-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
బాసర ట్రిపుల్ ఐటీలో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ వేలాది మంది విద్యార్థులు చేస్తున్న న్యాయమైన ఆందోళనను అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపు ధోరణులకు పాల్పడటం సిగ్గు చేటు.
ఒకవైపు సమస్యల పరిష్కారానికి చర్చలు నిర్వహిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం… మరోవైపు విద్యార్థి నాయకులను కలెక్టర్ పిలిపించుకుని ఆందోళనను విరమించుకోకపోతే ట్రిపుల్ ఐటీ నుండి బహిష్కరిస్తామని బెదిరించడం క్షమించరాని నేరం.
జిల్లా కలెక్టర్ గా సమన్వయ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఐఏఎస్ అధికారి టీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తూ విద్యార్థులను బెదిరించి ఉద్యమాన్ని అణగదొక్కాలనుకోవడం దారుణం. ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వెంట్స్ గా ఉంటూ తమ బాధ్యతలు నెరవేర్చని వారికి గత ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి. లేనిపక్షంలో వారికి పట్టిన గతే మీకూ పడుతుందని హెచ్చరిస్తున్నాం.
తక్షణమే ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకోవాలి. వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులతో చర్చలు జరపాలని బీజేపీ తెలంగాణ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం.