– అసలు ఉద్దానం సమస్య ఏంటో, ఉద్దానం ఎక్కడుందో ఆరోగ్య మంత్రికి తెలుసా?
– టీడీపీ హయాంలో చేసిన పరీక్షలు, పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు
– ఇచ్ఛాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్
ఆరోగ్య శాఖా మంత్రిగా పనిచేస్తున్న విడదల రజనీ గారికి ఉద్దానం ఎక్కడుందో తెలుసా? ఎందుకంటే అసలు సమస్య అంటే ఏంటో తెలియని మంత్రి సమస్యను పరిష్కరించేశామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాలపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్ధం కావడం లేదు.
ఉద్దానం ఒకప్పుడు ఉద్యానప్రాంతంగా ప్రసిద్ది. కానీ నేడు కిడ్నీ సమస్యలతో ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు చేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతోందని అనేక మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. తాజాగా ఆరోగ్య శాఖా మంత్రి ఉద్దానం ప్రాంతంలో 1,25,605 మందికి కిడ్నీ టెస్టులు చేసినట్లు మాట్లాడారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం జరిగినవే. కానీ, నాడు చేసిన అన్ని కార్యక్రమాలను నేడు వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలోకి వేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు.
జార్జ్ ఇన్ట్సిట్యూట్, టాటా ఎన్విరాన్ మెంట్ రీసెర్చ్ ఇన్ట్సిట్యూట్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వివేకానంద్ జా గారి ఆధ్వర్యంలో పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ కమిటీలతో వైసీపీకి ఏం సంబంధం? నాడు పరిశోధన చేయిస్తే.. దాన్ని కూడా వీరి ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు.
చంద్రబాబు నాయుడు ఇన్ని సంస్థలను ఏర్పాటు చేసి పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం నాడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రీసెర్చ్ పేరుతో అనేక మంది వచ్చి బాధితుల నుంచి సాంపిల్స్ తీసుకుని ఎటువంటి రీసెర్చ్ చేయకపోవడంతో బాధితులు విసిగిపోయారు. ఉద్దానం అనేది ఇచ్చాపురం, పలాస నియోజకర్గాల పరిధిలో ఉంటుందనే విషయం మంత్రికి తెలుసా?
కిడ్నీ బాధితులు ప్రభుత్వం ద్వారా సహాయం చేయండని కోరితే.. చంద్రబాబు నాయుడు మరో ప్రశ్న కూడా లేకుండా మొట్టమొదటిసారిగా పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టారు. డయాలసిస్ చేసుకుంటున్న కిడ్నీ పేషంట్లకు రూ.250 నగదు ఫించన్, హిమోపాయిటన్ లాంటి అనేక మందులు ఉచితంగా ఇచ్చాం.
అన్నింటికంటే ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి మంజూరైన ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా.. ఉద్దానం ప్రాంత ప్రజలకు కూడా శుద్ధమైన మంచినీటిని అందించేలా చంద్రబాబు గారిని ఒప్పించి ఇక్కడ పథకం ఏర్పాటు చేశాం. రూ.2 లకే 20 లీటర్ల ఫ్యూరిఫైడ్ వాటర్ పథకాన్ని తీసుకొస్తే.. జగన్ రెడ్డి దాన్ని నాశనం చేశారు.
ఆరోగ్యశాఖా మంత్రిగా విడదల రజనీ ముందుగా ఫీహెచ్.సీ అంటే ఏమిటో? సబ్ సెంటర్లు అంటే ఏమిటో తెలుసుకోవాలి. సబ్ సెంటర్లపరిధిలో సైతం సెమీ ఆటో అనలైజర్లను తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన విషయం కూడా తెలుసుకోవాలి. సెమీ ఆటో అనలైజర్ల ద్వారా వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి వారికి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రులకు పంపాం. హెచ్.ఐ.వీ పేషంట్లకు మెడాల్ సంస్థ ద్వారా స్థానికంగా అన్ని టెస్టులు నిర్వహించి వారికి మెరుగైన వైద్యం అందిస్తే దాన్ని కూడా జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారు. నేడు హెచ్.ఐ.వీ వ్యాధిగ్రస్తులు విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన టెస్టులను సైతం జగన్ రెడ్డి, మంత్రి విడదల రజినీ వారి ఖాతాలలో వేసుకుంటున్నందుకు సిగ్గుపడాలి. ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉండదు. పి.హెచ్.సీలలో కనీసం డాక్టర్లు లేరంటే వైసీపీ ప్రభుత్వానికి సిగ్గనిపించడం లేదా? శవాలకు ఫోస్ట్ మార్టం చేసేందుకు కూడా డాక్టర్లు లేరు. డాక్టర్లు లేక నాలుగు గంటలు చేయాల్సిన డయాలిసిస్ రెండు గంటలే చేస్తున్నారు. దీన్నిబట్టి కిడ్నీ రోగులు ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్య వైఖరి చూపుతుందో అర్ధం అవుతుంది. జగన్ రెడ్డి పాదయాత్రలో ప్రతి పీహెచ్సీలో డయాలసిస్ సెంటర్ పెడతానని హామీ ఇచ్చారు. కానీ నాలుగు మండలాల్లో ఏ ఒక్క మండలంలో కూడా డయాలిసిస్ సెంటర్లు పెట్టలేకపోయాడు.
పలాసలో కిడ్నీ ఆస్పత్రిని టీడీపీ హయాంలోనే ప్రారంభోత్సవం చేశారు. మూడున్నర సంవత్సరాల్లో ఆసుప్రతిని పూర్తి చేయడానికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. మార్చి నాటికి కంప్లీట్ చేస్తామని మంత్రి పదే పదే చెప్తున్నారు. ఆయన మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే రీసెర్చ్ టీం రిపోర్టును బేస్ చేసుకొని మనం కార్యక్రమం చేయాలి. రీసెర్చ్ టీం ఏం చేసింది? కొత్తగా మీరేసిందా? గత ప్రభుత్వం వేసిన టీమా? ఈరోజు వరకు దానిపై ఏం సమీక్షలు చేశారు? తీసుకొచ్చిన రిజల్ట్ చూపండి. కేవలం కలర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
జగన్ కు పచ్చకామెర్లు ఉండడంతో లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లుంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే పది సీట్లు గెలవడం కూడా కష్టమేనని వారి సర్వేల్లోనే తేలింది. అయినా అన్నీ గెలిచేస్తామంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు గ్రామాల్లో వీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గుట్టు తేల్చేస్తున్నారు. అధికార పార్టీ నేతల్ని చెడుగుడు ఆడుకుంటున్నారు.
మంత్రులు సైతం గ్రామాల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో జగన్ అన్ని సీట్లు గెలవాలని సమీక్షలు చేస్తే గెలుస్తాననుకోవం భ్రమే అవుతుంది. వైసీపీ నాయకులు చేసే అఘాయిత్యాలన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలు ఆతృతగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.