– పిల్లలను హైస్కూల్ వరకు సర్కారు బడుల్లో చదవించాలి
– కన్నా రంగయ్య ట్రస్ట్ సేవలు విస్తృత పరుస్తాం
– ఉపకారవేతనాల పంపిణీలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: పట్టణం కాకతీయ కల్యాణ మండపంలో ప్రతిభావంతులైన విద్యార్థినివిద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మేయర్ కన్నా నాగరాజు, ఆర్డీవో రమాకాంత్ రెడ్డి పాల్గొన్నారు. 84 మంది విద్యార్థినివిద్యార్థులకు 11 లక్షల 15 వేల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులని అందరూ ప్రోత్సహించి, వారిని తట్టి ముందుకు నడిపించాలి. ప్రభుత్వ పాఠశాలలో చదివిన చాలామంది శాస్త్రవేత్తలుగా దేశానికి ప్రపంచానికి సేవలందిస్తున్నారన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తేనే పిల్లలకు చదువు వస్తుందని తల్లిదండ్రులు భావించడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం హై స్కూల్ వరకు పిల్లల్ని చదివించాలి. బాగా పిల్లల్ని చదివించి దేశానికి ఉపయోగపడే విజ్ఞాన బండాగారాలుగా వారిని తీర్చిదిద్దాలని కోరారు.
కన్నా రంగయ్య పేరుతో ఇస్తున్న ఉపకార వేతనాలు ప్రతిభావంతుల చదువుకు భరోసాతో పాటు వారి విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు దోహదం చేస్తాయి… 2013 నుంచి కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులు, నిరుపేదల అభ్యున్నతికి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు.
గతంలో గుంటూరు నుంచి నిర్వహించే కార్యక్రమాల్ని మూడు సంవత్సరాల నుంచి సత్తెనపల్లిలో నిర్వహిస్తున్నాం. మీ అందరి సహకారంతో సేవ చేయగలుగుతున్నా. రాబోయే రోజుల్లో చారిటబుల్ ట్రస్ట్ సేవల్ని విస్తృతం చేస్తాం. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.