Suryaa.co.in

Editorial

ఇజ్రాయెల్-పాలస్తీనా.. సెటిలర్లు.. ఒక బీఆర్‌ఎస్!

– ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో బీఆర్‌ఎస్ ఎటువైపు?
– క్త్రైస్తవుల పక్షమా? ముస్లింల వైపా?
– ఇజ్రాయెల్‌కు మద్దతునిచ్చిన బీజేపీ
– పాలస్తీనా వైపు వామపక్ష మేధావులు
– హైదరాబాద్‌లో పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన
– బీఆర్‌ఎస్ వైఖరిపై బీజేపీ ప్రశ్నాస్త్రం
– ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌పై గురి చూసి కొట్టిన బీజేపీ
– బీఆర్‌ఎస్ గళం విప్పాలన్న బీజేపీ నేత మురళీధర్‌రావు
– బీజేపీ ప్రశ్నలపై బీఆర్‌ఎస్ వ్యూహాత్మక మౌనం
– వైఖరి చెప్పాలంటున్న ముస్లిం-క్రైస్తవ సంఘాలు
– ఎవరి వైపు మొగ్గు చూపినా ఎన్నికల్లో ప్రమాదమే
– అందుకే పెదవి విప్పని బీఆర్‌ఎస్
– ఇప్పటికే ‘గ్రేటర్’లో చంద్రబాబు అరెస్టుపై సెటిలర్ల లొల్లి
– కాలనీలలో కాగడాల ప్రదర్శనల హోరు
– తాజాగా మెట్రో స్టేషన్ల వద్ద ఐటీ ఉద్యోగుల ఆందోళన
– పోలీసు అరెస్టులపై ఐటీ ఉద్యోగుల ఆగ్రహం
– జిల్లాలలో ఆగని సెటిలర్ల నిరసనల సెగ
– కాంగ్రెస్ వైపు సెటిలర్ల చూపు
– సెంటి‘మంటల్లో’.. బీఆర్‌ఎస్
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకిపెళ్లి సుబ్బిచావు పాత సామెత. ఇప్పుడు కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నది తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు సరిగ్గా వర్తించే సామెత. ఇంకా సూటిగా చెప్పాలంటే, రెండూ జమిలిగా వర్తించే సూత్రాలే! కీలకమైన ఎన్నికల వేళ హటాత్తుగా తెరపైకి వచ్చిన.. కాదు.. కాదు.. తెచ్చిన రెండు కీలక అంశాలు, అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి.

అందులో ఒకటి పరాయి దేశాలకు చెందిన వ్యవహారమయితే.. మరొకటి పరాయి రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఈ రెండు అంశాలకు తెలంగాణ గడ్డపై బంధం ఉండటమే గమ్మతు. ఈ యవ్వారంలో ‘కారు’ ఎటు వైపు వెళ్లినా ప్రమాదమే. అందుకే వ్యూహాత్మకమౌనం!! ఇందులో ఒక అంశాన్ని బీఆర్‌ఎస్ మెడకు చుట్టింది బీజేపీ అయితే.. మరో అంశాన్ని అందుకున్నది సెటిలర్లు. రెండూ సెంటి‘మంటలే’!!!

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మాచెడ్డ కష్టాలొస్తున్నాయి. అభ్యర్ధులను ప్రకటించి.. అందులో కొందరికి బీఫారాలు కూడా ఇచ్చేసి, ‘కారు’ను దూకించాల్సిన సమయంలో.. తెరపైకి వచ్చిన రెండు కీలక అంశాలు, ‘కారు’ స్పీడుకు బ్రేకులు వేస్తుండటం, క్యాడర్‌ను కలవరపరుస్తోంది. అందులో ఒకటి ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధమయితే.. రెండోది టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు అంశం. తెలంగాణకు ఏమాత్రం సంబంధం లేని ఈ అంశాలకు- ఎన్నికలకు సంబంధమేమిటనుకోవడం సహజం. కానీ ఆ రెండు అంశాలూ రొటీన్‌కు భిన్నం. అదెలాగో చూద్దాం.

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం రగులుతోంది. పాలస్తీనా హమాస్ మిలిటెంట్ గ్రూపు-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో, బీజేపీ ఇజ్రాయెల్ పక్షాన నిలిచింది. ఆ దేశానికి మోదీ నైతిక మద్దతు ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలనలో చేతులు కలుపుతామని భరోసా ఇచ్చారు. అయితే దేశంలోని కొందరు వామపక్ష మేధావులు పాలస్తీనాకు మద్దతు ప్రకటిస్తూ, ఢిల్లీలోని పాలస్తీనా రాయమారిని కలవడం విమర్శలకు దారితీసింది. హటాత్తుగా హైదరాబాద్‌లో కూడా పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించడం కలవరం కలిగించింది.

నిజానికి ఈ వ్యవహారంతో తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. కానీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు కదిపిన యుద్ధ తేనెతుట్టె, ‘కారు’ను కదలనివ్వని పరిస్థితికి చేర్చింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో.. కేంద్రం ఇజ్రాయెల్ వైపు ఉన్న నేపథ్యంలో, బీఆర్‌ఎస్ వైఖరి ఏమిటన్న ప్రశ్న సంధించి.. అధికార పార్టీని వ్యూహాత్మకంగా మతం ఉచ్చులోకి లాగే వ్యూహానికి తెరలే పింది. వాస్తవానికి, యుద్ధం ప్రారంభమై చాలాకాలమయినప్పటికీ .. ఇలాంటి రాజకీయ ఎత్తుగడకు తెరలేపాలన్న తెలివి-ఆలోచన బీజేపీ అగ్రనేతలకు తట్టకపోవడమే ఆశ్చర్యం.

ఇక్కడ బీజేపీ జాతీయ అగ్రనేత మురళీధర్‌రావు ప్రస్తావించింది ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధ అంశమే అయినప్పటికీ.. రెండు మైనారిటీ మతాల్లో, బీఆర్‌ఎస్ ఎటు వైపు ఉంటుందని చెప్పకనే చెప్పడంగా స్పష్టమవుతుంది. ఇజ్రాయెల్ క్రైస్తవ దేశం-పాలస్తీనా ముస్లిం దేశం కాబట్టి.. బీఆర్‌ఎస్ ఏ మతం వైపు ఉంటుందని, మురళీధర్ లౌక్యంగా ప్రశ్నించడాన్ని విస్మరించకూడదు. పైగా తాము ఉగ్రవాదానికే వ్యతిరేకం తప్ప, ముస్లిములకు కాదన్న మరో వివరణ కూడా ఇచ్చి లౌక్యం ప్రదర్శించారు. ఏదేమైనా తాము క్రైస్తవ దేశమైన ఇజ్రాయెల్ వైపే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

అంటే బీజేపీ క్రైస్తవుల పక్షమే ఉంటుందని చెప్పకనే చెప్పారన్న మాట. ఇది తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన అంశంగా భావించక తప్పదు. ఇవన్నీ తెలంగాణలోని క్రైస్తవులు-దళిత క్రైస్తవుల ఓట్లను, ఆకర్షించే రాజకీయ ఎత్తుగడ అన్నది మనం మనుషులం అన్నంత నిజం.

దానికి తగినట్లుగానే పలువురు క్రైస్తవ సంఘ నేతలు, ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణలోని దళితుల్లో 65 శాతం మతం మారిన క్రైస్తవులే అన్నది విస్మరించకూడదు. ఈ రాజకీయ కూడికలు-తీసివేతలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే, బీజేపీ నేత మురళీధరన్ మత అస్త్రాన్ని బీఆర్‌ఎస్‌పై సంధించినట్లు అర్ధమవుతుంది.

అయితే దీనిపై బీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటిదాకా స్పందించినట్లు లేదు. ప్రణాళికా సంఘ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ మాత్రం.. తాజా ఇండో-చైనా మిత్రమండలి సమావేశంలో, ప్రపంచంలో కొన్ని దేశాల మధ్య ఘర్షణలు జరుగుతుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

కానీ ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధాన్ని ప్రస్తావించకుండా, అందులో తప్పెవరిదని వ్యాఖ్యానించకుండా జాగ్రత్త పడ్డారు. ప్రణాళికాబద్ధంగా చైనాను అభివృద్ధి చేసిన జియోపింగ్ బాటలోనే, కేసీఆర్ అభివృద్ధి బాటలో పయనిస్తున్నారని ప్రశంసించారు. ప్రభుత్వాల తీరు ఎలా ఉన్నా, ఇండో-చైనా ప్రజలు మిత్రులని వ్యాఖ్యానించారు. చైనా అధినేతను పొగిడిన వ్యాఖ్యను, బీజేపీ నేత మురళీధర్‌రావు గమనించినట్లు లేరు.

బీఆర్‌ఎస్ అభ్యర్ధులకు బీ ఫారాలు ఇచ్చిన సందర్భంలో.. బీఆర్‌ఎస్ అధినేత-సీఎం కేసీఆర్ గానీ, రోజూ మీడియాతో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ గానీ, ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ప్రస్తావనార్హం. ఆ అంశంలో వారి వ్యూహాత్మకమౌనం వెనుక, ఓట్లేనన్నది బహిరంగ రహస్యం. రెండు దేశాల్లో ఎవరిని సమర్ధించినా, ఆ దేశానికి సంబంధించిన ఇక్కడి మతస్తుల మనోభావాలు దెబ్బతినడం సహజం. అది అనవసర వివాదాన్ని రేపినట్టవుతుంది.

పైగా ఇప్పటివరకూ ముస్లిములు, బీఆర్‌ఎస్‌కు బాసటగా నిలుస్తున్నారు. అటు వారి ప్రతినిధి మజ్లిస్‌తో కూడా బీఆర్‌ఎస్ సఖ్యతగానే ఉంది. మరోవైపు క్రైస్తవులు-దళితులు కూడా ఎక్కువ శాతం బీఆర్‌ఎస్ వైపే ఉన్నారు. పైగా తెలంగాణలో ముస్లింలు, బీజేపీ వ్యతిరేక కోణంలో కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి.

కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటి అనవసర వివాదంపై వ్యాఖ్యానిస్తే జరిగే గత్తర ఏమిటన్నది తెలుసు. అందుకే అటు క్రైస్తవ దేశమైన ఇజ్రాయెల్‌ను గానీ-ఇటు ముస్లిం దేశమైన పాలస్తీనాను గానీ సమర్ధించకుండా.. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు, మెడపై తల ఉండే ఎవరికయినా అర్ధమవుతుంది.

ఇక టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు సెగ.. ఆంధ్రా నుంచి తెలంగాణకు తగులుతోంది. గతంలో ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లో చేసిన ఆకస్మిక ఆందోళనలు.. హైదరాబాద్‌ టు రాజమండ్రి వరకూ నిర్వహించిన కార్ల ర్యాలీ సెగ ‘కారు’కు తగిలింది. దానితో ఏపీ రాజకీయాలు ఇక్కడెందుకన్న కేటీఆర్‌ వ్యాఖ్యలపై, సెటిలర్లు గుర్రుగా ఉన్నారు.

అది చాలదన్నట్లు.. తాజాగా ఐటీ ఉద్యోగులు మెట్రోరైళ్లలో కొత్త తరహా నిరసన మార్గానికి తెరలేపడంతో, భారీ అరెస్టులు జరిగాయి. ఇది కూడా బీఆర్‌ఎస్‌పై సెటిలర్ల కోపానికి కారణమయింది. నాయకుడు లేకపోతేనే నిరసనలు ఈస్థాయిలో జరుగుతుంటే, ఇక నాయకత్వం బలంగా ఉంటే పరిస్థితి ఏమిటన్న చర్చ తెరపైకొచ్చింది.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని దాదాపు 35 నియోజకవర్గాల్లో ప్రభావం ఉన్న కమ్మ సామాజికవర్గం మరో అడుగుముందుకేసి… కాంగ్రెస్‌కు ఓటేయాలని వాట్సాప్‌ సందేశాలకు తెరలేపింది. చంద్రబాబు అరెస్టు చేసిన జగన్‌ సర్కారుకు బీజేపీ-బీఆర్‌ఎస్‌ మద్దతు ఉందని భావించడమే దానికి కారణం. తెలంగాణలోని కమ్మ సంఘాలకు ఈ ఎస్‌ఎంఎస్‌లు ప్రవాహంలా వెళుతుండటం విశేషం. అంటే సెటిలర్లు ‘కారు’ దిగి, ‘చే’యెత్తి కొట్టేందుకు సిద్ధమవుతున్నారన్నమాట. ఈ పరిణామాలు కూడా కారుకు కలవరం కలిగించేవే.ఇది కూడా చదవండి: తెలంగాణలో కాంగ్రెస్‌ కు ‘కమ్మ’టి సందేశం

అయితే బాబు అరెస్టు అనంతర పరిణామాలు గమనించిన, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కొందరు.. తమ నియోజకవర్గాల్లో కమ్మ-సెటిలర్లను ప్రసన్నం చేసుకునేందుకు, బాబు అరెస్టును ఖండించాల్సిన అనివార్య పరిస్థితి. మరికొందరు ఎమ్మెల్యేలయితే నేరుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైచిత్రి.

కానీ ఇదంతా తమ ఓట్ల కోసమేనని, చంద్రబాబు అరెస్టును కేసీఆర్‌-కేటీఆర్‌ ఖండిస్తే తప్ప, బీఆర్‌ఎస్‌ను నమ్మేదిలేదని కమ్మసంఘాలు కుండబద్దలు కొడుతున్నాయి. ఈ విధంగా తనకు ఏమాత్రం సంబంధం లేని, రెండు కీలక అంశాలు బీఆర్‌ఎస్‌కు తలనొప్పిలా పరిణమించాయి.

LEAVE A RESPONSE