రజల జీవనాధారాలపై దాడి
– అసెంబ్లీలో బహిరంగ చర్చకు రండి
-సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సవాల్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిని పూర్తిగా పక్కనబెట్టి, డైవర్షన్ రాజకీయాలనే ఏకైక అజెండాగా మార్చుకున్నారని బీఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయ డ్రామాలను ఆధారాలతో సహా ప్రజల ముందు నిలదీశారు.
పంచాయితీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డి పాలనలో కనిపించింది ప్రచారం, కేసులు, నోటీసులు, లీకులు తప్ప అభివృద్ధి కాదని ఆయన స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చూపించడానికి ఒక్క రోడ్డు, ఒక్క పరిశ్రమ, ఒక్క సంక్షేమ పథకం కూడా లేకపోవడంతోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ను టార్గెట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ పేరుతో అక్రమ కేసులు, నోటీసులు, విచారణల రాజకీయాన్ని నడుపుతున్నారని మండిపడ్డారు.
మీడియా మరియు సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా అబద్ధపు లీకులు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టడమే రేవంత్ రెడ్డి పాలన యొక్క అసలు స్వరూపమని డాక్టర్ సంజయ్ ఆరోపించారు.
అభివృద్ధిపై చర్చకు రావాల్సిన ప్రభుత్వం, కాళేశ్వరం సీబీఐ విచారణ అంటూ మరో డైవర్షన్ తెరపైకి తెచ్చి, ఎన్నికల హామీల అమలులో జరిగిన ఘోర వైఫల్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడిచినా ఒక్క ఇటుక కూడా పెట్టలేని ప్రభుత్వం, ‘హైడ్రా మూసివేత’ పేరుతో ప్రజల ఇళ్లపై, వ్యాపారాలపై, జీవనాధారాలపై దాడి చేసిందని తీవ్రంగా విమర్శించారు.ఇది పాలన కాదని, అధికార అహంకారంతో సాగుతున్న విధ్వంసమని వ్యాఖ్యానించారు.
ఈ డైవర్షన్ రాజకీయాలకు బీజేపీ పరోక్ష మద్దతు ఇవ్వడం మరింత సిగ్గుచేటు విషయమని డాక్టర్ సంజయ్ మండిపడ్డారు.రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాల్సిన బదులు కేసీఆర్, కేటీఆర్ గార్లను టార్గెట్ చేస్తూ పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై చేస్తున్న ఆరోపణలకు బీజేపీ తోడ్పాటుగా నిలుస్తూ పబ్బం గడుపుతుందే తప్ప, తెలంగాణ రాష్ట్రానికి చేసింది మాత్రం సున్నా అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బీజేపీ, డైవర్షన్ రాజకీయాల్లో కాంగ్రెస్కు భాగస్వామిగా మారిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇలానే అభివృద్ధి హామీలను పక్కనబెట్టి, కేసులు–నోటీసులు–డైవర్షన్ డ్రామాలతో కాలం గడిపితే, రాష్ట్రంలోని యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, వృద్ధులు – అందరూ రోడ్లపైకి వచ్చే పరిస్థితి దూరంలో లేదని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ, మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చకు రండి.
మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? అమలు చేసినవి ఎన్ని? మీ పాలనలో జరిగిన అభివృద్ధి ఏంటి?డైవర్షన్ డ్రామాలు ఏంటి?అన్నింటిపైనా బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డాక్టర్ సంజయ్ సూటిగా సవాల్ చేశారు.
కాంగ్రెస్ డైవర్షన్ రాజకీయాలతో కాదు, అభివృద్ధితోనే ప్రజల విశ్వాసం గెలవాలని, లేదంటే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన హెచ్చరించారు.