– గుండెలు బాదుకున్న వారంతా ఏమయ్యారు?
ఐదేళ్లలో మా అప్పు కేవలం రూ.3.32 లక్షల కోట్లు
– 18 నెలల కూటమి పాలనలో ఏకంగా రూ. 2,66,175 కోట్లు అప్పు
– మీరా అప్పులు గురించి మాట్లాడేది?
– ఎవరిది విజన్?, ఎవరిది విధ్వంసం?
– డ్రోన్ల కొనుగోలు పేరుతో భారీ స్కామ్
– ఒక్కో డ్రోన్ రూ.3.50 లక్షలు
– ప్రభుత్వం మాత్రం రూ.9.80 లక్షలకు కొనుగోలు
– హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
హైదరాబాద్: అడుగడుగునా అబద్దాలు, వాస్తవ వక్రీకరణలతో సీఎం చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు.హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ… అప్పులు, అసమర్థతతో చంద్రబాబు ప్రభుత్వం విధ్వంస పాలన చేస్తోందన్న బుగ్గన… ఎవరిది విజన్?, ఎవరిది విధ్వంసం అని నిలదీశారు. వైయస్సార్సీపీ హయాంలో కేవలం రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే… మా హయాంలో రూ.10 లక్షల కోట్లు అబద్దాలు చెప్పడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు కేవలం 18 నెలల కూటమి పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన రూ. 2.66 లక్షల కోట్లు అప్పు ఏమైందని నిలదీశారు.
అప్పులు విషయానికొస్తే రూ.10 లక్షల కోట్లు అప్పు అని చెప్తారు. అంటే ఆర్బీఐ, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్(కాగ్) తప్పు చెబుతున్నాడు. మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టి అకౌంట్స్, మేము కూడా తప్పు చెబుతున్నాం. మీరు మాత్రమే కరెక్టు. మీరు మాట్లాడితే మేం వాస్తవాలు మాట్లాడాల్సి వస్తుంది. మరలా మీకు కోపం వస్తుంది. మీ 18 నెలల పాలనలో దాదాపు రూ. 2,66,175 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా? బడ్జెట్ అప్పు రూ.1,54,880 కోట్లు చేస్తే బడ్జెట్ బయట అప్పు రూ.1,11295 కోట్లు చేసిన మాట వాస్తవం కాదా? 2024-25 ఆర్ధిక సంవత్సరంలో రూ.81597 కోట్లు అప్పు చేశారా? లేదా? కాగ్ గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో రూ.67283 కోట్లు అప్పు, నవంబరు 4న రూ.3వేలు కోట్లు ,డిసెంబరు 2 న రూ.3వేలు కోట్లు మొత్తం అంతా కలిసి రూ.1,54,880 నిజామా? కాదా?.
ఇది కాకుండా బడ్జెట్ బయట పౌరసరఫరాలసంస్ధ రూ.7వేల కోట్లు ,మార్క్ ఫెడ్ రూ.18,700 కోట్లు, ఏపీఐఐసీ రూ.1000 కోట్లు, ఏపీఐఐసీ స్పెషల్ ఫర్పస్ వెహికల్ కింద రూ.7500 కోట్లు, ఏపీఎండీసి రూ.9000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ రూ.6710 కోట్లు, బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్థలు రూ.1150 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీపవర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కలిసి రూ.5473 కోట్లు, నాబార్డు ద్వారా డిస్కమ్ లకు రూ.3762 కోట్లు… ఈ మూడు విద్యుత్ సంస్థలకు కలిసి రూ.10385 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా?
జలజీవన్ మిషన్ రూ.10 వేల కోట్లు.. ఇవన్నీ కాకుండా అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు రూ.15వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కెఎఫ్ డబ్ల్యూ సంస్థ రూ.5వేల కోట్లు, ఎన్ ఏ బీ ఎఫ్ వై డీ నుంచి రూ.7500 కోట్లు, ఏపీపీఎస్సీయల్ నుంచి రూ.1500 కోట్లు కలిపి మొత్తం రూ.2,66,175 కోట్లు అప్పు చేసింది వాస్తవం కాదా? మీరా మాతో అప్పులు గురించి పోలిక చేసి మాట్లాడతారా?
మా హయాంలో రూ.10 లక్షల కోట్లు అని పచ్చి అబద్దాలు ముఖ్యమంత్రి స్ధానంలో ఎలా చెప్పగలుగుతున్నారు. మీరు అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన లెక్కల ప్రకారమే.. మా ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు మాత్రమే. 2019లో మీ ప్రభుత్వం దిగిపోయి, మా ప్రభుత్వం వచ్చేనాటికి ఉన్న అప్పు రూ.3,90,247 కోట్లు ఉంది. అంటే మీరు దిగిపోయేనాటికి ఉన్న అప్పు కూడా మేమే చేశామా?
మా హయాంలో చేసిన మేము ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. మీరు ఏడాదిన్నర లోనే రూ. 2.66 లక్షల కోట్లు అప్పు చేసి.. మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా.. అప్పులకోసం పరిమితి ఉంటే.. 2014-19 మధ్య మీరు రూ.29 వేల కోట్లు పరిమితి మించి అప్పులు చేస్తే, ఆ అప్పు మా దాంట్లో మైనస్ చేసిన మాట వాస్తవం కాదా? మా హయాంలో చంద్రబాబుది ఎంత ఆవేదన అంటే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని పచ్చి అబద్దాలు చెప్పారు. ఇవాళ రాష్ట్రం శ్రీలంక అయిపోవడం లేదా? అంత దిగులుపడ్డ వాళ్లంతా ఎక్కడున్నారిప్పుడు?
ఏప్రిల్ 3 2025లో రూ.5750 కోట్లు, మే 6న రూ.6822 వేల కోట్లు అప్పు చేయాలేదా? జూన్ 3 న రూ.7వేల కోట్లు, జూన్ 10, 2025న రూ.7వేల కోట్లు, 2025 జూలై 15న రూ.3600 కోట్లు, ఆగష్టు 5 న రూ.5వేల కోట్లు, సెప్టెంబరు 2న రూ.5వేల కోట్లు, సెప్టెంబర్ 30 రూ.2వేల కోట్లు, ఆక్టోబరు 7 రూ.1900 కోట్లు, నవంబరు 4న రూ.3వేల కోట్లు, డిసెంబరులో రూ.3వేల కోట్లు అప్పు చేయలేదా? ఇవన్నీ మేం ఊహించుకుంటున్నామా? రాష్ట్రం అప్పుల పాలవుతుందని దిగులుపడ్డ వారందరి దిగులు ఇప్పుడు ఎక్కడకు పోయింది? ఇప్పుడు రాష్ట్రం శ్రీలంక కాదా? ఆ దిగులుపడ్డ వాళ్లంతా ఎక్కుడున్నారు? కాగ్ ఏం చెప్పిందంటే.. 2025-26లో దేశవ్యాప్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ.63,052 కోట్లతో దేశంలోనే ప్రధమ స్ధానంలో ఉందని చెప్పింది. ఈ లెక్కలు మేమే రాశామా?
మీ సొంత జిల్లా చిత్తూరులో మామిడి పంటను కొనుగోలు చేయకుండా వదిలేసిన మాట వాస్తవం కాదా? ఏ పంటకూ మద్ధతు ధర లేదు. అనంతపురం, కడప, నంద్యాల, కర్నూలులో ఉల్లి రైతుల పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది. ఉల్లికి రూ.20వేలు ఎకరాకు ఇస్తామని చెప్పారు. హెక్టారుకు రూ.50వేలు అని చెప్పారు, ఇంతవరకు ఒక్క రైతుకీ ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. పైగా ఇ-క్రాప్ నమోదు కాకుండానే రుబాబు చేసి పేర్లు రాసుకుని, ఒక్కరికీ పరిహారం ఇవ్వలేదు.
మీ హయాంలో ఛార్జీలు పెంచలేదని చెబుతున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కు మీరు ఇచ్చిన విజ్ఞప్తి ప్రకారం .. రేటు పెరిగిన మాట వాస్తవమా ? కాదా? ఓపీ నెంబరు 57,60,63,66 ప్రకారం 25 అక్టోబరు 2024 మీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు.
ఇక 2022-23 నాటికి సంబంధించి ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జెస్ట్ మెంట్ ప్రకారం.. 2024 నవంబరు, డిసెంబరులో 60 పైసలు, 60 పైసలు కలిపిన మాట వాస్తవం కాదా? ఈ విధానం ద్వారా రూ.6072 కోట్లు ప్రజల మీదా ప్రతినెలా, ప్రతి యూనిట్ మీదా 60 పైసలు చొప్పున భారం మోపిన మాట నిజం కాదా? ఇది మీ ఆర్డర్ కాదా?
మరొకటి ఓపీ నెంబరు 69,70 ప్రకారం 2023-24 కు సంబంధించిన డబ్బులు ప్రతినెలా 45 పైసలు చొప్పున భారం మోపిన మాట వాస్తవం కాదా? దీని ద్వారా 2023-24కు సంబంధించిన రూ.9412 కోట్లు 2025-26 లో వినియోగదారుల మీద మోపిన మాట నిజం కాదా? అదే విధంగా 2025-26 కు అడ్వాన్స్ గా రూ.2786 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇది పెరుగుదల కాదా?
