– నాపై అత్యాచారయత్నం జరుగుతోందన్నా స్పందించరా?
– ఆ ఏసీపీపై చర్యలు తీసుకోండి
– దళితులపై జరుగుతున్న అన్యాయం, వివక్ష, వేధింపు లు పట్టించుకునే పాపాన పోలేదు
– బిజెపి తెలంగాణ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్
హైదరాబాద్: రైజింగ్ తెలంగాణ” పేరుతో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద భవనాలు చూపిస్తూ, విదేశీ పెట్టుబడులంటూ చెబుతున్నారు. కానీ ఈ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న అన్యాయం, వివక్ష, వేధింపులపై మాత్రం పట్టించుకునే పాపానపోలేదు. దళిత సంక్షేమం, దళిత మహిళల భద్రత- ఇవన్నీ ఈ “రైజింగ్ తెలంగాణ”లో పూర్తిగా సింకింగ్ అవుతున్న వాస్తవాలు.
జూన్ నెలలో ఎన్. మల్లిక అనే షెడ్యూల్డ్ కులాల (మాదిగ) మహిళ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఆమె భర్త బీసీ (యాదవ) కులానికి చెందినవారు. వీరి కులాంతర వివాహాన్ని కారణంగా చూపుతూ.., స్థానికంగా జైన్ సమాజానికి చెందిన జగ్జీవన్ జైన్, అమిత్ జైన్ తదితరులు ఆమెను నిరంతరం వేధించగా, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆమె స్పష్టంగా వెల్లడించింది.
మల్లిక అనేకసార్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, తాను షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళనని, తనపై జరుగుతున్న వేధింపులు–అత్యాచారాలను అట్రాసిటీ చట్టం కింద నమోదు చేయాలని పదేపదే విజ్ఞప్తి చేసింది. అయినా కూడా, స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆరు నెలలుగా కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నాడు.
ఇంతకుమించి, అదే మీర్‌చౌక్ పరిధి ACP ఆమెకు స్పష్టంగా, “బాధిత మహిళ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి కాదని… అందుకే కేసు బుక్ చేయడం లేదని చెప్పాడనే విషయాన్ని ఆమె బాధతో వెల్లడించింది.
నిన్న టీవీ డిబేట్లో పాల్గొన్న బాధిత మహిళ, ACP తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు బెదిరింపుల అంశాన్ని బహిర్గతం చేసింది. ఆమె చెప్పిన ప్రకారం, తన సమస్యపై మాట్లాడేందుకు ACP నేరుగా ఫోన్ చేసి, తన దగ్గరకు నేరుగా రావాలని, అప్పుడే సమస్యను పరిష్కరిస్తానంటూ సూచించినట్లు తెలిపింది.
ఒంటరిగా ఎందుకు రావాలని ప్రశ్నించగా, తాను రాకపోతే బాధిత మహిళపై ‘బ్రోతల్ కేసు’ నమోదు చేస్తానని ACP బెదిరించాడని ఆమె స్పష్టంగా వివరించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో, స్థానిక పోలీస్ అధికారుల ధోరణిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ACP చేసిన అసహ్యకరమైన, లైంగిక వేధింపుల వ్యాఖ్యలతో బాధిత మహిళ తీవ్రంగా మానసికంగా కుంగిపోయి, నిన్న న్యూస్ ఛానల్ ముందు తన ఆవేదనను వెల్లడించింది.
తర్వాత, భారతీయ జనతా పార్టీ SC మోర్చా ప్రతినిధి బృందం ఆమెను కలిసి పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంది. బాధిత మహిళ చూపించిన సాక్ష్యాల ప్రకారం- పోలీస్ డిపార్ట్మెంట్ కావాలనే ఆమెను షెడ్యూల్డ్ కులానికి చెందని వ్యక్తిగా చూపిస్తూ, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయకుండా ఆరు నెలలుగా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తోంది. ఈ వ్యవహారం స్థానిక పోలీసుల ధోరణిపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తోంది.
బాధిత మహిళ షెడ్యూల్డ్ కులానికి చెందినదని నిర్థారించే SC కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా ప్రతినిధి బృందానికి అందింది. ACP ఆమెను అనుచితంగా వేధించడం, లైంగికంగా ఇబ్బంది పెట్టడం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయకుండా దుష్ప్రచారం చేయడం వంటి అంశాలను ఆధారాల సహా పరిశీలించిన అనంతరం, భారతీయ జనతా పార్టీ SC మోర్చా నేషనల్ SC కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు స్వీకరించిన వెంటనే నేషనల్ SC కమిషన్ సంబంధిత DCPకి నోటీసులు జారీ చేస్తూ వివరణ కోరింది.రాష్ట్రంలో దళిత మహిళలు పోలీస్ అధికారుల చేతుల్లో ఎదుర్కొంటున్న అన్యాయం, వేధింపులు, తీవ్ర అవమానాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిజెపి ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ఒక దళిత మహిళ ఆరు నెలలుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి “తనపై అత్యాచారయత్నం జరుగుతోంది… దయచేసి కేసు నమోదు చేయండని విజ్ఞప్తి చేస్తున్నా, ఫిర్యాదు స్వీకరించకపోవడం అనేది.. తెలంగాణలో దళిత మహిళలకు భద్రత ఎంత దారుణంగా ఉందో చూపించే తార్కాణం. కొంతమంది వ్యక్తుల ఒత్తిళ్ల నేపథ్యంలో ACP ఆ మహిళపై మరింత లైంగిక వేధింపులు, అనుచితంగా వ్యవహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
అందువల్ల, ఆ ACPని వెంటనే విధుల నుండి బర్తరఫ్ చేయాలని, బాధిత మహిళ ఫిర్యాదును స్వీకరించి.. అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తోంది. అలాగే, ఒక దళిత మహిళను “SC కాదు, BC సామాజిక వర్గానికి చెందిన వారని తప్పుడు ప్రచారం చేస్తూ… కేసు నమోదు చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసిన సంబంధిత పోలీసు అధికారులపై కూడా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం.