తన కుప్పంలో హంద్రీనీవా కాలువ ద్వారా నీరు తెచ్చి, చెరువులు నింపి అక్కడ బోటులో షికారు చేశారు చంద్రబాబు.
పోటీగా, ఎమ్మెల్యే జగన్ పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం గంగమ్మకుంట చెరువులో కృష్ణాజలాలకు హారతి ఇచ్చారు.
వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు 2017లో చంద్రబాబు సీఎంగా ఉన్నపుడే కృష్ణా జలాలను రప్పించారు. అక్కడికి వెళ్లి సభ పెడితే.. ఎంపీగా ప్రోటోకాల్ ప్రకారం తనకు మైక్ కావాలని అవినాశ్ అడిగారు. చంద్రబాబు మైక్ ఇప్పిస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి స్తోత్రం మొదలుపెట్టారు అవినాశ్ రెడ్డి.
సహించని టీడీపీ యువకుడు విజయ్ మైక్ లాక్కోవడానికి వస్తే చంద్రబాబు వారించారు. వివాదం సృష్టించడానికే అవినాశ్ అక్కడికి వచ్చాడన్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
తాజాగా నిన్న అవే జలాలకు జగన్ హారతులు ఇచ్చి, పూజలు చేశారు. మంగళవారం పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలోని అంబకపల్లె గ్రామంలో గంగమ్మకుంటలో నింపిన కృష్ణా జలాలకు జగన్ జలహారతి ఇచ్చారు. నిజానికి… గత టీడీపీ హయాంలోనే లింగాల కుడికాలువ నుంచి ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి హిరోజుపురం వరకు పైపులైన్లు వేశారు. ఈ ఏడాదిలో.. ఆ పైపులైన్లు గంగమ్మకుంట చెరువు వరకు పొడిగించారు. ఇందుకోసం అవినాశ్ రెడ్డి తన ఎంపీ నిధుల నుంచి రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు ఆ చెరువుకు చేరిన కృష్ణా జలాలకే జగన్ పూజలు చేశారు.
మరో విషయం ఏమిటంటే, ఈ ఏడాదిలో గంగమ్మ కుంటను నరేగా పథకం కింద చేపల చెరువులా చేయించి విస్తరించారు.
కడప జిల్లా మొత్తం చేపల చెరువులు కూడా పెంచుకొనేలా మొత్తం 5480 చోట్ల ఈ ప్రభుత్వం హయాంలో ప్రణాళికలు వేసింది. వాటిలో 1794 మంజూరై.. యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. జూన్-జూలై కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేసి, పూర్తైన పనుల్లో అందులో గంగమ్మకుంట చెరువు కూడా ఒకటి.
జగన్ హయాంలో చెరువుల పనులకు 500 కోట్లకు ప్రతిపాదనలు పంపితే కేవలం 50 కోట్లు మాత్రమే విదిల్చాడు. అవన్నీ గత టీడీపీ హయాములో జైకా కింద పెట్టినవే. ఆ 50 కోట్లు వచ్చినా పనులు కాలేదు. అటు కర్నూలులో హంద్రీనీవా పనులను గాలికి వదిలేశాడు జగన్. అక్కడ లైనింగ్ పనులు పూర్తి చేయకుండా వదిలి పంటలను ముంచేసి ఆపేశారు. మాల్యాల వద్ద గండి పడితే పందికొక్కు తవ్వేసింది అని తేల్చిన కథలు చెప్పుకుంటే సిగ్గుచేటు.
అక్కడి నుండి నీరే రాకుండా కుప్పంలోకి వెళ్లి సెట్టింగులు వేసి కుప్పిగంతులు వేశాడు. జనం కళ్లకు కట్టిన గంతలను టీడీపీ, మీడియా, సోషల్ మీడియా విప్పి చూపేసరికి జగన్ కామెడీపీసయ్యారు.
– చాకిరేవు