Suryaa.co.in

Editorial

టీటీడీ చైర్మన్‌గా టీవీ5 నాయుడు ఖరారు?

  • సోమవారం ప్రకటించే అవకాశం?

  • చైర్మన్ ఒక్కరేనా? కమిటీ ప్రకటిస్తారా?

  • డిప్యూటీ చైర్మన్ ఎవరికో?

  • ఈసారి బోర్డు కాలపరిమితి ఏడాది మాత్రమేనా?

  • ప్రశాంతిరెడ్డి, వైద్యనాధన్, కుపేందర్‌రెడ్డి కొనసాగింపుపై తర్జనభర్జన

  • వైద్యనాధన్ కోసం అమిత్‌షా ఒత్తిడి?

  • ఇప్పటికే మూడుసార్లు మెంబరుగా చేసిన వైద్యనాధన్

  • వరసగా రెండుసార్లు చేసిన వారిని మళ్లీ కొనసాగించకూడదంటున్న బోర్డు నిబంధనలు

  • ప్రశాంతిరెడ్డి-మంత్రి పార్ధసారథి గత పర్చేజింగ్ కమిటీలో సభ్యురాలు

  • క్లిష్టంగా మారిన బోర్డు సభ్యుల ఎంపిక

( మార్తి సుబ్రహ్మణ్యం)

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు టీటీడీ బోర్డు ఎంపిక క్లిష్టంగా మారింది. కూటమిలోని జనసేన-బీజేపీ సిఫార్సు చేసిన వారికి మాత్రమే కాకుండా, జాతీయ స్థాయిలో బీజేపీ కేంద్రమంత్రుల సిఫార్సులను కూడా పరిగణనలోకి తీసుకోవలసిన పరిస్థితే దానికి కారణం.

ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్-బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమ జాబితా ఇవ్వగా.. అమిత్‌షా సహా కేంద్రమంత్రులు కూడా కొందరి పేర్లు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే టీటీడీ బోర్డు ఏర్పాటు ప్రకటన, ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బ్రహ్మోత్సవాల కంటే ముందుగానే కమిటీ వేయాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అందులో భాగంగా.. టీటీడీ చైర్మన్‌గా టీవీ 5 అధినేత బీఆర్ నాయుడు ఎంపిక దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఆయన పేరు సోమవారం ప్రకటించే అవకాశలున్నట్లు చెబుతున్నారు. అయితే చైర్మన్‌గా ఆయన ఒక్కరి పేరే ప్రకటిస్తారా? సభ్యుల జాబితా కూడా విడుదల చేస్తారా అన్నదానిపై స్పష్టత కనిపించడం లేదంటున్నారు. కాగా ఈసారి కొత్తగా డిప్యూటీ చైర్మన్ పదవి కూడా సృష్టించబోతున్నట్లు చెబుతున్నారు. నిజానికి వైస్ చైర్మన్ అని తొలుత ప్రచారం జరిగినప్పటికీ, టీటీడీ యాక్టులో ఆ హోదా లేదని, సహజంగా చైర్మన్ లేనప్పుడు కమిషనర్ వైస్ చైర్మన్ (యాక్టింగ్ ైచె ర్మన్)గా వ్యవహరిస్తారని టీటీడీ అధికారులు గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆ హోదాను, డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించవచ్చని చెబుతున్నారు.

కాగా గత ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు టీవీ5, ఏబీఎన్ కష్టపడ్డాయి. ప్రజల అభిప్రాయాలను మలచడంతోపాటు, వైసీపీ-జగన్‌పై వ్యతిరేకత పోగుచేసే క్రమంలో ఆ రెండు చానెళ్లు.. జగన్ సర్కారుపై ప్రత్యక్ష యుద్ధమే చేశాయి. అందులో టీవీ 5 అధినేత బీఆర్‌నాయుడుపై జగన్ సర్కారు కేసు కూడా పెట్టిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో జగన్ ప్రభుత్వం వాటికి ప్రకటనలివ్వకుండా, ఆర్ధికంగా దెబ్బతీసింది.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం.. ఏబీఎన్ యజమాని రాధాకృష్ణకు చెందిన యాక్టివ్ పవర్ ప్రాజెక్టుకు ఎన్‌ఓసీతోపాటు, అసెంబ్లీ లైవ్ టెలికాస్ట్ హక్కులను ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే ఎన్నికల ముందు వరకూ ఏబీఎన్ అధినేత రాధాకృష్ణ చేసిన శ్రమకు తగిన ఫలితం ఇచ్చినట్లేనని టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఐదేళ్లు కోల్పోయిన ఆర్ధికనష్టాన్ని కూడా పూడ్చినట్టేనంటున్నారు.

ఇక జగన్ జమానాలో కేసులకు గురైన టీవీ5 అధినేత బీఆర్ నాయుడుకు, టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. నిజానికి ఎన్నికల ముందే.. కూటమి అధికారంలోకి వస్తే నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందన్న ప్రచారం లేకపోలేదు. ఆ మేరకు ఆనాడు చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చారన్న ప్రచారం కూడా వినిపించకపోలేదు.

అయితే కొద్దిరోజుల నుంచి సుప్రీంకోర్టు మాజీ సీజె ఎన్వీరమణ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. కానీ దేశంలో అత్యున్నత స్థాయి పదవి అనుభవించిన రమణ.. టీటీడీ చైర్మన్ ఆశించరని, అదంతా కేవలం ప్రచారమేనన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఒకవేళ ఎన్వీ రమణ చైర్మన్ అయితే రేపు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సీజేలు, ప్రధాని లాంటి వీవీఐపిలు వస్తే వారికి ఎదురెళ్లి స్వాగతం పలుకుతారా? అందువల్ల ఇవన్నీ పుకార్లేనని టీడీపీ వర్గాలు కొట్టిపారేశాయి. మరికొద్దిరోజులు చైర్మన్ పదవికి చంద్రబాబు రాజకీయ సలహాదారు టిడి జనార్దన్ పేరు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సోమవారం బీఆర్ నాయుడు పేరును టీటీడీ చైర్మన్‌గా ు ప్రకటించవచ్చంటున్నారు. అయితే ఆరోజు చైర్మన్‌గా ఆయన ఒక్కరిపేరే ప్రకటిస్తారా? లేక కమిటీ మొత్తం ప్రకటిస్తారా? అన్న దానిపై స్పష్టత రాలేదంటున్నారు.

కాగా టీటీడీ బోర్డులో పేర్లకు బాబుపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. కేంద్రమంత్రి అమిత్‌షా వైద్యనాధన్‌కు, మరోసారి అవకాశం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే టీటీడీ నిబంధనల ప్రకారం, వరసగా రెండుసార్లు బోర్డు సభ్యుడిగా పనిచేసిన వారికి మూడోసారి ఇవ్వకూడదంటున్నారు. మరి ఈ మొహమాటాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.

ఇక కొవ్వూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, బెంగళూరుకు చెందిన కుపేందర్‌రెడ్డికి ఇవ్వాలన్న ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ హయాంలో ప్రశాంతిరెడ్డి-ఇప్పటి మంత్రి కొలుసు పార్ధసారథి బోర్డులో పనిచేశారు. వారిద్దరూ పర్చేంజింగ్ కమిటీలో ఉన్నప్పుడే ఈ కొనుగోళ్లు జరిగాయంటూ వైసీపీ ఇప్పటికే, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను ప్రచారంలో పెట్టింది.

పైగా అప్పుడు అవినీతి-అక్రమాలు-అపచారం జరిగి ఉంటే సభ్యులుగా ఉన్న ప్రశాంతిరెడ్డి-సారథి, ఎందుకు నిలదీయలేదన్న ప్రశ్నలతో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రోజా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తాజాగా వివిధ సంస్ధలు, విశ్లేషకులు మీడియా చర్చలో ఇదే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రశాంతిరెడ్డికి స్థానం కల్పిస్తే, హిందువులలో ఎలాంటి సంకేతాలు వెళతాయన్న తర్జనభర్జన కూడా లేకపోలేదంటున్నారు.

LEAVE A RESPONSE