ఇక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ లో మా మీద నెపం వేస్తున్నారు. బొగ్గుతో కూడిన పవర్ ప్లాంట్లలో యూనిట్ రూ.4.22 కే యూనిట్ దొరుకుతుంటే మీరు మాత్రం రూ.5.94 కే ఎలా కాంట్రాక్ట్ చేసుకుని 25 ఏళ్లకు నిర్ణయించుకున్నారు. విండ్ మిల్స్, టర్బైన్స్ పెద్దవి అయ్యే కొద్ది ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా ఎలా ఒప్పందం చేసుకున్నారు. మీరు వాయు విద్యుత్ లో రూ.4.22 బదులుగా రూ.6 కు కొన్నారు. ధర్మల్ పవర్ లో కూడా ఇలాగే రూ.6.99 కి పర్చేజ్ చేశారు. దీనివల్ల బొగ్గు విద్యుత్ ఆపాల్సి వచ్చినప్పుడు అది కాస్తా రూ.8.09 పడింది.
మిమ్నల్ని అద్బుతంగా సపోర్టు చేశారు. మీ గెలుపునకు సగం వారే కారణం. పీఆర్సీ పెట్టారా? ఐఆర్ ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అన్నారు. ఉన్న పీఆర్సీనే తీసేశారు. పీఆర్సీ పెడితే ఐఆర్ ఇవ్వాల్సి వస్తుంది, పెట్టడం లేదు. రూ. 31 వేల కోట్లు ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలి. చివరకు ఒక్క డీఏ ప్రకటించి అది ఎప్పుడో చెల్లిస్తామని చెప్పారు. పోలీసుశాఖ పరిస్ధితి మరీ దారుణం. వారికి టీఏ, డీఏలు చెల్లించడం లేదు. ఏఎస్ ఎల్, ఎస్ ఎల్ కూడా ఇవ్వడం లేదు. రూ.1000 కోట్లు బకాయిలు ఉంటే.. ఒక్క నవంబరు 2024కు సంబంధించిన అడిషనల్ సరెండర్ లీవ్ లు నవంబరులో రూ.105 కోట్లు, డిసెంబరులో రూ.105 కోట్లు అని ప్రకటించి ఇంతవరకూ అవి కూడా ఇవ్వలేదు. ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి.
ఒకటో తేదీనే జీతాలిస్తామని హామీ ఇచ్చారు. కోవిడ్ లో మా హయాంలో ఒకటి రెండు రోజులు జీతాలు ఆలస్యం అయితే ఉద్యోగులు ఎన్నో మాటలన్నారు. కోవిడ్ ఉందని చెప్పినా రాక్షసులు మాదిరిగా చూశారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో 10 వతేదీ వచ్చినా పౌరసరఫరాలు, పబ్లిక్ హెల్త్, సర్వే, వ్యవసాయ, పరిశ్రమ, రవాణా, ఐ అండ్ పీఆర్ ,ఆర్ అండ్ బీ, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అరణ్యశాఖ, ఐసీడీఎస్, భూగర్భశాఖ, పంచాయితీ రాజ్, స్టాంపులు, రిజిష్ట్రేషన్ శాఖ, ఆర్ డబ్లూఎస్ వీళ్లెవరికీ జీతాలు రాలేదు..
అన్నింటికంటే చాలా పెద్ద దందా.. బయో ఫెస్టిసైడ్స్ పేరుతో టీడీపీ నాయకులు విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. టీడీపీలో చాలా పెద్ద, ముఖ్యమైన నాయకులే ఈ దందా వెనుక ఉన్నారు. మీరు కావాలంటే తనిఖీ చేసుకోవచ్చు. డ్రోన్ల పేరుతో భారీ కుంభకోణమే జరుగుతుంది. ఒక్కో డ్రోన్ రూ.3.50 లక్షలు ఉంటే, ప్రభుత్వం మాత్రం రూ.9.80 లక్షలకు కొనుగోలు చేస్తోంది. ఇందులో 80శాతం సబ్సిడీ ఇస్తుంది. అంటే రైతు రూ.2 లక్షలు కడుతున్నాడు. అతను రూ.2 లక్షలకే వస్తుందని అనుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం సబ్సిడీ పేరుతో ఇస్తున్న డబ్బులు ఎక్కడకుపోతున్నాయి? వ్యవసాయంలో కూడా విపరీతమైన అవినీతి చోటుచేసుకుంటుంది. దీనిపై ఏం సమాధానం చెప్తారని బుగ్గన రాజేంద్రనాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు.