-పిచ్చోడి చేతిలో రాయి… జగన్ రెడ్డి చేతిలో పోలవరం
-తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రు
పిచ్చి తుగ్లక్ సీయం… అనే అంశాన్ని భవిష్యత్ తరాల కోసం పాఠ్యాంశంగా చేర్చాలి. ఎందుకంటే, జగన్‌రెడ్డి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా దెబ్బతీశాయో తెలుసుకోవాలి. జగన్‌రెడ్డి తుగ్లక్ చర్యలతో 5 కోట్ల బహుళార్ధక సాధక ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా మెఘా సంస్థకు అప్పగించి రూ.750 కోట్లు ఆదా చేశామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు రూ.8,500 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. టీడీపీ హయాంలో ఒక యజ్ఞంలా సాగిన పోలవరం ప్రాజెక్టు పనులు నేడు పూర్తిగా నిలిచిపోయాయి.
లక్ష్యాలను సాధించడంలో కాంట్రాక్టు సంస్థ విఫలమైనా ముఖ్యమంత్రి గానీ, ఇరిగేషన్ శాఖామంత్రి గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన రూ.733 కోట్లను రీయంబర్స్ మెంట్ చేయమంటే తొలి విడతగా కేంద్రం రూ.320 కోట్లు విడుదల చేసింది. కానీ, లక్ష్యాల మేరకు పనులు పూర్తి చేయకపోవడంతో రాష్ట్రానికి ఇచ్చిన రూ.320 కోట్లు కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వ చర్యలతో పోలవరం పూర్తికావడమనేది ప్రశ్నార్థకమైంది? పోలవరానికి రావాల్సిన నిధులు కూడా కేంద్రం ఇవ్వకుండా వెనకడుగు వేస్తుందంటే పనులు ఎంత అస్తవ్యస్తంగా నిర్వహిస్తున్నారో స్పష్టమవుతుంది.
నిర్వాసితులకు ఎకరానికి రూ.19 లక్షలు ఇస్తానని పాదయాత్రలో జగన్‌రెడ్డి హామీ నిచ్చి, తరువాత మాట మార్చి రూ.10 లక్షలు ఇస్తామన్నారు. ఇప్పుడు అవి కూడా ఒక్కరికి అమలు చేయలేదు. నిర్వాసితులకు 2020 జూన్ నాటికి 17వేల ఇళ్లు కట్టించి ఇస్తామన్న హామీ, పరిహారం చెల్లిస్తామన్న హామీలు ఏవీ కార్యరూపం దాల్చలేదు. న్యాయం కోసం నెలల కొద్ది నిర్వాసితులు దీక్షలు, ధర్నాలు చేస్తుంటే జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. పేకాట డెన్‌లు, క్యాసినోలు నిర్వహించడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదు.
ప్రతి సోమవరాన్ని పోలవరంగా మార్చుకుని చంద్రబాబునాయుడు పనులను శరవేగంగా నడిపిస్తే జగన్‌రెడ్డి మాత్రం సోమవారాన్ని జూద దినోత్సవంగా, మంగళవారాన్ని మాఫియా దినోత్సవంగా, బుధవారాన్ని మద్యం దినోత్సవంగా, గురువారం గంజాయి దినోత్సవంగా, శుక్రవారం పబ్ ల దినోత్సవంగా, శనివారం క్యాసీనో దినోత్సవంగా ఆదివారం కలెక్షన్ల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. పోలవరం పూర్తి మొదట 2021 ఏప్రెల్, రెండోసారి 2021 డిసెంబర్ ఇప్పుడు 2022 జూన్ అంటున్నారు. కేంద్రం అది కూడా డౌటే అని తెగేసి చెప్పింది. డీపీఆర్ -2 కింద రూ.55,578 కోట్లు అనుమతి ఇవ్వాలని జగన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించలేకపోతున్నారు?