Suryaa.co.in

Telangana

పాలమూరు జిల్లా నుంచి వలసలు లేవని మంత్రి చెప్పడం సిగ్గుచేటు

– బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వద్ద కూర్చి వేసుకొని, కాపలా కుక్కలా ఉండి నిర్మాణం చేస్తానని చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే పాలమూరులో పర్యటించడం పై , రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోమవారం చేసిన పలు విమర్శల పై డీకే అరుణ ఘాటుగా స్పందిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పాలమూరు జిల్లా నుంచి వలసలు లేవని మంత్రి చెప్పడం సిగ్గుచేటని డీకే అరుణ మండిపడ్డారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ముఖ్యమంత్రి పట్టించుకోకుండా ఉంటే , ప్రశ్నించలేని దద్దమ్మ మంత్రులు, బిజెపి నాయకుల పై విమర్శలు చేసే అర్హత లేదని డీకే అరుణ అన్నారు. పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్ కోసం తాను సర్వే చేయించి, రిపోర్ట్ ఇవ్వకపోతే అసలు ప్రాజెక్ట్ పేరు కూడా తెరాస నాయకులకు తెలియకపోయేదని ఆమె ఎద్దేవా చేసారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత పాలమూరు కు తెలంగాణ ప్రభుత్వం చేసిందేమీ లేదని, కేంద్ర మంత్రులను టూరిస్టులు అనడానికి సిగ్గు ఉండాలని, బిజెపి నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే, ముఖ్యమంత్రికి గుబులు పుట్టి కాలు కాలిన పిల్లిలా జిల్లాలో పర్యటిస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని డీకే అరుణ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బిజెపి నాయకుల పై విమర్శలుమాని, అభివృద్ధి పై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజలు తెరాస నాయకులను తరిమి కొడ్తారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE