Suryaa.co.in

Andhra Pradesh

ఒక్క షిరిడీ సాయికే రూ.2,629 కోట్లు బిల్లులు చెల్లించిన మాట వాస్తవం కాదా?

-60 వేలు ఖరీదు ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను రూ.1.30 వేలు పెట్టి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వద్ద కొనాల్సిన అవసరం ఏంటి?
-ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ పెంచకుండా వినియోగదారులపై రూ.50 వేల కోట్ల భారాలు మోపారు
-మోపిన భారం చాలక నెలనెలా విద్యుత్ ఛార్జీలు పెంచి రోడ్డున పడేస్తారా?
-ఆదివాసీ గ్రామసభల ఆమోదం లేకుండా, పెసా చట్టాన్ని ఉల్లంఘించి భూములను ఏ విధంగా కేటాయిస్తారు?
– పీ.ఏ.సీ చైర్మన్ పయ్యావుల కేశవ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శుక్రవారం నాడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించి కోతలు లేని నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసిన వ్యక్తి నేడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటే విస్మయం కలిగిస్తోంది. జగన్ రెడ్డి నాలుగేళ్లలో విద్యుత్ వినియోగదారులపై రూ.50 వేల కోట్లు భారాలు మోపారు. 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.16,611 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రూ.31,261 కోట్లు అప్పులు, హిందుజాకు చెల్లించేందుకు తెచ్చిన రూ.1,234 కోట్లు మొత్తం కలిపి రూ.49,106 కోట్ల భారాలు వినియోగదారులపై రుద్దారు.

2014 లో 22.5 మి.యూనిట్ల విద్యుత్ లోటుతో చంద్రబాబు పాలన ప్రారంభమయ్యింది. 2014 లో 9,529 మెగావాట్ల సామర్ధ్యాన్ని 2018 నాటికి 19,080 మెగావాట్లకు పెంచాం. చంద్రబాబు ప్రభుత్వం 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ సామర్థ్యం పెంచింది. విద్యుత్ ఇతర రాష్ట్రాలకు అమ్మింది. జగన్ రెడ్డికి మిగులు విద్యుత్ అప్పగించాం. నాడు కరెంటు కోతలు లేవు. ధరలు పెంచలేదు. కానీ, జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశాడు. ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచింది లేదు. కరెంట్ కోతలు బాగా పెరిగాయి, పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించారు.

వినియోగదారులకు సేవలు నామమాత్రంగా ఇచ్చి చార్జీలు భారీగా పెంచారు. ఇప్పుడు ప్రతీ నెలా ఛార్జీలు పెంచుతామని ఏపీఈఆర్.సి చెబుతోంది. ఇది జగన్ రెడ్డి ప్రభుత్వ అసమర్థత కాదా? బహిరంగ మార్కెట్ లో అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేస్తున్నారు? 2019-22 మధ్య బహిరంగ మార్కెట్ లో రూ. 12,200 కోట్లుకు విద్యుత్ కొనుగోలు చేశారు. సరాసరి మార్కెట్ యూనిట్ కొనుగోలు రేటు రూ.8.77. డిస్కంల యావరేజ్ కొనుగోలు రేటు రూ.4.75. అదనంగా యూనిట్ కు రూ.4.02 చెల్లించి రూ. 6,000 కోట్లు రాష్ట్రానికి నష్టం చేకూర్చారు. ఇది అసమర్ధతనా? లేక కమిషన్ల కోసమా?

2023-24 కు గాను 12,469 మి.యూ మిగులు ఉన్నట్లు డిస్కంలు వెల్లడించాయి. అయినా ఎందుకు బహిరంగ మార్కెట్ లో కొనాలంటూ డిస్కంలపై ఒత్తిడి చేస్తున్నారు.? తక్కువ రేటుకు వచ్చే సెంట్రల్ జెనరేటింగ్ స్టేషన్స్ (సి.జి.ఎస్) నుంచి ఎందుకు విద్యుత్ తీసుకోవడం లేదు? మూడున్నరేళ్లపాటు RTPPని బ్యాక్ డౌన్ చేశారు. మైలవరం సోలార్ ప్లాంట్ పై దాడి చేశారు. గ్రీన్ ఎనర్జీ పిపిఏ లను రద్దు చేశారు.

రివర్స్ టెండరింగ్ పేరుతో 9640 mw పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టును పూర్తి చేయలేదు. కృష్ణపట్నం స్టేజ్ -2 లో 800 మె.వా, నార్ల తాతారావు థర్మల్ స్టేషన్ స్టేజ్ V లో 800 మె.వా సకాలంలో పూర్తి చేయలేదు. తగు కోల్ స్టాక్స్ ఉండేలా చూడలేదు. కేంద్రం నుండి గ్యాస్ రాబట్టలేదు. ఇవి సకాలంలో చేసి ఉంటే మార్కెట్ విద్యుత్ కొనుగోళ్లకు రూ 6 వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన దుస్థితి ఉండేది కాదు. దీనికి కారణం ప్రభుత్వ అవినీతి అసమర్థత కాదా?

విద్యుత్ డిస్కంల అప్పును గత మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.50 వేల కోట్లకు చేర్చారు. 2018-19 లో కేవలం రూ.18,022 కోట్లుగా ఉన్న డిస్కంల అప్పు 2022 డిసెంబర్ నాటికి ఆందోళనకరంగా రూ.50,004 కోట్లకు చేరింది. చంద్రబాబు గారి హయాంలో 2014-19 ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పు కేవలం రూ.4,188 కోట్లు పెరిగితే నేడు జగన్ హయంలో మూడున్నరేళ్లలోనే రూ.31,981 కోట్లు పెరిగింది. 2014-15 లో టిడిపి హయంలో డిస్కంల అప్పు రూ.13,834 కోట్లు ఉండగా అది 2018-19 నాటికి కేవలం రూ.18,022 కోట్లకు మాత్రమే చేరుకుంది. కానీ, వైసీపీ హయంలో ఆ అప్పు కాస్తా 2022 డిసెంబర్ నాటికి రూ.50,004 కోట్లకు చేరి ప్రపంచ రికార్డు సృష్టించింది.

అంటే ఐదేళ్ల చంద్రబాబు పాలనలో కేవలం 30 శాతం డిస్కంల అప్పు పెరిగితే జగన్ రెడ్డి పాలనలో డిసెంబర్, 2022 నాటికి 177 శాతం అప్పు పెరిగింది. మీ అస్మదీయులకు దోచిపెట్టడానికి డిస్కంలను అప్పుల ఊబిలో ముంచుతారా? రూ.60 వేలు ఖరీదు ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను రూ.1.30 వేలు పెట్టి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వద్ద కొనాల్సిన అవసరం ఏంటి? ఒక్క షిరిడీ సాయికే రూ.2,629 కోట్లు బిల్లులు చెల్లించిన మాట వాస్తవం కాదా? 33 వేల మె.వా 29 పంప్డ్ స్టోరేజ్ హైడల్ పవర్ ప్లాంట్ల పేరుతో 1.50 లక్షల గిరిజనులు, దళితులు భూములను అదానీ లాంటి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. ఆదివాసీ గ్రామసభల ఆమోదం లేకుండా, పెసా చట్టాన్ని ఉల్లంఘించి భూములను ఏ విధంగా కేటాయిస్తారు?

చంద్రన్న ఐదేళ్లలో 36 లక్షలు కొత్త గృహ కనెక్షన్లు ఇస్తే , జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం 8 లక్షలు మాత్రమే. చంద్రన్న 3.26 లక్షల కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇస్తే జగన్ రెడ్డి నాలుగేళ్లల్లో ఇచ్చింది కేవలం లక్ష కనెక్షన్లు మాత్రమే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తూ రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారు.

LEAVE A RESPONSE