– మహేష్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలి
– హింసను సమర్థించేలా మాట్లాడేవారు ఆ హింసలో భాగస్వాములవుతార
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: ఆపరేషన్ కగార్ విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కక్షపూరితంగా చంపుతోందంటూ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో నక్సల్స్ దాడులు, హింసతో నాశనమైన కుటుంబాలు అనేకంగా ఉన్నాయి. మాజీ స్పీకర్ శ్రీపాదరావు , చిట్టెం నర్సిరెడ్డి , రాగ్యానాయక్ వంటి నేతలను కూడా మావోయిస్టులే చంపారు. ఈ సంఘటనలను మర్చిపోయారా..? ఇప్పుడా నక్సల్స్ను ‘పేదల కోసం పోరాడిన వారు’ అని చెప్పడం దుర్మార్గం, సిగ్గుచేటు. బాధిత కుటుంబాలను అవమానించినట్లే. నక్సల్స్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు, ప్రజలకు మీరిచ్చే భరోసా, గౌరవం ఇదేనా? అంతేకాదు.. కాంగ్రెస్ హయాంలోనే అత్యధిక ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ కాలంలో మావోయిస్టులను ఎలా ఎదుర్కొన్నారో దేశం మొత్తం తెలుసు.
ఇప్పుడు మాత్రం కేంద్రంపై ఆరోపణలు చేస్తూ రాజకీయాలు చేయడం హాస్యాస్పదం. మరోదిక్కు మాజీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నక్సల్స్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. వెయ్యి ఎలుకలు తిని తీర్థయాత్రకు వెళ్లిన చందంగా ఉంది. గతంలో తానే ఎన్కౌంటర్లలో పాల్గొని.. నేడు తమ గతాన్ని మరిచి నక్సల్స్ పట్ల సానుభూతి చూపడం రెండు నాల్కల ధోరణే. కేంద్ర ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా ఉంది- దేశంలో ఎక్కడైనా హింస, నక్సలిజం, మావోయిస్టు దాడులు జరగకుండా ప్రజలను రక్షించడం.
ఇది ఎలిమినేషన్ కాదు… ఇది ప్రొటెక్షన్ . ఇది ప్రతీకారం కాదు… రాజ్యంగబద్ధమైన బాధ్యత. కానీ టీపీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు మాత్రం నేరానికి ప్రోత్సాహం ఇచ్చేలా ఉన్నాయి. మావోయిస్టుల దాడుల్లో తమ భర్తలు, కుమారులు, తండ్రులను కోల్పోయిన వేలాది కుటుంబాల గాయాలపై ఉప్పు రాసినట్టుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. హింసను సమర్థించేలా మాట్లాడేవారు… ఆ హింసలో భాగస్వాములవుతారు. చట్టం ముందు వాళ్లు కూడా బాధ్యులే అని గుర్తుంచుకోవాలి. మావోయిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలు, పోలీసులు, ప్రజాప్రతినిధుల కుటుంబాలకు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే… ప్రజాస్వామ్యాన్ని అవమానించిన వ్యక్తిగా, హింసను పరోక్షంగా ప్రోత్సహించిన నాయకుడిగా చట్టం ముందు శిక్షార్హుడిగా నిలవాల్సి వస్తుంది.